కృష్ణాష్టమి వేడుకల్లో రసాభాస.. రచ్చ చేసిన రాజకుటుంబీకురాలు

9 Sep, 2023 16:31 IST|Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని శ్రీ జుగల్ కిషోర్ మందిరంలో వైభవోపేతంగా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్న సమయంలో పన్నా రాజ కుటుంబీకురాలు జితేశ్వరీ దేవి ఆలయ నిబంధనలను ఉల్లంఘిస్తూ నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించినందుకు పన్నా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ఆమె మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పన్నా జిల్లా బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ప్రఖ్యాత శ్రీ జుగల్ కిశోర్ మందిరంలో కృష్ణాష్టమి రోజున అర్ధరాత్రి కృష్ణ పరమాత్ముడి జన్మదిన వేడుకలు ఘనంగా జరగడం ఆనవాయితీ. అయితే ఈ ఉత్సవాల్లో రాజ కుటుంబీకులు ప్రతిమను చీపురుతో శుభ్రపరిచే 'చాన్వార్' సంప్రదాయాన్ని మాత్రమే ఆచరిస్తారని, అది కూడా పురుషులు మాత్రమే ఆచరిస్తారని తెలిపారు. 

కానీ జితేశ్వరీ దేవి నిబంధనలను ఉల్లంఘిస్తూ నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి హారతినిచ్చారన్నారు. దీంతో అర్చకులు, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకోగా వారిపై కూడా దుర్భాషలాడారని తెలిపారు. పోలీసులు వచ్చి వారించినా ఆమె తగ్గలేదు. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కుని తీసుకెళ్లామని ఆమెపై కేసు నమోదు చేశామని కూడా తెలిపారు. సోషల్ మీడియాలో ఈ  వీడియోలు వైరల్ అయ్యాయి.  

అరెస్టు సమయంలో జితేశ్వరీ దేవి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రక్షణ శాఖ సంక్షేమ నిధిలో సుమారు రూ.65,000 కోట్లు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ కుంభకోణంపై అదేపనిగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే ఆమెను అరెస్టు చేశారన్నారు. వైధవ్యం కారణంగానే గర్భగుడిలోకి ప్రవేశించకుండా ఆలయ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారని సంఘటన సమయంలో ఆమె బాగా మద్యం సేవించి ఉన్నారని స్థానికులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

మరిన్ని వార్తలు