ప్రియురాలికి స్నేహితురాలు వీడియోకాల్‌.. వక్రబుద్ధితో..

4 Mar, 2022 16:18 IST|Sakshi

ప్రేయసితో కలసి ఘాతకం 

మెడలో బంగారమే కొంపముంచింది  

పోలీసులను పక్కదారి పట్టించేందుకు యత్నం 

హత్య కేసులో నిందితులు ముగ్గురు అరెస్టు

సాక్షి, గుంటూరు(బాపట్ల): ప్రియురాలికి ఆమె స్నేహితురాలు చేసిన వీడియోకాల్‌ ద్వారా మెడలో ఉన్న బంగారం చూసిన ప్రియుడు కక్కుర్తిపడ్డాడు. దాన్ని ఏదో విధంగా కొట్టేసేందుకు పక్కా ప్లాన్‌ వేశాడు. ఆ వక్రబుద్ధితో ప్రియురాలితో కుమ్మకై ఆమెను హత్య చేసి బంగారాన్ని వలుచుకున్నాడు. గోనె సంచిలో  మృతదేహాన్ని కుక్కి కృష్ణానది ఒడ్డున పడేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పులుగు రామకృష్ణారెడ్డి, తూమాటి మహేష్, దావూలూరి భారతీలు ఈనెల 2న ఆర్‌ఐ సురేష్‌బాబు సమక్షంలో లొంగిపోయి హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. పక్షం రోజులుగా ఉత్కంఠ రేపిన మహిళా అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఈ మేరకు డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు గురువారం స్థానిక టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  వివరాలు తెలియజేశారు.

బాపట్ల పట్టణం పెయింట్స్‌ కాలనీకి చెందిన గూడపాటి భారతి గత నెల 16వ తేదీ నుంచి కనిపించడం లేదని 19వ తేదీన ఆమె కుమార్తె ఝాన్సీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ పి.కృష్ణయ్య, ఎస్‌ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు భారతితో ఆమె స్నేహితురాలు దావులూరి భారతి చివరిసారిగా మాట్లాడటంతో కేసును ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలేనికి  చెందిన పులుగు రామకృష్ణారెడ్డికి,  ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలకు చెందిన దావులూరి భారతితో అక్రమ సంబంధం కొనసాగడంతో నాలుగేళ్లుగా పట్టణంలోని నరాలశెట్టివారిపాలెంలో కాపురం ఉంటున్నారు.  

చదవండి: (తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే..)

మృతురాలు భారతి కూడా చెడు వ్యసనాలు కలిగి ఉండటంతోపాటు నిందితురాలు భారతీని కూడా తనకు కాకుండా చేస్తోందని రామకృష్ణారెడ్డి తరచూ గొడవపడుతూ ఉండేవాడు. ఈ సమయంలో మార్చి 16న గుంటూరు నుంచి కారులో వస్తున్న నిందితురాలు భారతికి మృతురాలు భారతి వీడియోకాల్‌ చేసింది. మృతురాలి మెడలో బంగారం ఉండటంతో కారులోనే పక్కా ప్రణాళిక వేసి బాపట్ల నుంచి భారతిని ఎక్కించుకుని, అక్కడ నుంచి కృష్ణారెడ్డి స్నేహితుడైన తూమాటి మహేష్‌ను కూడా తీసుకుని సూర్యలంక వెళ్లారు. అక్కడ మృతురాలు భారతితో పాటు అందరూ మద్యం తాగి బాపట్లలో గోనె సంచి కొనుగోలు చేసి రేపల్లె రోడ్డువైపు బయలుదేరారు. 

చీరతో గొంతు బిగించి హత్య 
మృతురాలు భారతిని చీర కొంగుతో చంపి వెంట తెచ్చిన గోనెసంచిలో వేసి పెనుమూడి పులిగడ్డ వారధిలో పడేశారు. కేసును పక్కదారి పట్టించేందుకు ఆమె ఫోన్‌ను తీసుకుని రాజమండ్రి వెళ్లి అక్కడ నుంచి  మాట్లాడకుండా అక్కడే దాన్ని పడేశారు. పోలీసుల్ని పక్కదారి పట్టించేందుకు ఈ విధంగా చేశారని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.  

చదవండి: (ఫార్మాసిస్ట్‌ వచ్చీరాని వైద్యం.. బాలిక మృతి)

ప్రధాన నిందితుడికి నేర చరిత్ర 
ప్రధాన నిందితుడు పులుగు రామకృష్ణారెడ్డి 2011 సంవత్సరంలోనే హైదరాబాద్‌ నుంచి ఒక స్టాఫ్‌ నర్సును ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె వద్ద నగదు తీసుకుని కర్లపాలెంలో హత్య చేసిన కేసు నమోదైందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడికి నేరచరిత్ర ఉందని చెప్పారు. కేసును అత్యంత వేగంగా దర్యాప్తు చేసిన సీఐ పి.కృష్ణయ్య, ఎస్‌ఐలు రఫీ, సీహెచ్‌. సింగయ్యతోపాటు పలువురు సిబ్బందికి రివార్డులు ఇచ్చేందుకు ప్రతిపాదించినట్లు డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. నిందితుల్ని  కోర్టుకు హాజరు పరుస్తునట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు