Mahabubnagar: గోడ కూలి ఐదుగురి దుర్మరణం

11 Oct, 2021 02:14 IST|Sakshi
మోష, శాంతమ్మ దంపతులు

సాక్షి, అలంపూర్‌(మహబూబ్‌నగర్‌): ఆ కుటుంబ సభ్యులు అప్పటివరకు వివాహ సంబరాల్లో ఆనందంగా గడిపారు. బంధుమిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకున్నారు. రాత్రి సహపంక్తి భోజనం చేసి ఇంటికెళ్లారు. ఆ తర్వాత తల్లిదండ్రులు.. వారి ముగ్గురు పిల్లలు శాశ్వతంగా నిద్రలోకి వెళ్లిపోయారు. అంతవరకు అందరి మధ్యన ఉన్న ఆ కుటుంబాన్ని గోడ రూపంలో మృత్యువు కబళించింది. ఈ దుర్ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన హరిజన మోష (35), శాంతమ్మ (33) దంపతులకు ఐదుగురు సంతానం.

వీరిలో కుమారులు చరణ్‌ (10), రాము (8), తేజ (7), చిన్న, కుమార్తె స్నేహ ఉన్నారు. పూరి గుడిసెలో ఈ కుటుంబం నివాసముంటోంది. అర ఎకరం భూమి ఉన్నా సాగు చేసుకోవడానికి స్తోమత లేకపోవడంతో భార్యాభర్తలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎక్కువగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఇటుక బట్టీల్లో పనిచేసేవారు. రెండు నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చి ఇక్కడే సీడ్‌ పత్తి పనులకు వెళ్తున్నారు. తాముంటున్న గుడిసెలోనే రెండు గదులుగా చేసుకునేందుకు ఆరడుగుల ఎత్తుతో ఇటుక గోడ నిర్మించుకున్నారు.

ఆ గోడ పటిష్టంగా లేకపోవడం, దానికితోడు గుడిసెకు చుట్టూ ఉన్న బండల సందులోంచి వర్షపు నీరు రావడంతో మెత్తబడింది. రాత్రి అక్కడే నిద్రిస్తున్న కుటుంబసభ్యులపై గోడ కూలి పడింది. తల్లిదండ్రులతోపాటు చరణ్, రాము, తేజ సజీవ సమాధి అయ్యారు. మరో ఇద్దరు చిన్నారులు బతికి బయటపడ్డారు. ఈ దుర్ఘటన శనివారం అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు జరిగింది. గోడ కూలిన సమయంలో పెద్దగా పిడుగు శబ్దం రావడంతో చుట్టుపక్కలవారు ప్రమాదాన్ని గుర్తించలేక పోయారు. ఆదివారం ఉదయం ఆరు గంటలు దాటినా నల్లా నీటిని పట్టుకునేందుకు ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కలవారు లోపలికి వెళ్లారు.

కూలిన గోడ కింద అందరిని చూసి అవాక్కయ్యారు. శిథిలాలను తొలగించగా అందులో ఐదుగురు అప్పటికే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో స్నేహ, చిన్నను 108 వాహనంలో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రంగస్వామి, శాంతినగర్‌ సీఐ వెంకటేశ్వర్లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ రఘురాంశర్మ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతి చెందిన మోషకు అన్న ప్రేమరాజు, తమ్ముడు రాజు ఉన్నారు. 

గ్రామంలో విషాదఛాయలు 
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడటంతో కొత్తపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం రాత్రి కాలనీలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్‌లో మోష కుటుంబం పాల్గొంది. అందరితో కలిసి భోజనం చేసి 10.30 గంటల తర్వాత ఇంటికి చేరుకుని వారు నిద్రపోయినట్లు స్థానికులు చెప్పారు. మరికొన్ని గంటలు ఇక్కడే ఉండి ఉంటే ప్రమాదం తప్పి ఉండేదని బంధువులు, కాలనీవాసులు కన్నీరు మున్నీరయ్యారు.

సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి 
ఈ ఘటనపై సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, వైద్య, విద్య సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు