అల్లుడిని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు!

18 Apr, 2021 19:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పాలకుర్తి(ములుగు): భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ చివరకు భర్తకు దేహశుద్ధి చేయించే వరకు వెళ్లింది. ఎస్సై గండ్రాతి సతీష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన నీరజను వావిలాల గ్రామానికి చెందిన దొంగరి మురళికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండగా.. భర్త చెడు వ్యసనాలకు అలవాటుపడి తనను పట్టించుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని నీరజ కేసు పెట్టింది. దీంతో మురళి జైలుకు వెళ్లి వచ్చాడు.

అప్పటి నుంచి ఇరువురు విడిగా ఉంటున్నారు. ఇటీవల మురళి తల్లి మృతి చెందడంతో నీరజ వచ్చి వావిలాలలో అతడితో కలిసి ఉంటుంది.  ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.   తనతో పాటు పిల్లల్ని కొట్టాడని నీరజ తిరిగి మల్లంపల్లికి వెళ్లి దాడి విషయం కుటుంబ సభ్యులకు వివరించింది.  దీంతో ఆగ్రహానికి గురైన నీరజ కుటుంబ సభ్యులు వావిలాలకు వెళ్లి మురళిని మల్లంపల్లికి తీసుకువచ్చి చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ విషయమై పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం ఎస్సై సతీష్‌ ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతం కావొద్దని హెచ్చరించి పంపించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు