Sakshi News home page

న్యాయాన్యాయాలు

Published Sat, Dec 9 2023 5:11 AM

sakshi Editorials On Mahua Moitra - Sakshi

న్యాయం చేయటమే కాదు... చేసినట్టు కూడా కనబడాలంటారు.  శుక్రవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరిస్తూ లోక్‌సభ మూజువాణీ ఓటుతో తీర్మానం ఆమోదించిన తీరు ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించింది. మొయిత్రాపై వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలేమిటి, వాటి తీవ్రత ఎంత... ఎథిక్స్‌ కమిటీ ఆ ఆరోపణలను పరిశీలించవచ్చునా లేదా వంటి సందేహాల వరకూ పోనవసరం లేదు.

అసలు బహిష్కరణకు గురయ్యే సభ్యులు ఆ నిర్ణయంపై సభలో తమ స్వరం వినిపించటానికి అవకాశం ఇవ్వకపోవటం సబబేనా?  మొన్న 4న మొదలైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 22వ తేదీ వరకూ సాగుతాయి. నివేదికపై శుక్రవారం అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం నడిచింది. ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ విపక్షం వాకౌట్‌చేసింది.

ఎథిక్స్‌ కమిటీలో మొయిత్రాకు అవకాశమిచ్చామని, కానీ అడిగిన వాటికి జవాబులివ్వకుండా ఆమె దూషణలకు దిగారని కమిటీ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ సోంకార్, కమిటీలోని బీజేపీ సభ్యులు ఇప్పటికే ఆరోపించారు. ఫిర్యాదుకు సంబంధంలేని ప్రశ్నలతో వేధించారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఆ ప్రశ్నలున్నాయని మొయిత్రా కూడా ప్రత్యారోపణ చేశారు. ఒకవేళ మొయిత్రా చేసిన ఆరోపణలన్నీ అబద్ధమే అనుకున్నా... అంతమాత్రాన సభలో తన వాదన వినిపించేందుకు ఆమె అనర్హురాలవుతారా? చట్టసభల్లో జరిగే చర్చలు, వాటి ప్రత్యక్ష ప్రసారాలు పాలక, విపక్ష సభ్యుల్లో ఎవరు ఎవరికంటే బాగా మాట్లాడుతున్నారో నిర్ణయించటానికి కాదు. తాము ఎన్నుకున్న సభ్యులు చర్చిస్తున్నదేమిటో, తీసుకుంటున్న నిర్ణయాలేమిటో, వాటిలోని మంచిచెడ్డలేమిటో తెలుసుకోవటం కోసం. మొయిత్రా కావొచ్చు...మరొకరు కావొచ్చు – చర్చ

సందర్భంగా అప్రామాణికంగా లేదా అసంబద్ధంగా మాట్లాడితే వారి వాదనలోని డొల్లతనాన్ని ప్రజలే గ్రహిస్తారు. అది పాలకపక్షానికే మంచిది. సభలో అధికారపక్షానికి కావలసినంత మెజారిటీ వుంది. కనుక మొయిత్రాకు అవకాశమిచ్చినంత మాత్రాన  కలిగే నష్టం ఏమీ లేదు. అసలు ఎథిక్స్‌ కమిటీ నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశ ప్రారంభం రోజైన ఈనెల 4నే ప్రవేశపెట్టాలి. కానీ పాలక పక్షం శుక్రవారానికి వాయిదా వేసింది. అయినా ఈ వ్యవహారం ఇలా ముగియటం మన పార్లమెంటరీ వ్యవస్థ లోపాన్ని తెలియజెబుతోంది. నివేదికను కమిటీలోని ఆరుగురు అంగీకరించగా, నలుగురు దాన్ని వ్యతిరేకించారు. ఎథిక్స్‌ కమిటీ నిర్ణయం సబబే కావొచ్చు... అది మెజారిటీ ప్రకారమే తీసుకుని వుండొచ్చు. కానీ సభలో మొయిత్రాకు అవకాశమీయటంవల్ల ఎంపీగా ఆమె ప్రవర్తనలోని గుణదోషాలను పౌరులు తెలుసుకునే అవకాశం వుంటుంది కదా! దాన్ని నిరాకరించటం ఏం సబబు?


