ఆ టైంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్‌ ఎయిర్‌పోర్టు..కానీ ఇప్పుడది..

5 Nov, 2023 10:03 IST|Sakshi

అమెరికా–సోవియట్‌ రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ప్రబలంగా ఉన్న రోజుల్లో ఉభయ శిబిరాలకు పరస్పర ‘అణు’మానాలు ఉండేవి. అందువల్ల ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండేవారు. తమ తమ భూభాగాల్లోని రహస్య ప్రదేశాల్లో అణుబాంబులు మీదపడ్డా చెక్కుచెదరని బంకర్లు నిర్మించుకున్నారు. అప్పట్లో సోవియట్‌ రష్యా అణుబాంబులను తట్టుకునే భూగర్భ విమానస్థావరాన్ని నిర్మించుకుంది. క్రొయేషియా సరిహద్దుల్లో ప్లజెసెవికా కొండ నడిబొడ్డున నిర్మించిన ఈ జెల్జావా భూగర్భ విమానస్థావరం ప్రపంచంలోని భూగర్భ విమానస్థావరాల్లోనే అతిపెద్దది.

అయితే, మూడు దశాబ్దాలుగా ఇది నిరుపయోగంగా పడి ఉంది. సెర్బో–క్రొయేషియన్‌ యుద్ధం 1992లో మొదలైనప్పటి నుంచి దీని వినియోగం నిలిచిపోయింది. ఇది కేవలం భూగర్భ విమానస్థావరం మాత్రమే కాదు, ఇందులో అనేక సౌకర్యాలు ఉన్నాయి. సోవియట్‌ పాలకులు 1960లోనే దీనిని 600 కోట్ల డాలర్ల (సుమారు రూ.50 వేల కోట్లు) ఖర్చుతో నిర్మించుకున్నారు. ఏకంగా 20 కిలోటన్నుల అణువిస్ఫోటాన్ని తట్టుకునేంత శక్తిమంతంగా దీనిని రూపొందించారు.

ఇందులో విద్యుదుత్పాదన కేంద్రం, మంచినీటి వడబోత కేంద్రం, గాలి వెలుతురు సోకేందుకు అనువైన నడవలు, వెయ్యిమంది సైనికాధికారులు, సైనిక సిబ్బంది కోసం డార్మిటరీలు, యంత్రాల సాయంతో తెరుచుకునే వంద టన్నుల కాంక్రీటు ద్వారాలు ఉన్నాయి. సైనికులకు అవసరమైన ఆహార పదార్థాలు, ఆయుధాలు నిల్వచేసుకునేందుకు కట్టుదిట్టమైన గిడ్డంగులు ఉన్నాయి. క్రొయేషియా ప్రభుత్వం దీనిని మ్యూజియంగా మార్చింది. ఏటా దాదాపు 1.50 లక్షల మంది పర్యాటకులు ఈ మ్యూజియంను సందర్శిస్తుంటారు. 

(చదవండి: అద్భుతమైన డెవిల్స్‌ బ్రిడ్జ్‌! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!)

మరిన్ని వార్తలు