మొదటికొచ్చిన ‘డేటా’ బిల్లు

6 Aug, 2022 00:23 IST|Sakshi

పార్లమెంటు కారిడార్‌లో దాదాపు దశాబ్దకాలంగా వినబడుతున్న డేటా పరిరక్షణ బిల్లు వ్యవహారం మొదటికొచ్చింది. పాతికేళ్లుగా భౌగోళిక సరిహద్దులకు అతీతంగా సమాచార ప్రవాహం నిరంతరం దేశంలోకి వస్తూ పోతూ ఉంది. పౌరుల భద్రతకూ, వారి వ్యక్తిగత గోప్యతకూ కలిగే ముప్పు గురిం చిన భయాందోళనలు అడపాదడపా వ్యక్తమవుతూనే ఉన్నాయి. అవి కేవలం భయాందోళనలు కాదు, చేదు నిజాలని రుజువవుతూనే ఉన్నాయి.

గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటివి ఎందుకో, ఏమిటో చెప్పకుండా కోట్లాదిమంది ఖాతాదార్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని రాబడు తున్నాయి. అలా సేకరించిన సమాచారాన్ని ఫేస్‌బుక్‌ సంస్థ 2015లో కేంబ్రిడ్జి ఎనలిటికా(సీఏ) సంస్థకు చడీచప్పుడూ లేకుండా అమ్ముకున్న సంగతి తెలియంది కాదు. కానీ మనకు డేటా పరిరక్షణ కోసం ఇంతవరకూ చట్టం లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ బిల్లు తెస్తామని చెప్పారు. ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోకుండానే ఆధార్‌ పేరుతో దేశ పౌరుల డేటా సేకరణ మొదలు పెట్టారు. గోప్యతను పౌరుల ప్రాథమిక హక్కుగా సర్వోన్నత న్యాయస్థానం గుర్తించి, అందుకోసం చట్టం అవసరమని సూచించి ఈ నెల 24కు అయిదేళ్లవుతోంది. అయినా చట్టం సాధ్యపడలేదు.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఏడాదిపాటు అనేకమంది నిపుణులనూ, సంస్థలనూ సంప్రదించి, విదేశాల్లో అమలవుతున్న చట్టాలను అధ్య యనం చేసి ముసాయిదా బిల్లు సమర్పించి నాలుగేళ్లు కావస్తోంది. అనంతరం 2019 డిసెంబర్‌లో కేంద్రం పార్లమెంటులో బిల్లుకూడా ప్రవేశపెట్టింది. తీరా మూడేళ్లు గడిచాక ఇప్పుడు ఆ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ పార్లమెంటులో ప్రకటించారు.  

చెప్పాలంటే డేటా పరిరక్షణ బిల్లుపై విస్తృతమైన చర్చ జరిగింది. ఎన్‌డీఏ ప్రభుత్వం తన సహజ ధోరణికి భిన్నంగా ఈ బిల్లు గురించి ఉభయ సభల్లో వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేసీపీ)కి ఇవ్వడానికి అంగీకరించింది. ఆ కమిటీ గత రెండేళ్లుగా క్షుణ్ణంగా చర్చించి బిల్లుకు 81 సవరణలు సూచించింది. అరడజను సిఫార్సులు చేసింది. ఫలితంగా బిల్లు పరిధి పూర్తిగా మారిపోయింది. వ్యక్తిగత డేటా పరిరక్షణ కాస్తా విస్తృత డేటా పరిరక్షణగా మారింది. సైబర్‌ ప్రపంచంలో ప్రవహించే డేటాను వ్యక్తిగత, వ్యక్తిగతేతర సమా చారంగా వర్గీకరించారు.

స్మార్ట్‌ ఫోన్‌లలో ‘విశ్వసనీయమైన’ హార్డ్‌వేర్‌ను మాత్రమే వాడాలన్న నిబంధన, సామాజిక మాధ్యమ సంస్థల నియంత్రణకు సంబంధించిన నిబంధనలు, మధ్యవర్తులుగా వ్యవహరించని సామాజిక మీడియా సంస్థల్లో వచ్చే వార్తలకూ, వ్యాఖ్యలకూ ఆ సంస్థలను బాధ్యత వహించేలా చేయడం వంటివి సిఫార్సుల్లో ఉన్నాయి. వీటిలో కొన్నిటికి కొత్తగా తీసుకురాబోయే బిల్లులో చోటిచ్చే అవకాశం ఉంది. అలాగే ఎప్పటికప్పుడు వచ్చిపడే డేటాను నిక్షిప్తం చేయడం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాల్సివుంది. ఈ దేశంలో రూపొందే సమస్త డేటానూ ఇక్కడి సర్వర్లలోనే సామాజిక మాధ్యమ సంస్థలు భద్రపరచాలని ప్రభుత్వం మొదట్లో చెప్పినా వ్యక్తుల సున్నిత సమాచారాన్ని, కీలక సమాచారాన్ని ఇక్కడ సర్వర్లలోనే ఉంచాలని పాత బిల్లు నిర్దేశించింది.

ఇప్పుడు దాన్ని సవరించి భారత ప్రభుత్వం విశ్వసించే మరేదైనా ప్రాంతంలో కూడా ఈ సర్వర్లు ఉండొచ్చని, నేరాలు జరిగినప్పుడు ప్రభుత్వం కోరిన సమాచారాన్ని అందజేస్తే సరిపోతుందని నిబంధన విధించవచ్చంటున్నారు. ఎవరికైనా క్షణంలో అందుబాటులోకొచ్చే సైబర్‌ ప్రపంచంలో వ్యక్తిగత డేటా పరిరక్షణ కత్తి మీద సాము వంటిదే. పౌరుల గోప్యతకు సామాజిక మాధ్యమాల వల్ల మాత్రమే కాదు... ప్రభుత్వాల నుంచి సైతం ముప్పువాటిల్లితే పౌరులకుండే ఉపశమనం ఏమిటన్నది కూడా బిల్లు చెప్పగలగాలి.

పౌరుల ప్రాథమిక హక్కుతో ముడిపడి ఉండే డేటా పరిరక్షణ వంటి అంశాల్లో పాలకులు ఉదారంగా ఉంటారనుకోవడం అత్యాశ. వ్యక్తుల డేటాపై ఏదోమేర ఆధిపత్యం, నియంత్రణ సాధించేందుకు వారు ప్రయత్నిస్తారు. 2019 నాటి బిల్లు వాలకాన్ని గమనించిన జస్టిస్‌ శ్రీకృష్ణ ‘నా ముసాయిదాకూ, బిల్లుకూ పోలికే లేద’ని వ్యాఖ్యానించిన సంగతీ, ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం డేటాపై సమస్త అధికారాలనూ దఖలు పరుచుకుందని చెప్పడమూ ఎవరూ మరిచిపోరు. డేటా పరిరక్షణ అథారిటీ(డీపీఏ) చైర్‌పర్సన్‌ ఎంపిక కోసం ఏర్పాటయ్యే కమిటీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నామినేట్‌ చేసే న్యాయమూర్తి ఆధ్వర్యం వహించాలన్న నిబంధనకు కూడా మంగళం పాడారు.

వీటన్నిటికీ మించి అసలు గత మూడేళ్లలో సైబర్‌ ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ–కామర్స్, డిజిటల్‌ మార్కెట్, డిజిటల్‌ సర్వీసులు వగైరావెన్నో వచ్చాయి. పాత బిల్లు వీటిలో చాలా అంశాలను స్పృశించలేదు. వీటన్నిటికీ ఒక్క చట్టంలో చోటీయడం అసాధ్యమేకాక, అనవసరం కూడా. అందుకోసం యూరప్‌ దేశాల మాదిరిగా విడివిడి చట్టాలు అవసరం. లేనట్టయితే అయోమయం నెలకొంటుంది. ఎటూ కొత్తగా బిల్లు తెస్తున్నారు గనుక పౌరుల వ్యక్తిగత గోప్యత విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు స్ఫూర్తికి అనుగుణంగా దాన్ని రూపొందించాలని కేంద్రం గుర్తించడం అవసరం. చట్టం దుర్వినియోగం కాకుండా, అస్పష్టతకు చోటీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సైబర్‌ ప్రపంచం పౌరులకు సురక్షిత ప్రదేశంగా మారుతుంది. 

మరిన్ని వార్తలు