ఆర్థిక అభ్యున్నతికి సహకారం | Sakshi
Sakshi News home page

ఆర్థిక అభ్యున్నతికి సహకారం

Published Mon, Nov 13 2023 11:40 PM

తొర్రేడులోని ప్రాథమిక  సహకార పరపతి సంఘం (సొసైటీ)  - Sakshi

ప్రజల్లో అవగాహనకు..

సహకార వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రయోజనాలు పొందడం కోసం 70వ అఖిల భారత సహకార వారోత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నాం. గతేడాది నుంచి ఇప్పటి వరకూ సహకారం సంఘాలు ఏఏ కార్యక్రమాలు నిర్వహించాయి, రాబోవు ఏడాది చేపట్టాల్సిన అంశాలపై చర్చిస్తాం. సభ్యుల ఆర్థికాభివృద్ధి, సంఘ ప్రగతికి దిశానిర్ధేశం చేస్తాం.

– వై.ఉమామహేశ్వరి,

జిల్లా సహకార అధికారి

రైతులు, మహిళలకు

అన్ని విధాలా తోడ్పాటు

చర్యలు తీసుకున్న ప్రభుత్వం

నేటి నుంచి సహకార వారోత్సవాలు

రాజమహేంద్రవరం రూరల్‌: రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలను బలోపేతం చేస్తోంది. సంఘంలోని ప్రతి సభ్యుడికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలతో పాటు అవసరమైన మేర రుణాలను సైతం సహకార సంఘాలు అందిస్తున్నాయి. జిల్లాలో 107 ప్రాఽథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) ఉండగా అందులో 85 సంఘాలు లాభాల బాటలో నడుస్తున్నాయి. ఈ సొసైటీల ద్వారా ఏడాదికి రూ.5 కోట్ల ఆదాయం వస్తోంది. సహకార సొసైటీలతో కలిసి జిల్లాలో అర్బన్‌ బ్యాంకులు, కో ఆపరేటివ్‌ సొసైటీలు, లేబర్‌ సొసైటీలు, కో పరేటివ్‌ స్టోర్లు, వివిధ రకాల సొసైటీల అన్నీ కలిపి 717 వరకూ ఉన్నాయి. ఇవన్నీ సహకార సంస్థ నిబంధనలు, బైలా ప్రకారమే నడుస్తున్నాయి.

సంఘాల బలోపేతం దిశగా..

● ప్రభుత్వం ప్రతి ఆర్‌బీకే పరిధిలో బహుళార్థసార్థక గోడౌన్ల నిర్మిస్తోంది. వీటి నిర్మాణానికి ఆర్‌బీఐ ద్వారా సొసైటీలకు రుణం అందిస్తోంది. జిల్లాలో 30 చోట్ల గోడౌన్ల నిర్మాణం జరుగుతోంది.

● జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా కొవ్వూరు డివిజన్‌లోని ఆరు మండలాల్లో మహిళా పాల సంఘాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ప్రతి రోజూ ఐదువేల లీటర్ల పాలు సేకరించి అమూల్‌ సంస్థకు అందిస్తున్నారు. ఇలా లీటర్‌కు రూ.100 ఆదాయం వస్తోంది. త్వరలో రాజమహేంద్రవరం డివిజన్‌లో నాలుగు మండలాల్లో ప్రారంభించనున్నారు.

● సహకార సంఘాలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్‌ చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతం సొసైటీల్లో పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మార్చికి సొసైటీల్లో ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు జరుగుతాయి.

● కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, జనరిక్‌ మందుల షాపులు, పెట్రోలు బంకులు, గ్యాస్‌ డీలర్‌షిప్‌లను సహకార సంఘాల ద్వారా నిర్వహించనున్నారు.

● సహకార సొసైటీల ద్వారా ఇప్పటికే ఎరువులు, పురుగు మందులు, విత్తనాల విక్రయాలు నిర్వహిస్తున్నారు.

నేటి నుంచి సహకార వారోత్సవాలు

ప్రజల్లో సహకార వ్యవస్థ గురించి అవగాహన అవగాహన కల్పించడం మంగళవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకూ 70వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కోసం తయారు చేయడంలో సహకార సంస్థల పాత్ర అనే థీమ్‌తో జరుపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సహకార సంఘాల్లో ఇటీవల పరిణామాలు, 15న పరపతేతర సహకార సంఘాలు, ఆర్థిక వేదిక పునరుజ్జీవనం, 16న సహకార సంస్థల డిజిటలైజేషన్‌ కోసం సాంకేతికతను స్వీకరించడం, 17న సహకార సంఘాలకు సులభతర వ్యాపారం, ఉద్భవిస్తున్న రంగాలు, 18న పబ్లిక్‌ – ప్రైవేట్‌ రంగాలతో సహకార భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, 19న మహిళలు , యువత, బలహీన వర్గాల కోసం సహకార సంఘాలు, 20న సహకార విద్య, శిక్షణ పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రామదాసు సహకార శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్‌ వి.శ్రీనివాస్‌ పర్యవేక్షణలో ఇవి జరుగుతాయి.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement