ఐదో ప్రయత్నంలో రాణించిన శ్రీలక్ష్మీరమణి

24 May, 2023 08:40 IST|Sakshi

మామిడికుదురు: ఈదరాడకు చెందిన యర్రంశెట్టి ఉమాశ్రీలక్ష్మీరమణి మంగళవారం విడుదలైన సివిల్‌ సర్వీసు (యూపీఎస్సీ) పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఆమె ఆల్‌ ఇండియా స్థాయిలో 583వ ర్యాంకు సాధించింది. ఈదరాడకు చెందిన శ్రీలక్ష్మీ రమణి ప్రాథమిక విద్యను మామిడికుదురులో పూర్తి చేసింది. రాజోలు మండలం బి.సావరం స్కూల్‌లో ఉన్నత విద్యను పూర్తి చేసింది.

అనంతరం నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో చదువుకుంటూ క్యాంపస్‌ సెలెక్షన్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం పొందింది. ఒక ఏడాది పాటు ఉద్యోగం చేసిన తర్వాత జాబ్‌కు రాజీనామా చేసి ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అయ్యింది. అయిదో ప్రయత్నంలో శ్రీలక్ష్మీరమణి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. శ్రీలక్ష్మీరమణి తండ్రి యర్రంశెట్టి కాశీవిశ్వేశ్వరరావు కొబ్బరి కాయల వ్యాపారి. తల్లి భవాని గృహిణి, సోదరుడు నవీన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం వీరి కుటుంబం వ్యాపార రీత్యా కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌ జిల్లా బాల్కీలో ఉంటున్నారు.

ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ రమణి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యంతో ఎంతో కష్టపడి చదువుకున్నానని చెప్పింది. తన ప్రయత్నం ఫలించి జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది. ఈ ప్రయత్నంలో తన కుటుంబ సభ్యులు తనకు ఎంతో అండగా నిలిచి, తనను వెన్నంటి ప్రోత్సహించారని చెప్పింది. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన శ్రీలక్ష్మీరమణిని ఈ సందర్భంగా స్థానికులు ఫోన్‌లో అభినందించారు.

మరిన్ని వార్తలు