‘అనంత’ ఆర్టీఏలో ప్రకంపనలు..

26 Sep, 2020 10:58 IST|Sakshi

ఇన్‌చార్జ్‌ ఆర్టీఓ, సీనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

ఐదుగురు వాహన యజమానులపై క్రిమినల్‌ కేసులకు ఆదేశం  

అనంతపురం సెంట్రల్‌: రవాణా శాఖలో జరిగిన నయా మోసం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ప్రభుత్వానికి లైఫ్‌ట్యాక్స్‌ చెల్లించకుండా వాహనాల రిజిస్ట్రేషన్లు చేసిన వ్యవహారంలో ఇన్‌చార్జ్‌ ఆర్టీఓ మహబూబ్‌బాషా, సీనియర్‌ అసిస్టెంట్‌ మాలిక్‌బాషాలపై సస్పెన్షన్‌ వేటు పడింది. మూడు రోజుల క్రితం ఈ అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన ఇన్నోవా కార్లు, ఓ షిఫ్ట్‌ కారు నిబంధనలకు విరుద్ధంగా లైఫ్‌ ట్యాక్స్‌ చెల్లించకుండానే ఇతరులపై రిజిస్ట్రేషన్‌‌ అయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా గమనించిన ఆర్టీఏ ఉన్నతాధికారులు మొత్తం ఐదు వాహనాలను గుర్తించారు. అనంతపురం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, కర్నూలు జిల్లా అవుకు ప్రాంతాల్లో వీటి యజమానులు ఉన్నట్లు తెలుసుకున్నారు.

సదరు వాహనాలను సీజ్‌ చేసిన అధికారులు అక్రమ బాగోతంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే అంశంపై లోతుగా విచారణ చేపట్టారు. ఏజెంట్లు మాత్రమే కాకుండా కొందరు అధికారులకు తెలిసే ఈ తతంగం జరిగిందని ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో లైఫ్‌ ట్యాక్స్‌ చెల్లించకుండానే వాహనాలను రిజి్రస్టేషన్‌ చేసిన సీనియర్‌ అసిస్టెంట్‌ మాలిక్‌బాషా, ఇన్‌చార్జ్‌ ఆర్టీఓ మహబూబ్‌బాషాలను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వాహన యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆర్టీఏ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా