బీసీ ‘కమలం’!

15 Oct, 2023 05:02 IST|Sakshi

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే నాటికి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మూడో స్థానంలో ఉన్నది. కర్ణాటక ఎన్నికలకు ముందు కొంతకాలంపాటు అది రెండో స్థానంలో ఉన్న భావన కనిపించింది. రాష్ట్రంలో ఉన్న బలమైన పునాది కారణంగా కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక ఉత్తేజంతో వేగంగా కోలుకొని, బీజేపీని వెనక్కు నెట్టి, రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇంకొన్ని ఇతర కారణాలు కూడా ఈ పరిణామానికి దోహదపడి ఉండవచ్చు.

ఇప్పుడున్న వరసక్రమం – బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇదే క్రమం కొనసాగుతుందా? కచ్చితంగా చెప్పడం కష్టం. వరస మారడానికి అవకాశాలు పుష్కలం. గడచిన కొన్నేళ్లుగా బీజేపీ సృష్టిస్తున్న రాజకీయ సంచలనాలను గమనంలోకి తీసుకుంటే ఆ పార్టీ మన అంచనాలను తలకిందులు చేయగల అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయ లేము. ఇంతకుముందు రెండుసార్లు (1998, 2019) జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇరవై శాతం ఓట్లను తెలంగాణలో సాధించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీ పూర్తిగా చతికిలబడుతూ వస్తున్నది.

ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచీ కూడా మన దగ్గర ముఖాముఖి పోటీలకే ప్రాధాన్యత లభించడం చూస్తున్నాం. 1978లో రెడ్డి కాంగ్రెస్, 2009లో ప్రజా రాజ్యం బలంగా ముందుకొచ్చినా ఇరవై శాతం ఓట్లను దక్కించుకోలేదు. ఒక్క టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత మాత్రమే ఈ ప్రాంతంలో మూడో పక్షానికి ఆదరణ లభించడం మొదలైంది.

గత రాజకీయ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించిన బీజేపీ నాయకత్వం, ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నప్పటికీ పోలింగ్‌ నాటికి బలంగా ముందుకు రాగల అవకాశాలున్నాయని గుర్తించింది. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా రెండుమార్లు ఇరవై శాతానికి పైగా ఓట్లు సాధించిన అనుభవాన్ని బట్టి, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించే ఛాన్స్‌ ఉన్నట్టయితే అంతకంటే ఎక్కువ ఓట్లు రాబట్టడం కష్టం కాదని ఆ పార్టీ అంచనా వేస్తున్నది.

ప్రస్తుతం నెలకొన్న ముక్కోణ పోటీ పరిస్థితుల్లో తమ మూడో కోణాన్ని బీసీ కోణంగా మలచడం ద్వారా సంచలనం సృష్టించాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టు సమాచారం. అధికార బీఆర్‌ఎస్‌కు వందమందికి పైగా సిటింగ్‌ ఎమ్మెల్యేలున్న కారణంగా టిక్కెట్ల పంపిణీలో ప్రయోగాలు చేసే అవకాశం దానికి లేకుండా పోయింది.

కాంగ్రెస్‌కు ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నది. 34 మంది బీసీలకు టిక్కెట్లు ఇవ్వబోతున్నట్టు కూడా ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కానీ ఇప్పుడు వెలువడుతున్న సూచనలను బట్టి ఆ పార్టీ మాట నిలబెట్టుకునే అవకాశాలు దాదాపుగా లేవని తెలుస్తున్నది. టిక్కెట్లు ఇవ్వక పోగా బీసీ నాయకుల పట్ల కాంగ్రెస్‌ నాయకత్వం ఈసడింపు ధోరణితో వ్యవహరిస్తున్నదనే వార్తలు గుప్పుమంటున్నాయి.

కొద్దిరోజుల క్రితం రేణుకా చౌదరి నేతృత్వంలో కమ్మవారి ప్రతినిధుల బృందం కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కలవడానికి వెళ్లింది. ఆగమేఘాల మీద వారికి పార్టీ అగ్రనేతల అపాయింట్‌మెంట్లు లభించాయి. సుమారు 40 నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేసే శక్తి తమ వర్గానికి ఉన్నదనీ, కనీసం పది సీట్లయినా తమకు కేటాయించాలని కోరారట! ఆరు స్థానాల వరకు కేటాయించడానికి అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేసినట్టు వార్తలొ చ్చాయి. రెండు శాతం జనాభా గల బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ఆరు సీట్లు ఆఫర్‌ చేసిన అధిష్ఠానం 54 శాతం జనాభా గల తమకెంత రాచమర్యాదలు చేస్తుందోనని ఊహించుకుని బీసీ నేతలు కొందరు ఢిల్లీ బాట పట్టారు.

వారం రోజులపాటు ఢిల్లీ ఫుట్‌పాత్‌ల మీద కాలక్షేపం చేయడం తప్ప వీరికి అగ్రనేతల దర్శనభాగ్యం మాత్రం లభించలేదు. నానా తంటాలు పడి కాళ్లావేళ్ళా పడ్డ మీదట కేసీ వేణుగోపాల్‌ అనే ప్రధాన కార్యదర్శి ఓ పది నిమిషాలు టైమిచ్చాడట! ఇద్దరు మాజీ ఎంపీలు, ఇతర కీలక బాధ్యతలు వెలగబెట్టిన ప్రముఖ బీసీ నేతలు ఈ బృందంలో ఉన్నారు. ఈ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఏమాత్రం ఇవ్వకుండానే వేణుగోపాల్‌ విరుచుకు పడ్డాడని సమాచారం. ‘మీకు టిక్కెట్లిస్తే గెలవరు.

మీలో పెద్దపెద్ద నాయ కులకు సైతం డిపాజిట్లు రావు. పార్టీ గెలవాలని ఉందా? లేదా? గెలవాలనుకుంటే సర్దుకుపొండి’ అంటూ విసుక్కున్నాడట! పొన్నాల లక్ష్మయ్యను సస్పెండ్‌ చేసి పారేస్తానని కూడా వేణుగోపాల్‌ హెచ్చరించాడట! అదృష్టవశాత్తు ఈ బృందంలో పొన్నాల లేడు. బృంద సభ్యులు అవమాన భారంతో తలలు వంచుకొని వెనుదిరగడం తప్ప మాట్లాడే అవకాశం మాత్రం లభించలేదు.

45 సంవత్సరాల కాంగ్రెస్‌ పార్టీ అనుబంధాన్ని నిన్న పొన్నాల తెంచే సుకున్నారు. అవమాన భారంతో గుండె మండిపోయిన తర్వాతనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుని అపాయింట్‌ మెంట్‌ కోసం ఏడాది పాటు ప్రయత్నించినా పొన్నాలకు చేదు అనుభవమే మిగిలిందని ఆయన అనుచరులు వాపోయారు.

ఢిల్లీలో పది రోజుల పాటు కాళ్లరిగేలా తిరిగినా పొన్నాలకు ఏ నాయకుడి అపాయింట్‌మెంటూ దొరకలేదు. అమెరికాలో ఉన్నతో ద్యోగం చేస్తూ 1980లోనే ఇండియా వచ్చి కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తి పొన్నాల. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, పన్నెండేళ్లు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌కు మొట్ట మొదటి అధ్యక్షుడు. అటువంటి వ్యక్తికి జరిగిన సత్కారాన్ని చూసి పార్టీలోని బీసీ నేతలు ఖిన్నులవుతున్నారు.కాంగ్రెస్‌ పార్టీలోని యువ నాయకులకు ఫోన్లు చేసి మరీ ‘ఈ పార్టీలో బీసీలకు భవిష్యత్తు లేదు. బీజేపీలోకో, బీఆర్‌ఎస్‌లోకో వెళ్లండ’ని సీనియర్‌ బీసీ నేతలు సలహా ఇస్తున్నారు.

