అక్కడి ఓటు... ఇక్కడి గుట్టు!

10 Dec, 2023 04:46 IST|Sakshi

జనతంత్రం

తెలంగాణ రాజకీయ పరిణామాల్లో ఓ సూపర్‌ వీక్‌ గడిచి పోయింది. ఆదివారం ఎన్నికల ఫలితాల వెల్లడితో ప్రారంభమై శనివారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో సూపర్‌ వీక్‌ ముగిసింది. ఈ ఏడు రోజుల్లో చాలా పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి సహా పన్నెండు మంది కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. అందరూ అనుభవం, సామర్థ్యం కలిగినవాళ్లే కనుక ఎటువంటి ఆక్షేపణలూ మంత్రివర్గంపై వెలువడలేదు. ఇంకో ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశం ఉన్నది. ఆ ఖాళీలు పూర్తయితే గానీ అలకలు, అసంతృప్తులు బయటపడవు.

ఏ ప్రభుత్వానికైనా మొదటి మూడు నెలలను హనీమూన్‌ పీరియడ్‌గా పరిగణిస్తారు. విమర్శకులు గానీ, విపక్షాలు గానీ, మీడియా గానీ పెద్దగా తప్పులెన్నకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరించడం ఒక సంప్రదాయం. మన యెల్లో మీడియాకు మాత్రం ఈ సంప్రదాయం నుంచి మినహాయింపు ఉంటుంది. అధికారంలో ఉన్నది మనవాళ్లే అనుకుంటే యెల్లో మీడియా ఐదేళ్లపాటు చిడతలు వాయిస్తూనే ఉంటుంది. మనవాళ్లు కాద నుకుంటే మూడోరోజు నుంచే మూతి విరుపులు మొదలు పెడుతుంది.

గురువారం నాడు కొత్తమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్‌ (ఇప్పుడు ప్రజాభవన్‌) ప్రవేశం దగ్గరున్న ఇనుప కంచెను కొత్త ప్రభుత్వం బద్దలు కొట్టించింది. నిజానికి ఇదొక ప్రతీకాత్మక (సింబాలిక్‌) చర్య. ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ‘దొరల ప్రభుత్వం’గా కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేసింది.

తాము గెలిస్తే ‘గడీ’ గోడల్ని కూల్చివేస్తామని, ప్రజాపాలన ఏర్పాటు చేస్తామని చెప్పింది. కంచె తొలగింపు అనేది ఆ ప్రచారానికి అనుగుణంగా జరిగిన ఒక సింబాలిక్‌ చర్య. కనుక ఈ చర్యపై ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. యెల్లో మీడియా ఈ వ్యవహారాన్ని రిపోర్టు చేయడంలో చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఆ మీడియా ద్వంద్వ ప్రమాణాల గురించి చెప్పడానికే ఈ ప్రస్తావన.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణానది కరకట్ట మీద ఒక అక్రమ భవంతిలో నివాసం ఉన్నారు. పైగా దాని పక్కన ‘ప్రజావేదిక’ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా మరో అక్రమ భవనాన్ని నిర్మించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేశారు. దీని మీద యెల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఎంత యాగీ చేశాయో, ఇప్పటికీ ఎలా చేస్తున్నాయో ఆంధ్ర ప్రజలందరికీ తెలిసిన సంగతే.

ఈ వారం రోజుల పరిణామాల్లో కొత్త ప్రభుత్వం తీసు కున్న చెప్పుకోదగ్గ నిర్ణయాల్లో రెండు ముఖ్యమైనవి. మొదటిది ప్రజాభవన్‌లో వారానికి రెండుసార్లు ‘ప్రజాదర్బార్‌’ను నిర్వ హించి సమస్యలను తెలుసుకోవడం. కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని శనివారం నాడు ప్రారంభించడం రెండో కీలక నిర్ణయం.

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దురదృష్టవశాత్తు గాయపడి ఆస్పత్రిలో చేరిన విచారకర సంఘటన కూడా ఈ పరిణామాల మధ్యనే చోటుచేసుకున్నది. అధికారం కోల్పోయినప్పటికీ రాష్ట్రంలో నేటికీ అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయ కుడు నిస్సందేహంగా కేసీఆరే! రెండు కోట్ల పాతిక లక్షలమంది మంది ఓటర్లు పాల్గొన్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య ఓట్ల తేడా నాలుగున్నర లక్షలు మాత్రమే!

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ముందుగా ‘ప్రజా దర్బార్‌’ గురించి మాట్లాడుకుందాం. దీర్ఘకాలంగా పరిష్కారం కాని తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇదొక మార్గంగా తొలుత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. ఆయన తర్వాత ఈ కార్యక్రమం ఆగిపోయింది.

తిరిగి కాంగ్రెస్‌ ప్రభుత్వం శుక్రవారం నాడు పునరుద్ధరించింది. మొదటిరోజే మూడు నాలుగు వేలమంది ప్రజాభవన్‌లోకి విజ్ఞాపన పత్రాలతో దూసుకొచ్చారు. పేరుకుపోయిన ప్రజల వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం మార్గం చూపించినందుకు సంతోషించాలా? ప్రజా ప్రభుత్వాలు ఏర్పడిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా ముఖ్యమంత్రిని దర్శించుకుంటే తప్ప సమస్యకు పరిష్కారం దొరకని పరిస్థితికి విచారించాలా? ఆలోచించవలసి వస్తున్నది.

వివిధ రకాల ప్రభుత్వ సేవలు, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు వీలైనంతవరకు దిగువ స్థాయిలోనే పరిష్కారం దొరకాలి. అందుకోసం రాజకీయ జోక్యం లేని ఒక పారదర్శక వ్యవస్థ ఉండాలి. ఈ రకమైన వ్యవస్థకు విజయవంతమైన ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌. ఎటువంటి రాజకీయ జోక్యం, పక్షపాతం లేకుండా గ్రామస్థాయిలోనే విలేజ్‌ సెక్రటేరియట్, వలంటీర్‌ వ్యవస్థలు పారదర్శకంగా సేవలందిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించగలుగుతున్నాయి.

సెక్రటేరియట్‌కు ఒక అర్జీ చేరినట్టయితే ఎన్ని రోజుల్లో దాన్ని పరిష్కరిస్తారో ముందే చెప్పాలి. ఆ గ్రామానికి చెందిన అర్జీల స్టేటస్‌ రిపోర్టును ఏ రోజుకారోజు అక్కడున్న బోర్డు మీద రాసి పెట్టాలి. ఈ పారదర్శకత సత్ఫలితాలనిచ్చింది. అక్కడ కూడా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలను జల్లెడ పట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ పేరుతో ఒక స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహించింది. ఇందులో ప్రజా ప్రతినిధులు, అధికారులందరూ పాల్గొన్నారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో పరి ష్కారం దొరికిన సమస్యలు డెలివరీ అయిన సేవలు ఒక కోటికి పైగా ఉన్నాయి.

చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలనుకున్నప్పుడు అటువంటి పారదర్శక వ్యవస్థ అవసరం. గడప దగ్గరే ప్రజలకు సేవలందడం ప్రజాస్వామిక లక్షణం. అర్జీలు చేతబట్టుకొని ప్రయాసపడి రాజధానికి వెళ్లి దర్బార్‌ దర్శనాల కోసం వేచి ఉండడం ఫ్యూడల్‌ వ్యవస్థ లక్షణం. ఫ్యూడల్‌ ధోరణులకు స్వభావ రీత్యానే తెలంగాణ ప్రజలు వ్యతిరేకులు. దారుణమైన ఫ్యూడల్‌ దోపిడీకి గురైన అనుభవం వారినట్లా మార్చింది. మరి ఎందుకని తొలిరోజున జనం వెల్లువెత్తారు? నియోజక వర్గాల స్థాయిలో మితిమీరిన రాజకీయ జోక్యం, ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం పారదర్శకతకు పాతరేశాయి.

రెండు మూడుసార్లు ఎన్నికైన కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆడింది ఆటగా పాడింది పాటగా అధికార యంత్రాంగంలో చలామణీ అయింది. తమవాళ్లు కాదనుకున్నవారి పేర్లు లబ్ధిదార్ల జాబితాల్లోకెక్కలేదు. అందుకే వేలాది సమస్యలు పేరుకొని పోయాయి. ఆ సమస్యల పరిష్కారానికి జరిగే ప్రతి ప్రయ త్నాన్ని ఆహ్వానించవలసిందే. ఆ మేరకు ప్రజాదర్బార్‌ ఉప యోగమే. అయితే ఇది సమస్య మూలాల్లోకి వెళ్లగలిగేది కాదు. ఒక సింబాలిక్‌ చర్యే!

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమల్లోకి తెస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అందులో రెండు గ్యారెంటీల అమ లును రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ప్రారంభించింది.

అందులో ఒకటి ‘ఆరోగ్యశ్రీ’ పరిధిని పది లక్షలకు పెంచడం. ఎన్నికల హామీల్లో భాగంగా పదిహేను లక్షలకు పెంచుతామని బీఆర్‌ఎస్‌ చెప్పింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ పరి ధిని పాతిక లక్షల రూపాయలకు పెంచింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ స్కీమ్‌లోకి వచ్చే ప్రొసీజర్స్‌ను కూడా మూడు రెట్లు పెంచింది. అందువల్ల కాంగ్రెస్‌ తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీ వారు ఊహించినంత సంచలనం కలిగించ లేకపోయింది.

కానీ, ‘మహాలక్ష్మి’ స్కీమ్‌కు తొలిరోజు మంచి స్పందన వ్యక్తమయింది. అన్ని వయసుల్లోని మహిళలకు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తొలుత ఢిల్లీలోని ‘ఆప్‌’ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది సూపర్‌ హిట్టవ్వడంతో కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ కూడా తన ఎన్నికల గ్యారెంటీల్లో ప్రకటించి విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన మొదటి పథకం కూడా ఇదే.

ఈ పథకం ఆచరణ యోగ్యతపై భిన్నమైన వాదనలుప్పటికీ సూత్ర రీత్యా స్వాగతించవలసిన కార్యక్రమం. ఎందుకంటే ప్రయాణం... పర్యటన, విహారం... పేరు ఏదైనా మొబిలిటీ అనేది అభివృద్ధికి సంకేతం. అభివృద్ధికి మొబిలిటీ అవసరం. ఇప్పటికీ కదలిక లేకుండా ఉన్న మహిళల్ని ఈ కార్యక్రమం కది లించవచ్చు. ఈ కదలిక వారిలో లోకజ్ఞానాన్నీ, నిర్భీతినీ ప్రోది చేస్తుంది. సాధికారతకు తోడ్పడుతుంది. విజయవంతంగా అమలుచేయగలిగితే ఇది ప్రగతికి తోడ్పడే కార్యక్రమం.

తెలంగాణ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలుగా మార్చే ప్రయత్నం చేసింది. తెలంగాణలో ఎన్నికల ముందే కనిపించిన ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని అంచనా వేసుకొని అనధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. ఏపీ సెటిలర్ల తోడ్పాటుతో తాము బీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించబోతున్నామని తెలుగుదేశం అభిమాన సంఘీయులు తొడలు మెడలు చరుచుకుంటూ ప్రక టనలు గుప్పించారు. సెటిలర్లంతా తెలుగుదేశం చెప్పినట్టే వింటారనీ, తెలుగుదేశం పార్టీ చొక్కా జేబులో వాళ్లంతా నివసిస్తున్నారనీ భారీ బిల్డప్‌లు ఇచ్చుకున్నారు. కానీ, డామిట్‌... కథ అడ్డం తిరిగింది!

ఏపీ సెటిలర్ల ఉనికి పెద్దగా లేని జిల్లాల్లో, నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ విజయాలు సాధించింది. ఖమ్మం జిల్లా మినహాయింపు. అక్కడ గత మూడు ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు చేదు అనుభవమే కలిగింది. ఆ పార్టీకి పునాదులు బలంగా పడలేదు. కాంగ్రెస్‌ పార్టీ టెన్‌ బై టెన్‌ స్కోర్‌ సాధిస్తుందని భావించిన జిల్లా. కానీ ఒక సీటు (భద్రాచలం)ను కోల్పోయింది.ఇక సెటిలర్లు గణనీయమైన ప్రభావాన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో చూపాలి. ఇక్కడ 24 అసెంబ్లీ సీట్లు న్నాయి. పాతనగరంలోని ఏడు సీట్లను మినహాయిస్తే మిగతా ప్రాంతంలో దాదాపు 15 లక్షలమంది ఏపీ నుంచి వలస వచ్చిన ఓటర్లు ఉండవచ్చనే అంచనా ఉన్నది.

తెలుగుదేశం వారి ఆదేశాల ప్రకారం ఏపీ సెటిలర్లంతా నడుచుకుంటే ఈ పదిహేడు సీట్లను కూడా కాంగ్రెస్‌ పార్టీ గెలిచి ఉండాలి కానీ, ఒక్క సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. నాంపల్లిలో మజ్లిస్‌ మినహా మిగిలిన 16 సీట్లను బీఆర్‌ఎస్‌ భారీ తేడాతో గెలుచుకున్నది. పాతబస్తీ పరిధిలోని గోషా మహల్‌ సీటును మాత్రం బీజేపీ దక్కించుకోగలిగింది.

