భర్తని చంపేందుకు సుపారీ.. అంతా అనుకున్నట్లే జరిగింది కానీ..

7 Jun, 2022 09:02 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: భర్తను హత్య చేయడానికి భార్య సుపారి ఇచ్చింది. కానీ అది విఫలమైంది. వివరాలు.. బెంగళూరు టీ దాసరహళ్ల నివాసి మమత తన భర్త ముకుందను హత్య చేయాలని  సుపారీ ఇచ్చింది. ఈ కేసులో మమతతో పాటు ఈమె స్నేహితురాలు తస్లీమా, సుపారి కిల్లర్లు మౌలా, సయ్యద్‌ సలీం, సయ్యద్‌ అబీబ్, నయీమ్‌ అరెస్టయ్యారు.  

కారుపై దాడి  
ముకుంద బెంగళూరు గ్రామీణ జిల్లా శిక్షణ శాఖలో ఎఫ్‌డీఐ ఉద్యోగం చేస్తున్నాడు. నిత్యం తన శాంత్రో కారులో సహోద్యోగులతో కలిసి దేవనహళ్లి వద్ద ఉన్న కలెక్టర్‌ ఆఫీసుకు వచ్చేవాడు. మే 26న ముకుంద ఆఫీసు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా దొడ్డబళ్లాపురం పారిశ్రామికవాడలో జెన్‌ కారులో వచ్చిన కొందరు దుండగులు అతని కారు అద్దాలు పగలగొట్టి దాడికి పాల్పడ్డారు. అయితే కారు డోర్‌లు లాక్‌ అయి ఉండడంతో క్షేమంగా తప్పించుకున్నాడు. పోలీసులు జెన్‌ కారు నంబరు ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేసి విచారించగా అసలు సంగతి తెలిసింది. 

చీటీ గొడవలే కారణం   
మమత వల్ల సుమారు రూ.20 లక్షల వరకూ ముకుంద చీటీల్లో నష్టపోయాడు. దీంతో ఇద్దరూ గొడవపడేవారు. మమత దీనిని స్నేహితురాలు తస్లీమాతో చెప్పుకోగా భర్తను అంతు చూడాలని సలహా ఇచ్చింది. ఆస్తి కూడా నీదే అవుతుందనడంతో ఒప్పుకుంది. రూ.10 లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చి హత్యకు పురమాయించినట్లు తేలింది. పని పూర్తయితే మరో రూ. 30 లక్షలు ఇస్తానని ఒప్పుకుంది. కాగా, మరికొందరు పరారీలో ఉన్నారు.

చదవండి: స్నేహితుని చెల్లితో ప్రేమ.. ఆపై పెళ్లి.. కానీ కొన్ని రోజులకే..

మరిన్ని వార్తలు