ఈ రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవా లని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చింది. 54 శాతం జనాభా ఉన్న బీసీ బాణాన్ని తన ప్రధానాస్త్రంగా ప్రయోగించేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతున్నది. దేశానికి మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని అందించిన పార్టీ తమదేనని ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ సంస్థాగత పదవుల్లో బీసీలకు ప్రాధాన్యతను ఇవ్వడం ప్రారంభించింది. బీసీ వర్గానికి చెందిన డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ గతంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా పనిచేయడమే గాక ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఓబీసీ మోర్చాకు అధ్యక్షునిగా పనిచేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నిక చేయించి పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా నియమించారు. దేశవ్యాప్తంగా పదమూడు మంది మాత్రమే ఉండే ఈ బోర్డులో స్థానం దక్కడం ఒక అరుదైన గౌరవం. మొన్నటివరకూ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన బండి సంజయ్‌ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈటల రాజేందర్‌కు ప్రధానమైన ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ పదవి లభించింది. ఈటల ఆధ్వర్యంలో జరిగిన ముదిరాజ్‌ ఆత్మగౌరవ సభ విజయం సాధించడంతో బీజేపీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ ఎన్నికల్లో బీసీ అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది.

పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఆరేడు స్థానాల్లో బీజేపీ సులభంగా గెలవగలుగుతుంది. అంటే అక్కడ పార్టీ మొదటి స్థానంలో ఉన్నట్టు లెక్క. మరో పదిహేను నుంచి ఇరవై స్థానాల్లో రెండో స్థానంలో ఉన్నట్టు ఆ పార్టీ భావిస్తున్నది. నాలుగు నుంచి ఎనిమిది శాతం వరకు అదనపు ఓట్లను పొందగలిగితే ఈ రెండో స్థానం సీట్లను గెలవగలుగుతుంది. ఎకాయెకిన అన్ని ఓట్లను అదనంగా సంపాదించే మార్గం బీసీ మంత్రమేనన్న అభిప్రాయంతో బీజేపీ వ్యూహం రూపొంది స్తున్నట్టు తెలుస్తున్నది.

వ్యూహం ఫలిస్తే బీజేపీ ఖాతాలో పాతిక సీట్లు పడతాయి. పాతిక సీట్లు గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన గేమ్‌ తన చేతిలోనే ఉంటుందని దాని అంచనా. మెజారిటీ స్థానాల్లో పార్టీ మూడో స్థానంలోనే ఉన్నందువల్ల ప్రయోగాలు చేయడానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. బలంగా ఉన్న 25 సీట్లతోపాటు మిగిలిన అన్‌రిజర్వ్‌డు సీట్లతో కలిపి నలభై స్థానాలకు పైగా బీసీలకు కేటాయించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు భోగట్టా.

మొట్టమొదటిసారిగా ఒక బీసీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలిలో ఎన్నడూ లేనివిధంగా 27 మంత్రి పదవులూ, పార్టీ పరంగా సంస్థా గత పదవులతోపాటు ఎక్కువ ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించిన పార్టీగా ప్రచారం చేసుకుని బీసీ ఓటర్లలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. తెలంగాణలో జనసంఖ్య పరంగా వరసగా ముదిరాజ్‌ – గంగపుత్ర, యాదవ – కురుమ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి, రజక, వడ్డెర బలమైన కులాలు.

ముదిరాజ్, మున్నూరు కాపు వర్గాల్లో బీజేపీకి ఇప్పటికే బలమైన నాయకత్వం, పలుకుబడి ఉన్నాయి. ఎమ్మెల్యే టిక్కెట్లను అధికంగా కేటాయించడం ద్వారా మిగిలిన కులాల్లో ప్రాబల్యం సంపాదించడానికి ఆ పార్టీ ప్రయత్నించవచ్చు. యాదవ కులానికి చెందిన డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లును అత్యంత ప్రాధాన్యత కలిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

సాధారణంగా సామాజిక వర్గాలను ఆకర్షించడానికి రెండు మూడు నెలల ముందు చేసే ప్రయత్నాలు ఫలించవు. కానీ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహార శైలిని అనుకూలంగా మలచు కోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. పొన్నాల రాజీనామాపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించిన తీరు బీసీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండు శాతం జనాభా గల అగ్రవర్ణానికి అడిగిందే తడవుగా అగ్రనేతల అపాయింట్‌మెంట్‌ లభించడం, బీసీ వర్గాల్లో దశాబ్దాల అనుభవం గల నాయకులకు కూడా దర్శనం దొరక్క పోవడంపై విస్తృతంగా చర్చ జరుగు తున్నది. ఈ చర్చ ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. 

వర్ధెల్లి మురళి    
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు