Bathalapalli: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది

5 Jul, 2022 07:40 IST|Sakshi
నిందితుల అరెస్టు చూపుతున్న సీఐ మన్సూరుద్ధీన్, ఎస్‌ఐ శ్రీహర్ష

వ్యక్తి హత్య కేసులో భార్యతో పాటు ప్రియుడు, మరొకరి అరెస్ట్‌ 

వివరాలు వెల్లడించిన సీఐ మన్సూరుద్దీన్‌ 

సాక్షి, బత్తలపల్లి (సత్యసాయి జిల్లా): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య... ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది. గత నెల 28న అప్పరాచెరువు గ్రామానికి చెందిన బ్యాళ్ల రామకృష్ణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలను బత్తలపల్లి పోలీసు స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ శ్రీహర్షతో కలిసి సీఐ మన్సూరుద్దీన్‌ వెల్లడించారు. జ్వాలాపురానికి చెందిన డిష్‌ శివతో 15 సంవత్సరాలుగా రామకృష్ణ భార్య త్రివేణి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఈ విషయం పసిగట్టిన రామకృష్ణ తరచూ శివతో గొడవపడేవాడు. దీంతో ఎలాగైనా రామకృష్ణ అడ్డు తొలగించుకోవాలని త్రివేణి, శివ భావించారు. రామకృష్ణ పెద్ద కుమార్తె మతాంతర వివాహం చేసుకుని భర్తతో కలిసి వేరే గ్రామంలో స్థిరపడింది. ఈ క్రమంలోనే రామకృష్ణ తనకున్న 4 ఎకరాల భూమిని అమ్మగా వచ్చిన డబ్బుతో రూ.20 లక్షలు వెచ్చించి నూతన గృహ నిర్మాణం చేశాడు. మిగిలిన డబ్బుతో బత్తలపల్లిలో స్థలం కొనుగోలు చేశాడు. ఇటీవల కుటుంబసభ్యులు రామకృష్ణతో గొడవపడి చేయి విరగొట్టారు. అనంతరం చిన్న కుమార్తెను పిలుచుకుని పెద్ద కుమార్తె ఇంటికి త్రివేణి వెళ్లింది.

చదవండి: (గదిలోకి దూరి లైంగిక దాడికి యత్నం.. యువతిని కాపాడిన హిజ్రాలు)

ఇదే అనువైన సమయంగా భావించిన త్రివేణి, శివ.. రామకృష్ణ హత్యకు పథకం రచించారు. అనంతపురంలో ఆటో నడుపుకుంటున్న తన మిత్రుడు రామాంజనేయులు అలియాస్‌ రాముతో శివ చర్చించాడు. జూన్‌ 28న రాము అనంతపురం నుంచి వస్తూ తోడుగా మరో వ్యక్తిని పిలుచుకువచ్చాడు. ఇద్దరూ కలిసి బత్తలపల్లిలో మద్యం సేవించారు. అనంతరం శివతో కలిసి మద్యం బాటిళ్లు తీసుకుని ఆటోలో వేల్పుమడుగు రోడ్డుకు చేరుకున్నారు. అక్కడ మద్యం సేవించి రాత్రి 9 గంటలకు రామకృష్ణకు శివ ఫోన్‌ చేసి బత్తలపల్లికి రావాలని, త్వరలో తాను బెంగళూరుకు వెళ్లిపోతానని, చివరిసారిగా కలిసి మందు పార్టీ చేసుకుందామని నమ్మబలికాడు.

అతని మాటలు నమ్మి అక్కడకు చేరుకున్న రామకృష్ణకు ఫుల్‌గా మద్యం తాపించారు. మత్తులో పడిపోయిన రామకృష్ణ తలపై శివ, రాము బండరాళ్లతో మోది హత్య చేశారు. అనంతరం ఆటోలో అనంతపురం వెళుతూ మార్గమధ్యంలో సంజీవపురంలో పెద్ద కుమార్తె వద్ద రామకృష్ణ భార్య త్రివేణిని కలిసి విషయాన్ని వివరించారు. త్రివేణి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో త్రివేణి, శివ, రాముని సోమవారం అరెస్ట్‌ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ వెల్లడించారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు