రెండో గొంతు

11 Dec, 2023 00:00 IST|Sakshi

మనదైనది ఏదో వ్యక్తం చేయడానికి మనదైన భాష ఒకటి ఉండాలనుకుంటాం. కానీ భాష చిత్రమైంది. ఒక్కోసారి అనుకున్న మాట వెంటనే తట్టదు. ఇంకో సందర్భంలో ఆ ఒక్కమాటకు పది మాటలు కనబడి గందరగోళ పరుస్తాయి. రెండు సందర్భాల్లోనూ మనిషి మూగ కావడం గమనార్హం. ఇదంతా భాష సమస్య కాదేమో; మన లోపలి భావానికి అనుగుణంగా భాష మనల్ని ఇలా ఒంటరిగా మాట తోడులేకుండా నిలబెట్టే స్థితిని కల్పిస్తుందేమో! భావం అనేది చాలా సంక్లిష్టమైంది కదా మరి! దాన్ని భాషలోకి తేవాలని అనుకున్నప్పుడు, ఎంతో తెలుసు అనుకున్నది కూడా, ఏ కొసను అందుకోవాలో తెలియక తికమక పరుస్తుంది.

ఒక తేనెతుట్టె ఏదో లోపల కదిలినట్టయి గందరగోళం తలెత్తుతుంది. అనుకున్న వ్యక్తీకరణ గాడి తప్పుతుంది. భావాన్ని వ్యక్తపరచడానికి ఏ భాష అయితే కావాలో అదే అవరోధంగా మారడం తమాషా కదా! మరి దానికేమిటి దారి? సంజ్ఞలైతే పనికిరావు. కాబట్టి మళ్లీ భాషే దిక్కు. పోనీ, ఇంకేదో భాష అయితే? అందులో మనకు అంతగా ప్రవేశం లేనిదైతే? ఒక్కోమాటా వాక్యంగా పేర్చుకునేదైతే? నిజంగా అలా రాయడం సాధ్యమా? ప్రపంచ సాహిత్యంలో పేరెన్నికగన్న కొందరు రచయితలు ‘తమది కాని’ భాషలో సాహిత్యం సృజించారు.

1978లో బేస్‌బాల్‌ గేమ్‌ చూస్తున్నప్పుడు, ఆటగాడు బంతిని బలంగా కొట్టిన బ్యాట్‌ శబ్దం టోక్యో శివార్లలోని ‘జింగు’ స్టేడియం మొత్తం ప్రతిధ్వనించిన ఒకానొక క్షణాన ఇరవైల్లో ఉన్న హరూకీ మురకామీకి ఉన్నట్టుండి తానూ రాయగలనని అనిపించింది. ఆ క్షణం ఆయనలో ఏదో ఎల్లలు లేని సృజనావేశం తన్నుకొచ్చింది. దాన్ని అలాగే పోనీయకుండా కొన్ని నెలలు శ్రమించి, రాత్రుళ్లు కుస్తీపట్టి జపనీస్‌ భాషలో మొదటి నవల రాయడానికి ప్రయత్నించాడు. అంతా అయ్యాక చదివితే ఆయనకే నచ్చలేదు. దీనికి కారణం – తన మాతృభాషలో ‘పశువుల కొట్టంలో పశువులు క్రిక్కిరిసినట్టుగా’ ఆలోచనలు రొద పెట్టడమే! దీనివల్ల ఉక్కిరిబిక్కిరికి లోనయ్యాడు.

‘ఒకరి భావాలను అలవోకగా ఒక క్రమంలో పెట్టడం గురించి మాట్లాడటం సులభమేగానీ, అలా చేయడం అంత సులభం కాదు. బొత్తిగా అప్పుడే రాయడం మొదలుపెట్టిన నా లాంటివాడికి అది మరింత కష్టం. కొత్తగా మళ్లీ ప్రారంభించడానికి, నేను చేయాల్సివచ్చిన మొదటి పని నా రాతప్రతుల కుప్పనూ, ఫౌంటెన్ పెన్ నూ వదిలించుకోవడం! అవి నా ముందు ఉన్నంతసేపూ నేనేదో ‘సాహిత్యం’ లాంటిదాన్ని రాస్తున్నట్టనిపించింది. వాటి స్థానంలోకి నా పాత అలవెటీ టైప్‌రైటర్‌ను అల్మారా లోంచి తెచ్చాను. తర్వాత, ఒక ప్రయోగం లాగా, నా నవల ప్రారంభాన్ని ఇంగ్లీష్‌లో రాయాలని నిర్ణయించుకున్నాను.

ఎటూ ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నప్పుడు ఇలా ఎందుకు చేయకూడదనిపించింది?’ అంటూ మురకామీ తాను తన జపనీస్‌ను కాదని ఆంగ్లంలో రాయడానికి పూనుకోవాల్సి వచ్చిన నేపథ్యం చెబుతాడు. అయితే, ఆంగ్లం ఆయనకేమీ మంచినీళ్ల ప్రాయం కాదు. ఈ భాష పరిమితి వల్ల సంక్లిష్ట వాక్యాలు రాయడం కుదరదు. ఆ ఉన్న కొద్దిపాటి పదసంపద, వ్యాకరణాలనే ప్రతిభావంతంగా ఉపయోగించుకోవాలి. ‘మై కిచెన్  టేబుల్‌ ఫిక్షన్ ’ ధోరణిగా వర్ణించే ఆయన రచనలు అలా మొదలయ్యాయి. ఈ ధోరణిలో వచ్చిన ‘హియర్‌ ద విండ్‌ సింగ్‌’ నవలిక మురకామీని అమాంతం పైకి ఎత్తేసింది.

కృత్యాదిలోనే మురకామీ అవస్థ పడ్డాడు. కానీ ఝుంపా లాహిరిది ఇంకో కథ. లండన్ లో పుట్టి, అమెరికాలో పెరిగిన భారత(బాంగ్లా) సంతతి ఝుంపా ‘ఇంటర్‌ప్రిటర్‌ ఆఫ్‌ మాలడీస్‌’ నవలకు ‘పులిట్జర్‌’ గెలుచుకుంది. ‘నేమ్‌సేక్‌’తో మరింత పేరొచ్చింది. ఉన్నట్టుండి తన నలభై ఐదేళ్ల వయసులో ఇటాలియన్ లో రాయాలని నిర్ణయించుకుంది. కొత్త భాషలో రాయడంలో ఒక స్వేచ్ఛ ఉంది అంటారామె. ‘పర్ఫెక్టుగా ఉండనక్కరలేని స్వేచ్ఛ’. న్యూయార్క్‌లో కొన్ని ఇటాలియన్  పాఠాలు విన్న అనుభవం ఉంది.

కానీ ఆ భాష కోసమే 2015లో ఆమె కుటుంబంతో సహా రోమ్‌కు వెళ్లి, కొన్నేళ్లు ఉండివచ్చింది. తర్వాత మూడు పుస్తకాలు ఇటాలియన్ లో వెలువరించింది. తర్వాత అవి ఆంగ్లంలోకి వచ్చాయి. సహజంగానే ఇటాలియన్ లో రాయడమేంటని చాలామందే ఆమెను ప్రశ్నించారు. ఒక్కొక్క పదం, వాక్యం ద్వారా వ్యక్తీకరణను కూడగట్టుకొని కొత్త లోకపు ద్వారంలోకి ప్రవేశించినట్టుగా అనుభూతి చెందానంటుంది. పాత, కొత్త ప్రపంచాల మధ్య అదొక సవాలు కూడా! ‘ఇటాలియన్  భాష నా జీవితాన్నేమీ మార్చలేదు; అది నాకు రెండో జీవితాన్ని ఇచ్చింది; మరో అదనపు జీవితం’.

తన అసంబద్ధ రచన ‘వెయిటింగ్‌ ఫర్‌ గోడో’ ద్వారా ఖ్యాతినొందిన శామ్యూల్‌ బెకెట్‌ పుట్టుకతో ఐరిష్‌వాడు అయినప్పటికీ ఫ్రెంచ్‌ను తన రచనాభాషగా ఎంచుకున్నాడు. దానికి ఆయన చెప్పిన కారణాలు సాధారణంగా రచయితలు కోరుకునే లక్షణాలకు పూర్తి విరుద్ధమైనవి. తన మాతృభాషకు దూరం కావడం అనేది, ఒక ముసుగును చించుకోవడంతో సమానంగా చూశాడు. ఫ్రెంచ్‌లో (పరాయి భాష) మాత్రమే ఒక శైలి లేకుండా రాయడం సాధ్యమవుతుందన్నాడు. అలాగైతేనే తనకు తగిన వనరులు లేకుండా పోతాయన్నాడు. అందువల్లేనేమో, ఆయన ప్రసిద్ధ ‘మినిమలిస్ట్‌’ రచయిత కాగలిగాడు.

వేర్వేరు కారణాల వల్ల తమ మాతృభాషలకు దూరమైన రచయితలు ఎందరో ఉన్నారు. పరిస్థితులు వారికి అలాంటి పరీక్ష పెట్టాయి. ఆ వేదన ఇక్కడ అప్రస్తుతం. కానీ భాష అనేదాన్ని ఒక అవరోధంగా పెట్టుకుని రాయాలనుకోవడం దానికదే ఒక సవాలు. ప్రాణవాయువును మరీ ఎక్కువగా పీల్చకుండా పొదుపుగా వాడుకుంటూ బతికే యోగసాధన లాంటిది అది.  

>
మరిన్ని వార్తలు