మొయిత్రాపై వున్న ఆరోపణల పూర్వాపరాలు పరిశీలిస్తే పార్లమెంటు సభ్యురాలిగా ఆమె తన పరిమితులు అతిక్రమించారా అన్న సందేహాలు కలుగుతాయి. సభలో వేయదల్చుకున్న ప్రశ్నలను సభ్యులు ఎక్కడి నుంచి అయినా ఎన్‌ఐసీలో లాగిన్‌ అయి, నేరుగా స్పీకర్‌కు చేరే విధంగా పోస్ట్‌ చేయొచ్చు. ఆ ప్రశ్నల అర్హతను స్పీకర్‌ నిర్ణయించాక అవి సంబంధిత మంత్రిత్వ శాఖలకు వెళ్తాయి. అనర్హ ప్రశ్నలను తొలగిస్తారు.  ఇదంతా ఆమె నేరుగా చేసివుంటే ఇంత రచ్చయ్యేందుకు ఆస్కారం వుండేది కాదు. తన స్నేహితుడైన దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హీరానందానీకి తన పార్లమెంటు లాగిన్, పాస్‌వర్డ్‌ అందజేసి అందులో ప్రశ్నలు పోస్ట్‌ చేయించమని చెప్పారు. తన నియోజకవర్గ పనుల్లో తీరిక లేకుండా వున్నందున ఇలా చేయించానని మొయిత్రా సంజాయిషీ. మామూలుగా ఇది సబబు అనిపించదు. కానీ 800మంది ఎంపీల్లో అత్యధికులు ఇలాగే చేస్తున్నారని, ప్రతిదీ వారే చేయాలంటే అసాధ్యమని ఆమె చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక నిబంధనేదీ లేదంటున్నారు. ఒకరిద్దరు సభ్యులు సైతం తామూ అలాగే చేస్తున్నామని చెప్పారు. ఎథిక్స్‌ కమిటీ మాత్రం ఇది దేశ భద్రతకు ముప్పు తెచ్చే చర్య అంటున్నది. పైగా లంచం తీసుకుని అదానీ సంస్థ లపై ఆమె ఈ ప్రశ్నలు వేశారని బీజేపీ సభ్యుల ఆరోపణ. ఈ సందర్భంగా 2005లో ఆన్‌లైన్‌ పోర్టల్‌ ‘కోబ్రా పోస్ట్‌’ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌ గురించి ప్రస్తావించుకోవాలి. 11మంది ఎంపీలు ప్రశ్నలు అడిగేందుకు తాము ఇవ్వజూపిన డబ్బు తీసుకున్నారని ఆ పోర్టల్‌ తేల్చింది.

వీరిలో బీజేపీ, కాంగ్రెస్, ఆర్‌జేడీ, బీఎస్‌పీలకు చెందినవారున్నారు. ఇందులో 10 మంది లోక్‌సభ సభ్యులు, మరొకరు రాజ్యసభకు చెందినవారు. ఇదంతా ఒక చానెల్‌లో ప్రసారమైంది. ఆ ఎంపీలను సభ నుంచి బహిష్కరిస్తున్న సందర్భంలో మాట్లాడిన బీజేపీ సీనియర్‌ నేత అడ్వాణీ ఇందులో అవినీతికన్నా ఎంపీల బుద్ధిహీనత వెల్లడవుతోందన్నారు. అందుకు బహిష్కరణ శిక్ష విధించటం క్రూరమైన చర్యగా అభివర్ణించారు. మొయిత్రా విషయంలో దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా?

అసలు మొయిత్రాపై వచ్చిన ఆరోపణలకు విడిపోయిన ఆమె సహచరుడు జైఅనంత్‌ దేహద్రాయ్‌ బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబేకు రాసిన లేఖ ప్రాతిపదిక. మొయిత్రా, దేహద్రాయ్‌లకు బోలెడు తగువులున్నాయి. పెంపుడు కుక్క విషయం మొదలుకొని ఎన్నిటిపైనో పరస్పరం కేసులు పెట్టుకున్నారు. అందువల్ల ఆ లేఖకు ఎంతవరకూ ప్రాధాన్యమీయవచ్చో ఆలోచిస్తే బాగుండేది. అలాగే ప్రభుత్వంపై మొయిత్రా  తరచు నిశిత విమర్శలు చేస్తుంటారు గనుక, ఆ కారణంతోనే చర్య తీసుకున్నారన్న అపప్రద రాకుండా చూసుకోవాల్సింది. అసలు ఆమెకు సభలో మాట్లాడే అవకాశ మిస్తే ఆదరాబాదరాగా చేశారన్న నిందకు అవకాశం వుండేదే కాదు.

– డా‘‘ గుబ్బల రాంబాబు, రాజమహేంద్రవరం
(డిసెంబర్‌ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం) 


 

Advertisement

What’s your opinion

Advertisement