బాకీ పడ్డ కథలు

5 Jun, 2022 23:50 IST|Sakshi

మహా కథకుడు ప్రేమ్‌చంద్‌ రాసిన ‘సావాసేర్‌ ఘెవ్‌’ అనే కథ ఉంటుంది.  అందులో దయాళువు అయిన ఒక రైతు ఆ రాత్రి తన ఇంట బస చేసిన సాధువుకు జొన్నరొట్టెలు పెట్టలేక షావుకారు దగ్గర ‘సేరుంబావు’ గోధుములు అప్పు తెచ్చి, ఆతిథ్యం ఇచ్చి, ఆ సంగతి మర్చిపోతాడు. సేరుంబావు గోధుములు! ఏం పెద్ద భాగ్యమని. ఆ తర్వాత ఆ రైతు ఎన్నోసార్లు గోధుమ పండించి ఉంటాడు. ఎందరికో గోధుమలు దానం చేసి ఉంటాడు. కాని సేరుంబావు గోధుములు అప్పు ఇచ్చిన షావుకారు మాత్రం తన అప్పు మర్చిపోడు. చాలాఏళ్ల తర్వాత ఆ గోధుమలకు వెలగట్టి, వడ్డీ వేసి, చక్రవడ్డీ వేసి రైతు ముందు పద్దు పెడతాడు. ‘ఎగ్గొట్టాలంటే ఎగ్గొట్టు. కాని పైలోకాల్లో ఉన్న దేవతలకు నువ్వు చేసిన బాకీ ఎగవేతకు సమాధానం చెప్పాలి’ అంటాడు. ధర్మభీతి కలిగిన రైతు పై లోకాల్లో ఉన్న దేవతల దగ్గర ముఖం చెల్లడానికి తన పొలం పుట్ర పశువు అన్నీ ఆ సేరుంబావు గోధుమల అప్పుకు దఖలు పరిచి ఆ షావుకారు పొలంలోనే కూలీగా మారతాడు.

సత్యం శంకరమంచి ‘అమరావతి కథలు’లో కూడా ఒక కథ ఉంది. రంగయ్య అనే రైతు తండ్రి 200 రూపాయలు అప్పు చేసి దానిని చెల్లించే బాధ్యత కొడుక్కు అప్పజెప్పి కన్నుమూస్తాడు. కొడుకు ప్రతి సంవత్సరం పంట పండించడం, మూడొంతులు బాకీకి జమ చేయడం... ఒక వంతు తినడం. కానీ 20 ఏళ్లు ఇలా చేసినా అప్పు తీరదు. షావుకారు ఒకరోజు ఆ రంగయ్యకు మిగిలిన జత ఎద్దులను కూడా తెచ్చి పెరట్లో కట్టుకుంటాడు. రగిలిపోయిన రంగయ్య కొడవలి పట్టి షావుకారు గొంతు కోస్తానని నిలబడతాడు. అప్పుడు షావుకారు ‘ఒరే... నువ్వు నరకాలంటే నరుకు. కాని పితృరుణం చాలా పవిత్రమైనది. దానికి అపచారం చేయాలనుకుంటే నీ ఇష్టం’ అంటాడు. రంగయ్య తండ్రిని తలుచుకుని కన్నీరు మున్నీరు అవుతాడు. పరలోకంలో ఉన్న తండ్రి ఆత్మ శాంతించడానికి మూడో ఎద్దుగా చాకిరీ చేసి బాకీ చెల్లించడానికి నిష్క్రమిస్తాడు.

కథగా మొదట వచ్చి తర్వాత సినిమాగా తెరకెక్కి గొప్పగా నిలిచించి ‘దో బిఘా జమీన్‌’. అందులో పేద రైతు బల్‌రాజ్‌ సహానీ షావుకారు దగ్గర చేసిన అప్పు 65 రూపాయలు మాత్రమే. ఫ్యాక్టరీ కట్టుకుంటాను బాకీకి బదులుగా నీ పొలం ఇవ్వు  అనంటే మట్టి మీద మమకారంతో పొలం తప్ప పుడకా పుల్లా అన్నీ అమ్మి షావుకారు దగ్గరకు వెళితే బాకీని 235 రూపాయలుగా తేలుస్తాడు. బాకీనా? పొలమా? బల్‌రాజ్‌ సహానీ నగరానికి వస్తాడు. నానా బాధలు పడతాడు. చివరకు బాకీ చెల్లించలేకపోతాడు. క్లయిమాక్స్‌లో ఊరికి తిరిగి వచ్చి తన పొలంలో కడుతున్న ఫ్యాక్టరీని చూసి కనీసం గుప్పెడు మట్టిని తీసుకుందామనుకున్నా కాపలామనిషి అదిలింపుతో తీసుకోలేకపోతాడు.

ఒక చక్రవర్తికి శిరస్సున ఉన్న కిరీటం సర్వశక్తిమంతమైనదిగా అనిపించవచ్చు. కాని ఈ జగాన ఎదుటివానికి అప్పిచ్చే స్థితి కలిగి ఉండటమే అసలైన, సర్వవ్యాపితమైన, ధార్మిక బలిమిగల, చట్ట సమర్థత ఉన్న, న్యాయమూర్తుల తీర్పులు పొందగల ప్రచండ శక్తి. ఎదుటివాడి దురదృష్టాన్ని పెట్టుబడిగా చేసుకునేదే అప్పు. 2500 ఏళ్ల క్రితమే మనిషి– నీకు పశువులు, విత్తనాలు, పొలము ఇస్తాను... బాగుపడి బదులుగా నాకు వాటి మీద 20 శాతం అధికమొత్తం ఇవ్వు అని చెప్పడం మొదలుపెట్టాడు. వరదలు వచ్చినా, కరువు వచ్చినా, అగ్నిప్రమాదాలు సంభవించినా, మహమ్మా రులు పెట్రేగినప్పుడు, ఇంటి పెద్ద అకాల మృత్యువు సంభవించినప్పుడు ఈ ‘అప్పు ఇచ్చువాడు’ ఎదిగి, ఎదిగి, ఎదిగి చెమట చుక్క చిందించకుండా శ్రీమంతుడవడం నేర్చాడు. చెల్లించలేనంత అప్పు ఇవ్వడం ద్వారా దేశాలను నెత్తురు చుక్క చిందించనవసరం లేని యుద్ధంతో జయిస్తున్నాడు. 

మోసంతో ఎగ్గొట్టే వాళ్ల సంగతి పక్కనపెడదాం. పిల్ల పెళ్లి అని, అబ్బాయి చదువు అని, భార్య అనారోగ్యమని, వ్యాపారంలో నష్టం అని, హఠాత్తుగా ఉద్యోగం పోయిందని, ఎవరో దగా చేశారని అప్పు చేసి, తప్పక తిరిగిద్దామన్న ఉద్దేశంతో ఉండి, చెల్లించలేక సతమతమయ్యవారితో, ఏది ఉన్నా లేకపోయినా ‘పరువు’ అనే బరువుతో బతుకుదామనుకునేవాళ్లతో, కొద్దిపాటి చిల్లర అప్పుకు కూడా బెంబేలెత్తిపోయేవాళ్లతో ‘తెలిసినవారు’, ‘బంధువులు’, ‘స్నేహితులు’, ‘వడ్డీ వ్యాపారులు’ అయిన అప్పిచ్చినవారి వైఖరి ఏమిటి? మీరు ఇచ్చింది అప్పే. వారు చెల్లించవలసిందీ అప్పే. జీవితం కాదు.

ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆ భర్త చక్కగా నవ్వుతాడు. భార్య అతని కోసం ఆదివారం చికెన్‌ వండుతుంది. ఇద్దరు పిల్లలు సాయంత్రం తండ్రి ఇంటికి రాగానే నాన్నా అని కావలించుకుంటారు. అందరూ కలిసి టీవీలో ఏదో సినిమా చూస్తారు. వారు ఉన్నారని వృద్ధ తల్లిదండ్రులు బతుకుతుంటారు. వారు ఉన్నారని తోబుట్టువులు బతుకుతుంటారు. వారు ఉన్నారని ఆప్తులతో కూడిన ప్రపంచమే ఉంటుంది. కాని కేవలం పది వేల రూపాయల అప్పు చెల్లించలేక ఆ భర్త, ఆ భార్య, ఇద్దరు చిన్నారులు చెరువులో దూకి మరణిస్తే ఎలా ఉంటుంది? ఆ ప్రాణాలు ఎలాంటి వడ్డీతో సమానం. ఆ సమూహిక మరణంలో అసలు, వడ్డీ పోనూ ఈ అమానుష సమాజం పడిన రుణం ఎంత?  హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఈ విషాదానికి బాధ్యులు ఎవరు? 
‘క్షమ’ మనిషిని ఉన్నతీకరిస్తుంది. ఎదుటివారి తప్పులనే కాదు అప్పులను కూడా క్షమించగలిగే సందర్భాలలో క్షమించగలగడమే మనిషి గొప్పతనం. 
‘ఇస్తావా? చస్తావా?’ అనకండి. 
చచ్చే రోజులే ఉన్నాయి ఈ దౌర్భాగ్య కాలంలో.  

మరిన్ని వార్తలు