ED Attachment: మూడు ఆండ్రాయిడ్ యాప్‌లు..రూ.150 కోట్ల మోసం!

14 Oct, 2023 16:35 IST|Sakshi

అధిక రాబడి వస్తుందని ప్రజల్లో ఆశ చూపించి మోసానికి పాల్పడుతున్న మొబైల్‌ యాప్‌ నిర్వాహకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. యాప్‌ నిర్వాహకులైన వైభవ్ దీపక్ షా, సాగర్ డైమండ్స్‌, ఆర్‌హెచ్‌సీ గ్లోబల్‌ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన రూ.59.44 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పవర్ బ్యాంక్ యాప్ మోసం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ), 2002 నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఉత్తరాఖండ్, దిల్లీ పోలీసులు(స్పెషల్ సెల్), కర్ణాటక పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఆస్తులను అటాచ్‌ చేసినట్లు అధికారులు చెప్పారు. 

భారత ప్రజలను మోసం చేసేందుకు చైనాకు చెందిన కొందరు చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల సహాయంతో దేశంలో షెల్ కంపెనీలను సృష్టించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. తమ పెట్టుబడులపై భారీ మొత్తంలో సంపాదించవచ్చని ప్రజల్లో ఆశ చూపించి మోసం చేస్తున్నట్లు పేర్కొంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లోని పవర్ బ్యాంక్ యాప్, టెస్లా పవర్ బ్యాంక్ యాప్, ఈజీ‌ప్లాన్ అనే మూడు అప్లికేషన్‌ల ద్వారా ప్రజలను మోసగిస్తున్నట్లు అధికారులు గుర్తించామన్నారు. 

ఈ యాప్‌ల ద్వారా ప్రజల నుంచి రూ.150 కోట్ల మేర మోసం చేసినందుకు దిల్లీ పోలీస్ సైబర్ సెల్  జూన్ 2021లో అనేక మందిని అరెస్టు చేసింది. ఈ యాప్‌లు కస్టమర్ల నుంచి చెల్లింపులను సురక్షితం చేసిన తర్వాత వినియోగదారు ఖాతాలను బ్లాక్ చేసేవని ఈడీ తెలిపింది. ఇలా కూడగట్టిన డబ్బును నిందితులు, ఈ కేసుతో సంబంధం ఉన్న సంస్థలు బోగస్ దిగుమతుల సాకుతో విదేశాలకు భారీగా నిధులు మళ్లించారని వెల్లడైంది. అయితే రూ.10.34 కోట్ల విలువైన ఆస్తులను ఏజెన్సీ రికవరీ చేసింది. రూ.14.81 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు