ఇసుక మాఫియా బీభత్సం.. ట్రాక్టర్లతో టోల్ గేట్‌ బారీకేడ్లను ఢీకొట్టి జంప్‌

5 Sep, 2022 13:46 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. టోల్ గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన బారీకేడ్లను ట్రాక్టర్లతో బద్దలుకొట్టింది. 12 మంది ట్రాక్టర్ డ్రవైర్లు టోల్ రుసుం చెల్లించకుండానే మెరుపువేగంతో దూసుకెళ్లారు. సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా పట్టించుకోకుండా ట్రాక్టర్లను వేగంగా నడుపుతూ ముందుకెళ్లారు. ఆగ్రాలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఈ ఘటనపై ఎస్‌ఎస్‌పీ ప్రభాకర్‌ చౌదరీ స్పందించారు. వారం క్రితం ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 51 ట్రక్కులను సీజ్ చేసి కేసులు పెట్టినట్లు వెల్లడించారు. ఈ చర్యలతో మాఫియా మకాం మార్చేందుకు ప్రయత్నిస్తోందని, అందుకే హైడ్రాలిక్ ట్రాలీలతో టోల్ ప్లాజా గేట్లను ధ్వంసం చేసి ఉండవచ్చని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ ఘటనపై ఎఫ్‌ఐర్ నమోదు చేసినట్లు ఎస్‌ఎస్‌పీ వివరించారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులందరూ ధోల్‌పూర్ ప్రాంతానికే చెందినవారని, అక్కడి పోలీసుల సహకారంతో అందర్నీ పట్టుకుంటామన్నారు.
చదవండి: బలపరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సీఎం

మరిన్ని వార్తలు