అతిథులుగా ఆహ్వానించి, అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది.. తర్వాతే అసలు ట్విస్ట్‌!

8 Oct, 2022 08:07 IST|Sakshi

భువనేశ్వర్‌: రాజకీయ నాయకులు, సినిమా నిర్మాతలను ముగ్గులోకి దింపి, మోసం చేసిన మాయలాడిని ఖండగిరి పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. నిందిత మహిళ న్యాయశాస్త్రంలో పట్టా పొందింది. అయితే పోలీసులు ఈ విషయమై అధికారికంగా సమాచారం జారీ చేయలేదు. ఆమె వద్ద 2 పెన్‌డ్రైవ్‌లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నిందితురాలు ఇది వరకే వివాహమైంది. భర్త సహాయ సహకారాలతో ప్రముఖులను ముగ్గులోకి దింపి.. నిలువునా దోచుకుంటున్నట్లు ఆరోపణ. ఫేసుబుక్‌ పరిచయ వేదికగా ప్రముఖుల వివరాలను సేకరించి, సన్నిహిత పరిచయాలు పెంచుకుంటుంది. వారిని అతిథులుగా ఆహ్వానించి, అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది.

ఈ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను భద్రపరిచి, భారీ మొత్తం కోసం బెదిరించడంలో ఆరితేరినట్లు బాధితులు లబోదిబోమంటున్నారు. మాజీ మంత్రులు, నాయకులు, ప్రముఖ వ్యాపారులు, సినీ నిర్మాతలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఖండగిరి పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు నమోదు కావడంతో డొంక కదిలింది. దీర్ఘకాలంగా విచారణకు సహకరించనందున పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. 2021 నుంచి ఈ వ్యవహారంలో తలమునకలై ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. 

చదవండి: (Nayanathara: నయన్ అంత పెద్ద షాక్ ఇస్తుందా!) 

మరిన్ని వార్తలు