భర్త అడ్డుతొలగిస్తే సంతోషంగా ఉండొచ్చని..

3 Mar, 2021 08:08 IST|Sakshi
ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసు అధికారులు

దర్యాప్తులో పోలీసులకు వివరాలు తెలిపిన నిందితుడు 

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ భీంరెడ్డి  

సాక్షి, పటాన్‌చెరు టౌన్‌ : వివాహేతర సంబంధంతో వరసకు బావతో కలసి భర్తను భార్య హత్య చేయించిన ఘటన మంగళవారం అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. క్రైం సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం... దురుగు జిల్లా..మరోదా గ్రామానికి చెందిన అనిల్‌ కుమార్‌ దారు (35) బతుకుదెరువు కోసం మూడు నెలల క్రితం స్నేహితుడు హరినారాయణ (అలియాస్‌) సంజీవుతో కలసి అమీన్‌పూర్‌ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌కు వచ్చాడు. సమీపంలోని మెడికల్‌ డివైజ్‌ పార్క్‌ సమీపంలో సెంటరింగ్‌ పని చేసుకుంటూ, అక్కడే నివాసం ఉంటున్నాడు.

పది రోజుల క్రితం వరసకు సడ్డకుడు నర్వోత్తంతో కలిసి మృతుడి భార్య భువనేశ్వరి అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ వచ్చింది. భువనేశ్వరి, నర్వోత్తంల మధ్య వివాహేతర సంబంధం ఉంది. భర్త అనిల్‌ కుమార్‌ను హతమారిస్తే ఇద్దరం సంతోషంగా ఉండవచ్చని మృతుడి భార్య బావ నర్వోత్తంతో చెప్పింది. దీంతో అతను అనిల్‌ కుమార్‌ను ఆదివారం సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైస్‌ పార్క్‌ సమీపంలో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి రాయితో తలపై బాది హత్య చేశాడు. ఒక్కసారిగా అనిల్‌కుమార్‌ కనిపించకుండా పోవడంతో తోటి కార్మికులు, స్నేహితుడు సంజీవు .. నర్వోత్తంని అడిగారు.

ఎవరో వచ్చి బైక్‌పై తీసుకెళ్లారని అబద్ధం చెప్పాడు. అనంతరం కాసేపు వెతికినా అనిల్‌కుమార్‌ దొరక్కపోవడంతో మరోసారి నర్వోత్తంను గట్టిగా నిలదీశారు. అనిల్‌కుమార్‌ భార్యకు తనకు వివాహేతర సంబంధం ఉందని ఆమె చెబితేనే  హత్య చేశానని చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ భీంరెడ్డి, పటాన్‌చెరు క్రైం సీఐ    శ్రీనివాసులు, అమీన్‌పూర్‌ ఎస్‌ఐలు మురళి, కిష్టారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతుడి భార్య భువనేశ్వరిని, నర్వోత్తంను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి స్నేహితుడు సంజీవు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

చదవండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
        సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య?

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు