సరికొత్త బాటలో చిలీ

29 Oct, 2020 02:07 IST|Sakshi

అందరూ అనుకున్నట్టే లాటిన్‌ అమెరికా దేశం చిలీ ప్రజాస్వామ్య సంస్కరణల దిశగా అడుగు ముందుకేసింది. ఆదివారం అక్కడ జరిగిన రిఫరెండం నూతన రాజ్యాంగ రచనకు అనుకూలంగా ఓటేసింది. సైనిక పాలకుల నీడలో రూపొందిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలంటూ 78 శాతంమంది ప్రజలు ముక్తకంఠంతో కోరారు. సరిగ్గా ఏడాదిక్రితం మెట్రో రైలు చార్జీల పెంపును నిరసిస్తూ రాజుకున్న నిరసన చూస్తుండగానే దావానలంలా వ్యాపించి, ఆ దేశం తలరాతను నిర్దేశించడం నడుస్తున్న చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ఆ ఉద్యమ తీవ్రత అసాధారణమైనది. దాని ధాటికి చిలీ రాజధాని శాంటియాగోలో నిరుడు నవంబర్‌లో జరగాల్సిన ఆసియా, పసిఫిక్‌ దేశాల సహకార సంస్థ ఎపెక్‌ వార్షిక శిఖరాగ్ర సదస్సు రద్దయింది. అక్కడే జరగాల్సిన వాతావరణ శిఖరాగ్ర సదస్సు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కు తరలిపోయింది. కర్ఫ్యూలు, కాల్పులు, అరెస్టులతో ప్రభుత్వం ఎంత బెదిరించినా సాధారణ పౌరుల ఆగ్రహావేశాలు చల్లారలేదు.

లక్షమంది ప్రజానీకం చరిత్రాత్మక శాంటియాగో ప్లాజాను దాదాపు నెలరోజులపాటు ఆక్రమించి తమ డిమాండ్లకు తలొగ్గితే తప్ప అక్కడినుంచి కదిలేది లేదని హఠాయించారు. మహిళలే ముందుండి నడిపించిన ఆ ఉద్యమంలో పోలీసు కాల్పులకు 36మంది చనిపోగా, 2,000మంది గాయపడ్డారు. వేలాదిమందిని ఖైదు చేశారు. మెట్రో రైలు చార్జీలను తగ్గించేది లేదని మొదట్లో చెప్పిన ప్రభుత్వం చివరకు ఆ ఉద్యమ తీవ్రత ఏపాటిదో అవగాహన చేసుకుని వారి డిమాండ్‌కు తలొగ్గుతున్నామని ప్రకటించింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఉద్యమకారుల డిమాండ్లు పెరిగాయి. నీరు, భూమి కబ్జా పెట్టి సామా న్యులకు దక్కకుండా చేస్తున్న ప్రభుత్వ విధానాలు రద్దుకావాలంటూ కోరారు. ఆదివాసీ తెగలకు కనీస హక్కులు ఎందుకు లేవని ప్రశ్నించారు. అసలు సైనిక పాలకులు తీసుకొచ్చిన రాజ్యాంగమే కొనసాగరాదంటూ నినదించారు. వీటన్నిటికీ చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్‌ పినెరా అంగీకరించక తప్పలేదు. పర్యవసానంగా గత మార్చిలో రిఫరెండం జరగాల్సివుంది. కానీ కరోనా విరుచుకుపడ టంతో అది వాయిదా పడింది. ఏడు నెలలు ఆలస్యంగా జరుగుతున్న ఈ రిఫరెండంలో ప్రజలు మునుపట్లా ఆగ్రహావేశాలు ప్రదర్శించి మార్పులకు అనుకూలంగా ఓటేస్తారా లేక చప్పగా చల్లారి యధాతథ స్థితినే కొనసాగిస్తారా అన్న సందిగ్ధత చాలామందిలో లేకపోలేదు.

కానీ రిఫరెండం ఫలితం చూస్తే వారి సంకల్పం ఏమాత్రం చెక్కుచెదరలేదని స్పష్టమైంది. చిలీ ఎన్నో సంక్షోభాలు చూసింది. 1973లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సాల్వెడార్‌ అలెండీని ఆయనే నియమించిన సైనిక దళాల చీఫ్‌ అగస్టో పినోచెట్‌ సైనిక కుట్రలో కూలదోశాడు. ఆ తర్వాత 17 ఏళ్లపాటు... అంటే 1990 వరకూ ఆ నియంత కొనసాగించిన చీకటి పాలన ఎన్నో విషాద ఉదంతాలకు కారణమైంది. దేశమంతా సైన్యం పదఘట్టనలతో అట్టుడికింది. పాలించిన పదిహేడేళ్లలో పినోచెట్‌ ప్రభుత్వం దాదాపు 3,200మందిని ఉరితీయగా, వేలాదిమంది గల్లంతయ్యారు. 80,000మంది జైలుపాల య్యారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించినవారినల్లా లెఫ్టిస్టులు, సోషలిస్టులని ముద్రేశారు. దీనికి సమాంతరంగా దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరమయ్యాయి. వాటిని కీలకపదవుల్లోవుండేవారి బంధు, మిత్ర గణానికి కట్టబెట్టారు. అభి వృద్ధి పేరిట లక్షల ఎకరాల భూముల్ని ప్రజలనుంచి బలవంతంగా స్వాధీనం చేసుకుని కార్పొరేట్‌ సంస్థలకు పంచిపెట్టారు. దేశీయ పరిశ్రమల రక్షణ కోసంవున్న టారిఫ్‌లను ఏకపక్షంగా రద్దుచేశారు. 

పినోచెట్‌ ఆర్థిక సంస్కరణలు మొదట్లో మంచి ఆర్థిక ఫలితాలనిచ్చాయి. సంపద పెరిగింది. దేశం సుభిక్షంగా వున్నట్టే కనబడింది. 1982లో ద్రవ్య సంక్షోభం తలెత్తడంతో దేశ ఆర్థిక వ్యవస్థలోని అసమానతలు వెల్లడయ్యాయి. అయితే ఆ వెంటనే సంపన్న దేశాలు ముందుకొచ్చి దాన్ని ఆదు కున్నాయి. అది ఎపెక్‌ దేశాల కూటమిలో సభ్యత్వం సాధించాక మళ్లీ ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కింది. ‘మనం బాగున్నాం...రేపు సైతం మరింత బాగుంటాం’ అనేది పినోచెట్‌ నినాదం. నిరుడు రద్దయిన ఎపెక్‌ శిఖరాగ్ర సదస్సుకు కొన్నిరోజుల ముందు  ప్రస్తుత అధ్యక్షుడు పినోరాది కూడా అదే స్వోత్కర్ష. ‘పసిఫిక్‌ తీరంలో మాత్రమే కాదు...ప్రపంచంలోనే చిలీ ఇప్పుడు ఒక నీటి చెలమ. ఒక ఆశాకిరణం’ అంటూ ఆయన గొప్పలు పోయాడు. ఆసుపత్రుల ముందు వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షిం చాల్సి వస్తున్నదని జనం ఫిర్యాదు చేసినప్పుడు ‘కాలక్షేపానికి కబుర్లు చెప్పుకోవచ్చు కదా...’అంటూ ఆరోగ్యమంత్రి ఎద్దేవా చేశాడు. ‘మెట్రో రైలు చార్జీలు భరించలేకపోతే అవి తక్కువగా వున్న రోజుల్లో మాత్రమే ప్రయాణించండ’ని మరో మంత్రి సలహా ఇచ్చాడు. ఉద్యమకారులు దేశద్రోహులని, వారు యుద్ధం ప్రకటించారని పినోరా ఆరోపించారు. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. 

చిలీ ప్రజాస్వామ్య ఉద్యమం సాధించిన చరిత్రాత్మకమైన విజయం వెనక ఇంటా, బయటా నిత్యం అణచివేతనూ, హింసనూ చవిచూస్తున్న మహిళాశక్తి వుంది. పినోచెట్‌ కాలంనాటి సైన్యం ఆగడాలతో పెద్దగా పరిచయంలేని యువతరం వుంది. అందుకే ఈ ఉద్యమం నిలకడగా, దృఢంగా సాగింది. ఉచితంగా మంచినీరు, ఉచిత విద్య, పెన్షన్‌ విధానం, ఆరోగ్య సంరక్షణ, పౌరుల ఆస్తులకు రక్షణ కావాలని చిలీ ఉద్యమం కోరింది. వీటన్నిటికీ అనువైన ప్రజాతంత్ర రాజ్యాంగ రచనకోసం ఇప్పుడు 155మందితో రాజ్యాంగ నిర్ణాయక సభ ఏర్పడబోతోంది. దానికి వచ్చే ఏడాది ఎన్నిక లుంటాయి. అందులో సగంమంది మహిళా ప్రతినిధులుంటారు. ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైన ఆది వాసీ తెగ పౌరులకూ అందులో చోటిచ్చే అవకాశం వుంది. 2022లో ఆ రాజ్యాంగంపై రిఫరెండం నిర్వహిస్తారు. ఆ తర్వాతే చట్టసభలు ఆవిర్భవిస్తాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకొస్తుంది. ఒక కొత్త సమాజాన్ని కలగంటున్న క్షతగాత్రి చిలీ ఆ కృషిలో విజయం సాధిస్తే అది నియంతలపై పోరాడే ఎన్నో దేశాలకు స్ఫూర్తిదాయకం అవుతుంది. 

మరిన్ని వార్తలు