వాట్సప్‌ స్టేటస్‌తో బండారం బట్టబయలు 

27 Dec, 2020 07:24 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి ‌: ఓ మహిళ దొంగతనం చేసి గప్‌చుప్‌గా సొమ్ములతో పరారై రెండు నెలల అనంతరం వాట్సప్‌ స్టేటస్‌ వల్ల పోలీసులకు దొరికిపోయింది. దొంగతనం చేసిన చీరను కట్టుకొని, దాన్ని వాట్సప్‌ స్టేటస్‌ పెట్టడంతో పోలీసులు తమదైన శైలిలో శనివారం విచారణ చేయడంతో నిజం బయట పెట్టింది. వివరాలను టౌన్‌ సీఐ సుబ్రహ్మణ్యం వివరించారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని డోలాస్‌నగర్‌ ప్రైమ్‌ గెలాక్సీ అపార్ట్‌మెంటులోని ఫ్లాటులో కత్తి ఆమోద్‌ ఉంటున్నారు.

ఆయన ఫ్లాట్‌లో ఈ ఏడాది నవంబర్‌ 29న భారీ చోరీ జరిగింది. నాలుగు గాజులు, మంగళసూత్రం, నెక్లెస్, చెవిదిద్దులు రెండు, బేబీచైన్‌ ఒకటి, మరికొన్ని వస్తువులు చోరీకి గురయ్యాయి. ఆమోద్‌ ఫిర్యాదు మేరకు తాడేపల్లి టౌన్‌ సీఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పలువురిని విచారించినా ఫలితం లేకపోయింది. అయితే, ఈనెల 24న బంగారపు వస్తువులతో పాటు చోరీకి గురైన చీర కట్టుకొని దొంగతనం చేసిన సునీత వాట్సప్‌ స్టేటస్‌ పెట్టడంతో ఆమోద్‌ భార్య దాన్ని చూసి భర్తకు తెలియచేసింది.

వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సునీతను మంగళగిరి కొత్త బస్టాండ్‌ దగ్గర అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఆమె గతంలో అపార్టుమెంటులో పని మనిషిగా పని చేసేది. ఆ సమయంలో ఖాళీగా ఉన్న ఫ్లాట్లను ఊడవమని మేనేజర్‌ తాళాలు ఇవ్వగా, వాటితో పాటు ఆమోద్‌ ఫ్లాటు డూప్లికేట్‌ తాళాలు కూడా తీసుకువెళ్లి చోరీకి పాల్పడినట్లు సీఐ వివరించారు. లోపల కప్‌బోర్డ్‌ను పగలగొట్టి బంగారాన్ని తీసుకొని అక్కడనుంచి వెళ్లిపోయిందని ఆయన చెప్పారు.   

మరిన్ని వార్తలు