కార్పొరేట్‌ సునామీ!

24 Nov, 2023 00:14 IST|Sakshi

బోర్డు రూం కుట్రలు, కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు చేతులు మారడం వగైరాలు ప్రపంచానికి కొత్త కాదు. కానీ చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ ఏఐలో పుట్టుకొచ్చిన సునామీ అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. చిత్రమేమంటే... ఏం జరిగిందో అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే అనేక మలుపులు తిరిగి అది కాస్తా చప్పున చల్లారింది. ఈ మొత్తం వ్యవహారమంతా కేవలం అయిదంటే అయిదే రోజుల్లో పూర్తయింది. డైరెక్టర్ల బోర్డు బయటకు నెట్టేసిన వ్యక్తే దర్జాగా వెనక్కి రావటం, బోర్డు సభ్యులతో సహా కంపెనీలో ఎవరినైనా తొలగించే అధికారం చేజిక్కించుకోవటం, ఆయన్ను బయటికి పంపినవారే చివరకు పదవులు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడటం ఈ వివా దానికి కొసమెరుపు.

కేవలం నలుగురు డైరెక్టర్లకు వ్యతిరేకంగా 95 శాతంమంది సిబ్బంది తిరగ బడటం, తామంతా రాజీనామా చేస్తామమని హెచ్చరించటం, వారితో ఇన్వెస్టర్లు సైతం చేతులు కలపటం కనీవినీ ఎరుగనిది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో అద్భుతాలు సృష్టించగల ఉపకరణాలను సృష్టించటమే ధ్యేయంగా శామ్యూల్‌ ఆల్ట్‌మాన్‌ 2015లో స్టార్టప్‌ కంపెనీ ఓపెన్‌ ఏఐ స్థాపించాడు. మరో నాలుగేళ్లకు మైక్రోసాఫ్ట్, ట్విటర్‌ సహా కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులూ అందులో పాలుపంచుకున్నారు. దాని పరిశోధనలు స్వల్ప కాలంలోనే అద్భుత ఆవిష్కరణలకు దారితీసి ఓపెన్‌ ఏఐ సిలికాన్‌ వ్యాలీలో 8,000 కోట్ల డాలర్ల దిగ్గజ సంస్థగా ఆవిర్భవించింది.

అది ఏడాదిక్రితం తీసుకొచ్చిన చాట్‌జీపీటీ స్మార్ట్‌ ఫోన్‌ తర్వాత అంతటి గొప్ప ఆవిష్కరణగా గుర్తింపుపొందింది. అంతేకాదు, అది మున్ముందు మానవాళి మనుగడకు సైతం ముప్పుగా పరిణమించవచ్చన్న భయాందోళనలూ బయల్దేరాయి. దాన్ని అదుపు చేసేందుకు ఎలాంటి చట్టాలు అవసరమో ప్రపంచ దేశాధి నేతలంతా చర్చించుకుంటున్నారు. అమెరికా, బ్రిటన్, యూరొపియన్‌ యూనియన్‌లు ఇప్పటికే చట్టాలు చేశాయి.

మన దేశం కూడా ఆ పనిలోనే వుంది. కృత్రిమ మేధతో దేశదేశాల పౌరుల గోప్య తకూ, ముఖ్యంగా మహిళల, పిల్లల భద్రతకూ రాగల ముప్పు గురించిన భయసందేహాలు అంతటా ఆవరించాయి. రక్షణ రంగ వ్యవస్థల్లోకి, మరీ ముఖ్యంగా సైనిక స్థావరాల్లోకి ఇది ప్రవేశిస్తే రెప్ప పాటులో భూగోళం బూడిదగా మారుతుందన్న హెచ్చరికలు వస్తూనే వున్నాయి. సురక్షితమైన కృత్రిమ మేధ మాత్రమే ప్రపంచానికి అవసరమంటూ అల్‌ట్రూయిజం వంటి టెక్‌ ఉద్యమాలూ బయల్దేరాయి.  

ఈ నేపథ్యంలో అసలు ఓపెన్‌ ఏఐలో ఏం జరిగిందన్న ఆసక్తి, ఆత్రుత వుండటం సర్వసాధారణం. విషాదమేమంటే సంస్థ ఎగ్జిక్యూటివ్‌గా వున్న శామ్‌ ఆల్ట్‌మాన్‌కూ, డైరెక్టర్ల బోర్డుకూ మధ్య ఏర్పడ్డ లడాయి ఏమిటన్నది వెల్లడికాలేదు. ఆల్ట్‌మాన్‌ దేన్నీ సూటిగా, స్పష్టంగా చెప్పటం లేదని ఇప్పుడు నిష్క్రమించిన డైరెక్టర్లు ఆరోపించారు. ఆయన దేన్ని దాచటానికి ప్రయత్నించాడో, ఏ విషయంలో వారికి స్పష్టత రావటంలేదో వివరించలేదు. సరిగ్గా ఇదే కీలకమైనది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న భయాందోళనలకూ, ఈ వివాదానికీ సంబంధం వుండే అవకాశం లేకపోలేదని కొందరి విశ్లేషణ.

కృత్రిమ మేధతో పరిశోధనలు సాగిస్తున్నది ఓపెన్‌ ఏఐ మాత్రమే కాదు... దాంతోపాటు అమెరికాలోనే ఆంత్రోపిక్, స్కేల్‌ ఏఐ, విజ్‌.ఏఐ, డీప్‌ 6 వంటి  50 సంస్థ లున్నాయి. ఇవిగాక మన దేశంతోపాటు అనేక దేశాల్లో పలు సంస్థలు కృత్రిమ మేధపై పని చేస్తున్నాయి. ఎలాంటి నిబంధనలూ, నియంత్రణలూ లేని వర్తమాన పరిస్థితుల్లో ఆర్నెల్లపాటు కృత్రిమ మేధ పరిశోధనలపై మారటోరియం విధించాలని టెక్‌ నిపుణులు కొందరు ఆమధ్య సూచించారు. కృత్రిమ మేధలో పరిశోధనలు చేస్తున్న ఎలిజార్‌ యుడ్కోవ్‌స్కీ ఈ టెక్నాలజీ తెలివి తేటల్లో మనుషుల్ని మించిపోతుందని, చివరకు వారినే మింగేస్తుందని, చివరకు మనమంతా నియాండర్‌తల్‌ యుగానికి తిరోగమించటం ఖాయమని జోస్యం చెప్పాడు. 

అయితే కృత్రిమ మేధతో రాగల ప్రమాదాల గురించి కొందరు అతిగా మాట్లాడుతున్నారన్న విమర్శలూ వున్నాయి. మానవాళికి ముప్పు తెచ్చే అగ్ని పర్వతాలు, గ్రహశకలాలు, అణ్వాయుధా లకన్నా అదేమీ పెద్ద ప్రమాదకారి కాదని వారి వాదన. భయాందోళనల మాటెలావున్నా దాని శక్తి సామర్థ్యాలు, ఉపయోగాలు కాదనలేనివి. రెండువేల ఏళ్లనాడు వర్ధిల్లిన పురాతన లిపుల్లో ఏం నిక్షిప్తమైవున్నదో వెలికితీసింది కృత్రిమ మేధ ఆధారంగా అందుబాటులోకి వచ్చిన ఉపకరణాలే. చరిత్రలో తొలికాలపు గ్రీకులు రాసినదేమిటో అర్థం చేసుకోవటానికి మూడువేల యేళ్లు పట్టింది. మయన్లు లిఖించిన పదాల కూర్పులోని రహస్యమేమిటో తెలుసుకోవటానికి రెండు శతాబ్దాలు పట్టింది. కానీ ఏఐ అలాంటి సంక్లిష్టమైన లిపులను క్షణాల్లో తేటతెల్లం చేస్తోంది. అందువల్ల ప్రాచీన మానవుల జీవన విధానంపై మన అవగాహన పెరిగింది. ఇక వైద్యపరంగా కృత్రిమ మేధ సాధిస్తున్నది అపారం.

శామ్‌ ఆల్ట్‌మాన్‌కు గురు సమానుడు స్టీవ్‌ జాబ్స్‌. మరొకరితో కలిసి ఆయన నెలకొల్పిన యాపిల్‌ సంస్థకు ఏరికోరి సీఈఓగా తెచ్చుకున్న వ్యక్తే 1985లో ఆ సంస్థనుంచి స్టీవ్‌ జాబ్స్‌ను వెళ్ల గొట్టడం, తదనంతర పరిణామాల్లో జాబ్స్‌ తిరిగి అదే సంస్థకు రావటం చరిత్ర. ఇప్పుడు ఆల్ట్‌ మాన్‌కు కూడా అదే జరిగింది. ఏదేమైనా ఓపెన్‌ఏఐలో జరిగిందేమిటో, పరిశోధనల దశ, దిశ ఎలా వున్నాయో తెలుసుకోవటం ప్రపంచ ప్రజానీకం హక్కు. అది తేటతెల్లం చేయాల్సిన బాధ్యత సంస్థ లపై వుంది. కేవలం మానవాళి మంచికి మాత్రమే ఉపయోగపడేలా, ప్రభుత్వాలతో సహా ఎవరూ ఏఐని దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టమైన నియంత్రణలు విధించటం తక్షణావసరం. 

మరిన్ని వార్తలు