పంజాబ్‌లో దారుణం: డ్రగ్స్‌ బానిసై, రెండేళ్ల చిన్నారితోపాటు సోదరుడి కుటుంబాన్ని హత్య చేసి..

13 Oct, 2023 15:06 IST|Sakshi

చండీగఢ్‌: డ్రగ్స్‌కు బానిసగా మారిన 28 ఏళ్ల యువకుడు సొంత సోదరుడి కుంటుంబాన్ని కిరాతకంగా హత్య చేశాడు. అన్న, అతని భార్యతో సహా రెండేళ్ల మేనల్లుడిని చంపి మృతదేహాలను కాలువలో పడేశాడు, ఈ దారుణ ఘటన మోహాలీ జిల్లాలోని ఖరార్ గ్లోబల్ సిటీలో జరిగింది. ఈ ఉదంతం గత మంగళవారం రాత్రి చోటుచేసుకోగా.. గురువారం రాత్రి వెలుగులోకి రావడం గమనార్హం. 

వివారలు.. బార్నాలాకు చెందిన సత్బీర్ సింగ్‌కు అమన్‌దీప్‌ కౌర్‌ అనే యువతితో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఉద్యోగరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన సత్బీర్‌ సింగ్‌ తన కుటుంబంతో కలిసి గ్లోబల్‌ సిటీకి వచ్చి జీవిస్తున్నాడు. సత్బీర్ తన వ్యాపారాన్ని మంచిగా కొనసాగిస్తూ స్థిరపడటంతో అతని తమ్ముడు లఖ్బీర్‌కు ఈర్ష్యా కలిగింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సత్బీర్‌ తమ్ముడు  లక్బీర్‌ ఇంటికి వచ్చాడు. 

అప్పటికే డ్రగ్స్‌కు బానిసైన లఖ్బీర్‌ తన సోదరుడిపై పగతో మంగళవారం రాత్రి ముందగా వదిన అమన్‌దీప్ కౌర్‌ను గొంతుకోసి హత్య చేశాడు. సత్బీర్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నింగా.. అతన్ని కూడా పదునైన ఆయుధంతో కొట్టి చంపాడు. అనంతరం పసికందు అనే జాలి లేకుండా దంపతుల రెండేళ్ల కుమారుడిని హత్య చేశాడు. ముగ్గురిని చంపిన తర్వాత.. సత్బీర్, అమన్‌దీప్ మృతదేహాలను రోపర్‌లోని సిర్హింద్ కాలువలోకి విసిరేశాడు. శిశువు మృతదేహాన్ని మొరిండా పట్టణం సమీపంలోని అదే కాలువలో పడేశాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడు లఖ్బీర్‌ను అదుపులోకి తీసుకొని మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మోరిండా సమీపంలోని కజౌలి గ్రామంలోని కాలువలో అమన్‌దీప్ కౌర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  సత్బీర్, కొడుకు మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతోంది.

ఈ ట్రిపుల్‌ మర్డర్‌ వెనక సోదరుడిపై ద్వేషమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మాదక ద్రవ్యాలకు బానిసైన లఖ్బీర్‌.. జీవితం నాశనం చేసుకున్నాడు. సోదరుడు లైఫ్‌లో బాగా స్థిరపడటంతో అతనిపై కోపం పెంచుకొని ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు. 

మరిన్ని వార్తలు