ఏమా మంత్ర మహిమ?

19 Jun, 2021 03:51 IST|Sakshi

‘సత్య నాదెళ్ల’ సమకాలీన ఐటీ జగత్తులో, ముఖ్యంగా కెరీర్‌ దృక్పథం గల ఆశావహ యువతరానికి రెండు పదాల మంత్ర స్మరణ! వృత్తిలో ఎదుగుతున్న యువకులకైతే, ఆ పేరు తలచుకుంటేనే ఒళ్లు ఒకింత గగుర్పాటు కలిగే ప్రేరణ! భారత దేశం నుంచి వెళ్లి అమెరికన్‌ ఆయిన సత్య, దాదాపు అన్ని వయసుల వారికీ నిలువెత్తు స్ఫూర్తి. దిగ్గజ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా ఉంటూనే ఇప్పుడు చైర్మన్‌ స్థాయికి ఎదగడంతో ఆయన పేరు మళ్లీ ప్రపంచమంతా మార్మోగుతోంది. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్‌ గేట్స్‌ తర్వాత, కంపెనీలో కీలకమైన ఈ జోడు పదవులు చేపడుతున్నది సత్యనే! భారతదేశానికి చెందిన ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు సుమారు పదిలక్షల మంది వరకు అమెరికాలో ఉంటారనేది అంచనా! కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి కాగానే అమెరికా వెళ్లాలని, ఉన్నత చదువులు చదివి వీలయితే అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి, క్రమంగా పైకెదగాలనీ కలలు కంటుంటారు. ఇవేం కొత్త కాదు! వాటికి ‘డాలర్‌ డ్రీమ్స్‌’ అనే ముద్దు పేరూ ఉంది. కొందరి కలలు కల్లలవుతున్నా, నిజం చేసుకునే వారి సంఖ్య ఈ మధ్య పెరిగింది. అవకాశాల్లాగే, ఎదుగుదలకు ఎదురవుతున్న సవాళ్లు కూడా ఇటీవల అదే స్థాయిలో పెరిగాయి. పేరున్న పెద్ద విశ్వవిద్యాలయాలతో పాటు సాధారణ యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ సీట్లు దక్కించుకోవడం, డిగ్రీలు పొందడం భారతీయ యువతకు పెద్ద కష్టమేం కాదు. కానీ, ఉద్యోగాలకు పోటీ బాగా పెరిగింది. అక్కడి కంపెనీల్లో చేరే క్రమంలో మధ్యవర్తులుగా వ్యవహరించే ‘కన్సల్టెన్సీ ఎజెన్సీ’ ప్రాయోజిత తాత్కాలిక ఉద్యోగ దశ దాటి, పూర్తికాలపు ఉద్యోగం దక్కించుకోవడమే గగనం. ముఖ్యంగా చైనా వంటి ఇతర ఆసియా దేశాల ఔత్సాహిక యువతరమే భారతీయులకు పెద్ద పోటీ! ఇక కంపెనీల పైస్థాయి ఉద్యోగాల్లోకి ఎదగడం ఇంకా కష్టం. అయినప్పటికి, గత దశాబ్ద కాలంలో భారత దేశానికి, భారత సంతతికి చెందిన మెరికల్లాంటి వారు బహుళజాతి ఐటీ, ఇతర అనుబంధ కంపెనీలకు అధిపతులుగా ఎదుగుతున్న తీరు ప్రపంచాన్నే విస్మయ పరచింది. తెలివితేటలతో పాటు నిబద్దత, క్రమశిక్షణ, కష్టపడే తత్వమే వారి గెలుపు రహస్యం. ఆ క్రమంలో, ఏడేళ్ల కిందట మైక్రోసాఫ్ట్‌కి సత్య సీఈవో కావడమే విశేషమంటే, ఇప్పుడు చైర్మన్‌ కూడా కావడం పెద్ద ముందడుగు. 143 బిలియన్‌ డాలర్ల వార్షిక రాబడి. 2 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విస్తరణ కలిగిన మైక్రోసాఫ్ట్, ఆపిల్‌ తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ.

