రిటైర్డ్‌ ఉద్యోగిపై శివసేన కార్యకర్తల దాడి..

12 Sep, 2020 09:24 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను అపహాస్యం చేస్తూ ఓ కార్టూన్ ఫార్వార్డ్ చేసినందుకు రిటైర్డ్ నావికాదళ అధికారిపై శివసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. వివరాలు.. మదన్‌ శర్మ అనే 65 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగి ముంబైలోని కండివలి ఈస్ట్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో తనకు వాట్సప్‌లో వచ్చిన ఠాక్రేకు సంబంధించిన ఓ కార్టూన్‌ను మదన్‌ తమ‌ రెసిడెన్షియల్‌ సొసైటీ గ్రూప్‌లో పంపించాడు. ఆ తర్వాత అతనికి కమలేష్‌ కదమ్‌ అనే వ్యక్తి కాల్‌ చేసి తన పేరు, ఇంటి చిరునామా అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం మదన్‌ను ఇంటి బయటకు పిలిచి కొందరు వ్యక్తుల బృందం ఆయనపై దాడి చేసింది. (కంగనా డ్రగ్స్‌ ఆరోపణలపై దర్యాప్తు)

దాడి చేస్తున్న వీడియోలు సమీప సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోలో ఇంటి నుంచి బయటకు వస్తున్న మదన్‌ దాదాపు ఎనిమిది మందితో కూడిన శివసేన కార్యకర్తల బృందం వెంబడించింది. భయంతో లోపలికి పరుగెత్తుతున్న మదన్‌ను చొక్కా పట్టుకొని లాగి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మదన్‌ ముఖం మీద గాయాలవ్వగా, కన్ను రక్తంతో తడిసిపోయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో బీజేపీ వర్గాలు శివసేన ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేసి రెచ్చిపోయిన శివసేన ఇప్పుడు రిటైర్డ్ అధికారిపై దాడికి తెగబడిందని బీజేపీ ఆరోపిస్తోంది. (ఠాక్రే-పవార్‌ మధ్య చిచ్చుపెట్టిన కంగనా!)

ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో సహా పలువురు బీజేపీ నాయకులు గాయపడిన మదన్ శర్మ ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ‘చాలా విచారకరమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన. రిటైర్డ్ నావీ ఆఫీసర్ కేవలం వాట్సప్ ఫార్వార్డ్ చేసిన కారణంగా గూండాల దాడిలో గాయపడ్డారు. దయచేసి ఇలాంటివి ఆపండి ఉద్దవ్ ఠాక్రే జీ. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము’ అని ట్వీట్‌ చేశారు. ఈ  ఘటనపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు కమలేష్ కదమ్ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. (సోనియా గాంధీని టార్గెట్‌ చేసిన కంగనా..)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా