బుచాలో రాక్షసకాండ

7 Apr, 2022 00:32 IST|Sakshi

పొరుగునున్న ఉక్రెయిన్‌ అనే చిన్న దేశంపై రష్యా దురాక్రమణకు దిగి, అక్కడి ప్రజానీకాన్ని కష్టాలపాలు చేసి ఆరు వారాలు దాటుతోంది. లక్షలాదిమంది పౌరులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వేరే దేశాలకు వలసపోతుంటే, అలా వెళ్లడం సాధ్యపడనివారు వీధుల్లో శవాలుగా మిగులుతున్నారు. మొన్నటివరకూ జనసందోహంతో కిటకిటలాడిన నగరాలు ఇప్పుడు శ్మశానాలను తలపిస్తున్నాయి. నివాస ప్రాంతాలను సైతం గురిచూసి ధ్వంసం చేస్తున్న రష్యా సేనల రాక్షసత్వం కోటిమందికిపైగా పౌరులను స్వదేశంలో నిరాశ్రయులుగా మార్చింది.

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ శివారు పట్టణమైన బుచాలో రష్యా సైనికులు సాగించిన దుష్కృత్యాలకు మీడియాలో వెల్లడవుతున్న ఛాయాచిత్రాలు అద్దం పడుతున్నాయి. మార్చి మధ్యవారంలో తీసిన ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాలను చూస్తే ఎంతటివారికైనా దుఃఖం పొంగుకొస్తుంది. చేతులు వెనక్కి విరిచి కట్టి ఉన్న మృతదేహాలు రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉండటాన్నీ, ఒక వృద్ధురాలు సొంత ఇంట్లోనే నిర్జీవంగా మిగలడాన్నీ చూస్తే రష్యా సైనికులు సాగించిన నరమేధం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

36,000 మంది జనాభా ఉన్న ఆ శివారు పట్టణంలోని వీధుల్లో 300కు పైగా శవాలు కనబడ్డాయని చెబుతున్నారు. ఎక్కడ చూసినా చేతులు వెనక్కి విరిచికట్టి, తల వెనుక నుంచి తూటాలు కాల్చినట్టు ఆనవాళ్లున్న శవాలు దర్శనమిస్తున్నాయి. కీవ్‌లో కొన్ని ప్రాంతాల నుంచి రష్యా దళాలు నిష్క్రమించాక అక్కడ 410 శవాలు లెక్కగట్టారు. పిల్లల వైద్య చికిత్సా కేంద్రం బేస్‌మెంట్‌ను చిత్రహింసల శిబిరంగా మార్చుకుని రష్యా సైనికులు పౌరులపై ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారని చెబుతున్నారు. ఆ చికిత్సా కేంద్రం ఆవరణలో అనేక శవాలను ఖననం చేసిన ఆనవాళ్లున్నాయి.

ఇదే నగరంపై రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్‌ సేనలు విరుచుకుపడి 1941–43 మధ్య 15 లక్షలమంది పౌరులను పొట్టన బెట్టుకున్నారు. వీరిలో అత్యధికులు యూదులు. ఎనిమిది దశాబ్దాల తర్వాత ఇప్పుడు రష్యా సేనలు సాగించిన దుర్మార్గం దానికేమాత్రం తీసిపోదు. సరిగ్గా నాజీ సేనలు సాగించిన అకృత్యాల మాదిరే ఇంటింటా సోదాలు చేస్తూ, నిత్యావసరాల కోసం రోడ్డెక్కినవారిని అడ్డగిస్తూ రష్యా దళాలు నిలు వునా ప్రాణాలు తీశాయని స్థానికులు అంటున్నారు.

బుచా ఘటనలు ప్రపంచ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతి పరుస్తున్నాయి. ఇంతవరకూ వివిధ అంతర్జాతీయ వేదికల్లో అమెరికా, పాశ్చాత్య దేశాలు తీసుకొచ్చిన తీర్మానాల విషయంలో తటస్థత పాటించిన మన దేశం సైతం బుచా నరమేధం తర్వాత భిన్నంగా స్పందించక తప్పలేదు. ఈ దారుణ మారణకాండపై అంతర్జాతీయ విచారణ అవసరమని ప్రకటించింది. ఏ యుద్ధమైనా, దురాక్రమ ణైనా మానవాళిపై సాగించే నేరమే. అందుకు పురిగొల్పినవారు నేరగాళ్లే అవుతారు. ఇవాళ బుచాలో, కీవ్‌లో రష్యా సాగించిన నేరాలకు సాక్ష్యాధారాలు దొరుకుతున్నాయి.

వీటిని ఖండిస్తున్న అమెరికా, పాశ్చాత్య దేశాలు తాము దాదాపు మూడు దశాబ్దాలుగా వివిధ దేశాల్లో సాగించిన, సాగిస్తున్న పాపాలను కడిగేసుకోలేవు. ఇరాక్, అఫ్గానిస్తాన్, సిరియా, లిబియా, యెమెన్, సూడాన్, నైజీరియా వంటి చోట్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా తాము ఎన్ని లక్షలమంది మరణానికి కారకులమయ్యారో గుర్తు తెచ్చుకోవాలి. అక్కడి దుష్కృత్యాలపై పాశ్చాత్య మీడియా ఇంతగా స్పందించలేదు. పరిమిత స్థాయిలోనే అయినా జూలియన్‌ అసాంజ్, చెల్సియా మానింగ్, ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ వంటివారు బయటి ప్రపంచానికి వెల్లడించిన వాస్తవాలు దిగ్భ్రాంతి గొలుపుతాయి.

యుద్ధాల్లోనైనా, దురాక్రమణల్లోనైనా మంచివి, చెడ్డవి అనేవి ఉండవు. వాటి సారాంశం హింస తప్ప మరేమీ కాదు. రెండు ప్రపంచ యుద్ధాలు మోసుకొచ్చిన అంతులేని విషాదాలను ప్రత్యక్షంగా చూసిన తరాలు శాంతి కోసం తపించాయి. యుద్ధాలకు, దురాక్రమణలకు తావులేని ప్రపంచాన్ని కాంక్షించాయి. ప్రపంచ శాంతి సంఘం వంటివి ప్రజలను చైతన్యవంతులను చేశాయి. కానీ అగ్రరాజ్యాల విస్తరణవాద కాంక్షతో భూగోళంలో ఏదో ఒక మూల అవి కనబడుతూనే ఉన్నాయి. 

రష్యా చేస్తున్న వాదనలు ఉత్త బుకాయింపులు, దబాయింపులేనని బుచా నరమేధం నిరూ పిస్తోంది. తాము కేవలం ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలనూ, సైనికులనూ లక్ష్యంగా చేసుకుంటున్నామని చెబుతున్నదంతా అబద్ధమని రుజువవుతోంది. అమెరికా ప్రాపకంతో తన పొరుగునున్న ఉక్రెయిన్‌ తనకు సమస్యలు సృష్టించదల్చుకున్న మాట నిజమే కావొచ్చు. కానీ ఆ వంకన దురాక్రమణకు దిగడం, నరమేధానికి పాల్పడటం క్షమార్హంకాని నేరం.

తన దగ్గర పుష్కలంగా ఉన్న సహజవాయు, ముడి చమురు నిక్షేపాలవల్ల తన ఆర్థిక సుస్థిరతకు వచ్చే ఇబ్బందేమీ లేదని పుతిన్‌ లెక్కలు వేసుకుని ఉండొచ్చు. కానీ బుచా నరమేధం ఆ లెక్కల్ని తారుమారు చేసే అవకాశం ఉంది. పుతిన్‌ అయినా, మరొకరైనా యుద్ధాన్ని ప్రారంభించగలరు తప్ప ముగింపు వారి చేతుల్లో ఉండదు. ఇప్పటికైతే రష్యా గ్యాస్‌పై ఆధారపడాలా, వద్దా అనే అంశంలో జర్మనీ ఊగిసలాటలో ఉంది.

యూరొపియన్‌ యూనియన్‌(ఈయూ) రష్యా బొగ్గుపై మాత్రమే నిషేధం విధించింది. భారత్, చైనా వంటి దేశాలు చవగ్గా వస్తున్న ముడి చమురును కొనుగోలు చేస్తున్నాయి. అందుకే రష్యాకు రోజుకు 1,800 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరుస్తున్న చమురు, సహజవాయు ఉత్పత్తిపై ఆంక్షల ప్రభావం పెద్దగా పడలేదు. కానీ ఈ దుర్మార్గాలు ఇలాగే సాగితే మున్ముందు రష్యా చిక్కుల్లో పడొచ్చు. ఆర్థిక వ్యవస్థ బీటలు వారొచ్చు. కనుక ఈ మతిమాలిన యుద్ధానికి పుతిన్‌ ఇప్పటికైనా స్వస్తి పలకాలి.

మరిన్ని వార్తలు