100 పడకల ఆస్పత్రి మంజూరు

16 Nov, 2023 01:48 IST|Sakshi

సాక్షి, నరసరావుపేట: పల్నాటి ప్రజల తలరాతను మార్చే వరికపూడిశెల ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కోసం విచ్చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాచర్ల నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అపర భగీరథుడికి అడుగడుగునా నీరాజనాలు పలికారు. మాచర్ల పట్టణ శివారు చెన్నకేశవకాలనీ ఎదురు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బుధ వారం సీఎం పాల్గొన్నారు. సీఎం హోదాలో రెండో సారి పట్టణానికి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 10.45 గంటల నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు మాచర్లలోనే ఉన్నారు. ఈ సందర్భంగా ‘రాజన్న బిడ్డా.. నిన్ను మరువదు పల్నాడు గడ్డ’ అంటూ ప్రజలు జయజయధ్వానాలు పలికారు. నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన భారీ జనసందోహంతో గుంటూరు రోడ్డు కిటకిట లాడింది. తొలుత వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణం జరిగే ప్రాంతాన్ని సీఎం హెలికాప్టర్‌లో ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద ప్రాజెక్టు ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆసక్తిగా తిలకించారు. ఉదయం 11.57 గంటలకు వరికపూడిశెల పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

100 పడకల ఆస్పత్రి మంజూరు

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విన్నపం మేరకు ముఖ్యమంత్రి తన ప్రసంగంలో మాచర్ల పట్టణంలోని 50 పడకల సీహెచ్‌సీని 100 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌గా ఉన్నతీకరిస్తున్నట్టు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పిన్నెల్లి కోరినట్టు నియోజకవర్గానికి 1,000 జలకళ బోర్ల మంజూరు, బుగ్గవాగు పనుల పూర్తి, ఆటోనగర్‌ అభివృద్ధి, నాగార్జున సాగర్‌ క్వార్టర్లలో నివాసితులకు పట్టాలు, రూ.8 కోట్ల విలువైన రోడ్లు, కారంపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం రూ.1.5 కోట్ల మంజూరు వంటి వినతులన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీఎం వేదికపైకి రాగానే ప్రజల హర్షధ్వానాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ‘వై నాట్‌ 175’ అంటూ ప్లకార్డులతో ప్రజలు నినదించారు. సీఎం తన ప్రసంగంలో భాగంగా చెప్పిన సామెతలు, ప్రతిపక్షాలపై సంధించిన వాగ్బాణాలకు సభికుల నుంచి విశేష స్పందన వచ్చింది. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఆదిమూలపు సురేష్‌, నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఎం ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డి, నంబూరు శంకరరావు, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, మర్రి రాజశేఖర్‌, పోతుల సునీత, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీవీజీ కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా, వైఎస్సార్‌ సీపీ మూడు జిల్లాల జోనల్‌ ఇన్‌చార్జి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మందా శేషగిరిరావు, పౌడా చైర్మన్‌ మిట్టపల్లి రమేష్‌, పార్టీ అదనపు రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి, వడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతి, వైఎస్సార్‌ సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతనాయక్‌, మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ మాచర్ల చిన ఏసోబు, గుంటూరు రేంజ్‌ ఐజీ పాల రాజు, కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు