620 కిలోల గంజాయి స్వాధీనం

5 Jun, 2022 23:43 IST|Sakshi
గంజాయి నిందితులతో ముంచంగిపుట్టు ఎస్‌ఐ సంతోష్, పోలీసులు 

మోతుగూడెం/ముంచంగిపుట్ట: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రెండు మండలాల్లో  620 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోతుగూడెం పంచాయతీ పరిధిలోని గొడ్డలగూడెం జంక్షన్‌ వద్ద శనివారం వాహనాలు తనిఖీ చేసినట్టు ఎస్‌ఐ వి.సత్తిబాబు తెలిపారు. ఆ సమయంలో   సుకుమామిడి నుంచి వరంగల్‌కు కారులో తరలిస్తున్న 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

ఈ కేసులో మంగంపాడుకు చెందిన బట్టా వెంకటరెడ్డి, మల్కన్‌గిరికి చెందిన జయసింగ్‌హంతల్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలోఉన్నట్టు చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏస్పీ సతీష్‌కుమార్‌కు వచ్చిన సమాచారంతో అడిషనల్‌ ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ఆదేశాల మేరకు సీఐ అప్పలనాయుడు పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 15లక్షలు ఉంటుందన్నారు. నిందితుల నుంచి ఒక మోటార్‌ బైక్, రెండు సెల్‌పోన్‌లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 

ముంచంగిపుట్టు మండలంలో.. 
రెండు కార్లలో తరలిస్తున్న 120 కిలోల గంజాయిని  బంగారుమెట్ట జంక్షన్‌ వద్ద పట్టుకుని, ఐదుగురు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు ముంచంగిపుట్టు  ఎస్‌ఐ ఆర్‌.సంతోష్‌ తెలిపారు.  మండలంలోని  బంగారుమెట్ట పంచాయతీ కేంద్రంలో శుక్రవారం రాత్రి   తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు.   తనిఖీ చేస్తున్న విషయాన్ని ముందే గ్రహించిన ఆ దారిలో గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు.. కార్లు,గంజాయి,బైక్‌ను వదిలి పరారయ్యేందుకు  ప్రయత్నంచినట్టు తెలిపారు.

ఈ విషయాన్ని  పసిగట్టి    చాకచక్యంగా వ్యవహరించి ఐదుగురిని పట్టుకున్నామని,  మరో ముగ్గురు పరారయ్యారయ్యారని ఎస్‌ఐ చెప్పారు. నిందితుల నుంచి గంజాయి, రెండు కార్లు, బైకును స్వాధీనం చేసుకున్నామని,పట్టుబడిన గంజాయి  విలువ రూ.2,40,000 ఉంటుందని తెలిపారు.

పట్టుబడినవారిలో ముంచంగిపుట్టు మండల కేంద్రానికి చెందిన జె.సురేష్‌కుమార్, ఇదే మండలం ఏనుగురాయి పంచాయతీ కొండపాడ గ్రామానికి చెందిన కె.గిరిబాబు,పెదబయలు మండలం జమిగూడ గ్రామానికి చెందిన కె.భాస్కరరావు, ఒడిశా రాష్ట్రం కోరాపుట్టు జిల్లా నందపూర్‌ బ్లాక్‌  పత్తాలంగి గ్రామానికి చెందిన కె.రామమూర్తి,బుడ్డింగి గ్రామానికి చెందిన బి.కృష్ణ  ఉన్నారని,   పరారైన ముగ్గురి కోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.

మరిన్ని వార్తలు