సాధారణంగా ఎన్నికల సమయాల్లో ఏపీ సెటిలర్లంతా ఒకరకంగా, తెలంగాణ సెటిలర్లు ఒకరకంగా, ఉత్తర భారతీయులు ఇంకో రకంగా స్పందించడం ఉండదు. అప్పటి పరిస్థితులను బట్టి దాదాపుగా ఒకే రకమైన స్పందన నమోదవుతూ వస్తున్నది. ఎప్పుడైతే తెలుగుదేశం వర్గీయులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం మొదలుపెట్టారో అప్పుడే ఏపీ సెటిలర్లలో నిట్ట నిలువునా చీలిక ఏర్పడింది. తెలుగుదేశం హడావిడి లేకుంటే ఈ చీలిక ఏర్పడేది కాదు.

తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న కుల రాజకీయాల కారణంగా దాన్ని అనుసరించవలసి వచ్చిన కమ్మ సామాజిక వర్గం వారు మాత్రం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓట్లేయడంతోపాటు ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వారు తెలుగుదేశం జెండాలు పట్టుకొని ఊరేగింపుల్లో పాల్గొన్నారు. గాంధీభవన్‌ దగ్గర జరిగిన ర్యాలీలో పచ్చజెండాలతో డ్యాన్సులు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీని అనుసరించే సామాజిక వర్గం కాంగ్రెస్‌ వైపు తిరగ్గానే మిగిలిన సామాజిక వర్గాలు వారికి ఎదురు తిరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులుగా ఉన్న బలహీనవర్గాల ప్రజలు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వైఖరిని తీసుకున్నారు.

సెటిలర్లు అధికంగా కలిగిన పోలింగ్‌ బూత్‌ల సూక్ష్మ స్థాయి విశ్లేషణలో ఈ సంగతి ప్రస్ఫుటంగా వెల్లడైంది. ఉదాహరణకు కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బూత్‌ నెంబర్‌ 24. ఆచార్య వినోభాపురం కాలనీ. ఇక్కడ అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా సెటిలర్లు ఉంటారు. అందులోనూ తూర్పు కాపులు ఎక్కువ. ఈ బూత్‌లో బీఆర్‌ఎస్‌కు 329 ఓట్లు పడ్డాయి.కాంగ్రెస్‌కు 191, జనసేనకు 120 ఓట్లు వచ్చాయి. ఏపీలో జగన్‌ ప్రభుత్వ పాలన బాగుందనీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తున్నందువల్లనే తాము బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తున్నామనీ సత్తిబాబు అనే వ్యక్తి చెప్పారు.

కూకట్‌పల్లి నియోజకవర్గంలోనే కేపీహెచ్‌బీ కాలనీ బూత్‌ నెంబర్‌ 326. ఇక్కడ ఉన్నదంతా ఏపీ సెటిలర్లే. ఒకే కులంగా చూసినప్పుడు కమ్మవారు ఎక్కువ. ఆ తర్వాత స్థానాల్లో శెట్టిబలిజ, యాదవ, గవర తదితర బీసీ కులాలుంటాయి. కాపులు కూడా గణనీయంగానే ఉన్నారు. అదే నిష్పత్తి ఓటింగ్‌లో వెల్లడైంది. కాంగ్రెస్‌ పార్టీకి 214 ఓట్లు వస్తే, బీఆర్‌ఎస్‌కు 430 మంది, జనసేనకు 132 మంది ఓటేశారు. స్థానిక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గమైనప్పటికీ ఆయనకు 15 నుంచి 20 శాతానికి మించి ఆ కులం ఓట్లు పడలేదని వారే చెప్పారు.

ఆ ప్రాంతానికి చెందిన పరుచూరి ప్రసాద్‌ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ మళ్లీ చంద్ర బాబు గెలిస్తేనే ఏపీలో అభివృద్ధి ఉంటుంది కనుక ఆయన అభీష్టం మేరకు ఇక్కడ తాము కాంగ్రెస్‌కు ఓటేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం వర్గీయుల అత్యు త్సాహం మొదటికే మోసం తెచ్చింది. తెలుగుదేశం అను కూలురు – వ్యతిరేకులుగా ఏపీ సెటిలర్లు చీలిపోయారు. వ్యతి రేకుల ఆధిక్యత నిర్ద్వంద్వంగా రుజువైంది. ఒకరకంగా రాబోయే ఏపీ ఎన్నికల ప్రీ పోల్‌ సర్వే ఫలితాలను సెటిలర్ల కాలనీలు ప్రకటించాయి.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

>
మరిన్ని వార్తలు