చరిత్ర సృష్టించడమే గొప్ప అంటే, చరిత్రను తిరగరాయడం కొందరికే సాధ్యం. దాదాపు మూడు దశాబ్దాల కింద మైక్రోసాఫ్ట్‌లో చేరి మొదలెట్టిన ప్రయాణంతో సత్య చేసిందదే! దశాబ్దాల తరబడి భారతీయ ఇంజనీర్లు అమెరికా చేరి డిజైన్, డెవలప్‌మెంట్‌ వంటి పాత్రలకే పరిమిత మయ్యారు. అక్కడక్కడ ఒకరిద్దరి మెరుపులు మినహా... చాలా కాలం జరిగిందదే! సత్య నాదెళ్ల (ఎమ్మెస్‌), సుందుర్‌ పిచ్చయ్య (గూగుల్‌–ఆల్ఫబెట్‌), అజయ్‌పాల్‌ సింగ్‌ భంగ (మాస్టర్‌కార్డ్‌), శంతను నారాయణ్‌ (అడోబ్‌) వంటి వారు చరిత్రను తిరగ రాశారు. మారే పరిస్థితుల్ని బట్టి, మార్కెట్‌ అవసరాల్ని గుర్తెరిగి అసాధారణ ప్రజ్ఞాపాటవాలు చూపించడం ద్వారా అంచెలంచెలు ఎదిగారు. ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలను పైస్థాయికి తీసుకువెళ్లారు. సీఈవోలయ్యారు. కొందరు చైర్మన్‌లు కూడా అయి, జోడుపదవుల్లో ఉన్నారు. భారతదేశం బయట కేంద్ర కార్యక్షేత్రం ఉన్న సుమారు 60 (వందకోట్ల డాలర్ల పైబడి మార్కెట్‌ విస్తరణ గల) అంతర్జాతీయ ఐటీ, అనుబంధ కంపెనీలకు భారతీయ, భారత సంతతి నిపుణులే నేతృత్వం వహిస్తున్నారు. నికేష్‌ అరోరా (పాలో ఆల్టో నెట్వర్క్‌), అర్వింద్‌ కృష్ణ (ఐబీఎం), వివేక్‌ శంకరన్‌ (ఆల్బెర్ట్‌సన్స్‌), వసంత్‌ నర్సింహ (నోవర్టిస్‌), ప్రేమ్‌ వత్స (ఫెయిర్‌ఫాక్స్‌), సంజయ్‌ మెహంత్ర (మైక్రాన్‌ టెక్‌), లక్ష్మీ నర్సింహన్‌ (ఆర్బీ), సోనియా సింజల్‌ (జీఏపీ), థామస్‌ కురియన్‌ (గూగుల్‌ క్లౌడ్‌), జార్జి కురియన్‌ (నెట్‌ యాప్‌), సందీప్‌ మెత్రానీ (వీవర్క్‌) లాంటి వాళ్లు ఆయా కంపెనీలకు నేతృత్వం వహిస్తూ భారత జయ పతాకాన్ని ఐటీ, మార్కెట్‌ విశ్వవీధుల్లో రెపరెపలాడిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా కలిగిన భారతదేశ యువతరం సత్య నాదెళ్ల నుంచి ఎంతో నేర్చుకోవాలి. నిరాడంబరం, నిగర్విగా ఉండే సత్య సదా నగుమోముతో విజయానికే ఓ ప్రతీకలా కనిపిస్తారు. మాట తీరులోనూ వినయం–పరిపక్వత పోటీ పడతాయి. తన పని పట్ల, తమ సేవల్ని వాడుకునే వినియోగదారుల పట్ల, పెట్టుబడి భాగస్వాములైన షేర్‌ హోల్డర్ల పట్ల ఆయనకు అవ్యాజమైన నిబద్ధత, ప్రేమ. తాను సీఈవోగా బాధ్యత చేపట్టేనాటికి ఇబ్బందుల్లో ఉన్న కంపెనీ ప్రాధాన్యతలను మార్చి క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో శిఖరస్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఆయనది. ఉద్యోగుల పట్ల ప్రేమను రంగరించి, పని సంస్కృతినే మార్చివేశారు. అందుకు తాజా సర్వే ఫలితాలే నిదర్శనం. పోల్‌డాటా ప్రకారం 95 శాతం మంది, ‘మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులమైనందుకు గర్విస్తున్నామ’న్నారు. ‘బోర్డుకు సత్య ఎజెండా ఏర్పరుస్తారు. తన లోతైన అనుభవంతో.. కంపెనీ ఎదుగుదల అవకాశాలు వెతికి, వ్యూహాలు ఖరారు చేయడమే కాక సమస్యల్ని పరిష్కరించే మార్గాలు చూపుతారు’ అని నియామక సమయంలో కంపెనీ చేసిన ప్రకటనే ఆయన ప్రతిభకు నిదర్శనం. అదీ సత్య నాదెళ్ల! 

మరిన్ని వార్తలు