PM Shinzo Abe: చెరగని ముద్ర వేసిన షింజో అబే

9 Jul, 2022 00:17 IST|Sakshi

నేరగాళ్లు రెచ్చిపోవడం, ఎక్కడో ఒకచోట తుపాకులు పేలడం, పౌరులు ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణంగా మారిన వర్తమానంలో కూడా జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యో దంతం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. జపాన్‌లో హింసాత్మక ఘటనల శాతం తక్కువ. తుపాకుల వినియోగం దాదాపు శూన్యం. అటువంటి ఉదంతాలు ఏడాదికి పది కూడా ఉండవు. ఇటు చూస్తే షింజో అబే వివాదాస్పద వ్యక్తి కాదు. పైపెచ్చు జపాన్‌ ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న కష్టకాలంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి దాన్ని గట్టెక్కించిన చరిత్ర ఆయనది. అందువల్లే 2012 నుంచి ఎనిమిదేళ్లపాటు అధికారంలో కొనసాగారు. రెండేళ్ల క్రితం ఆరోగ్యం సహకరించక పదవి నుంచి తప్పుకున్నారుగానీ ఆ సమయానికి కూడా ఆయన తిరుగులేని నేతగానే ఉన్నారు. 

పాలకులు తీసుకునే నిర్ణయాలన్నీ అందరినీ మెప్పించాలని లేదు. వాటివల్ల ఇబ్బందులకు గురయ్యే వర్గాలు కూడా ఉంటాయి. కానీ మెజారిటీ ప్రజల సంక్షేమానికీ, శ్రేయస్సుకూ ఏది మంచి దన్నదే అంతిమంగా గీటురాయి అవుతుంది. అబేను పొట్టనబెట్టుకున్న దుండగుడు ఎందుకంత దారుణానికి ఒడిగట్టాడన్నది మున్ముందు తెలుస్తుంది. కానీ అబే ఆర్థిక విధానాలు 2012 నాటికి నీరసించి ఉన్న జపాన్‌కు జవసత్వాలు ఇచ్చాయనడంలో సందేహం లేదు. ఒకప్పుడు అతి సంపన్న దేశంగా వెలుగులీని, ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న జపాన్‌ 80వ దశకం మధ్యనుంచి వెలవెలబోవడం మొదలైంది.

ఆ స్థానాన్ని చూస్తుండగానే గతంలో తన వలస దేశమైన చైనా ఆక్రమించింది. ఇది జపాన్‌ను కుంగదీసింది. రాజకీయ రంగంలో అస్థిరత చోటుచేసుకుంది. అస్థిర ప్రభుత్వాలు ఒకపక్క, ప్రకృతి వైపరీత్యాలు మరోపక్క దాన్ని పట్టి పీడించాయి. సహజంగానే ఇవన్నీ నేరాలు పెరగడానికి దోహదపడ్డాయి. అలాంటి సమయంలో అబే అధికార పగ్గాలు స్వీక రించి ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. ఆ విధానాలు ‘అబేనామిక్స్‌’ పేరిట ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి. ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు పడినా త్వరలోనే వాటివల్ల మెరుగైన ఫలితాలొచ్చాయి. జపాన్‌ పుంజుకుంది.

ప్రారంభంలో జాతీయవాదిగా, స్వేచ్ఛా విపణికి తీవ్ర వ్యతిరేకిగా ఉన్న అ»ే  తన వైఖరిని మార్చుకున్నారు. 2012కు ముందు విశాల పసిఫిక్‌ భాగస్వామ్య ఒప్పందం (టీపీపీ) జపాన్‌ ప్రయోజనాలు దెబ్బతీస్తుందని వాదించిన ఆయనే, అధికారంలోకొచ్చాక దాన్ని నెత్తికెత్తుకున్నారు. ట్రంప్‌ ఏలుబడిలో ఆ ఒప్పందం నుంచి అమెరికా బయటికొచ్చినా 2018లో వేరే దేశాలను కలుపుకొని దాన్ని మరింత విస్తరించారు. సంస్కరణలపై ఎంత మొగ్గు చూపినప్పటికీ అన్నిటినీ ప్రైవేటుపరం చేయాలన్న స్వేచ్ఛా మార్కెట్‌ ఉదారవాది కాదాయన. ప్రభుత్వ రంగ సంస్థల పాత్రను ఏమాత్రం తగ్గించలేదు. దేశానికొక కొత్త రాజ్యాంగం కావాలనీ, సైనికంగా బలపడాలనీ ఆయన కలలుగన్నారు. కరోనా అవాంతరం లేకపోతే అది కూడా జరిగేదే.

అమెరికా, కొన్ని యూరప్‌ దేశాల మాదిరిగా వలసలపై ఆంక్షలు విధించడం కాక, వాటిని ప్రోత్సహించారు. పర్యవసానంగా లక్షలాదిమంది విదేశీ నిపుణులకు ఉద్యోగావకాశాలు లభించాయి. మన దేశానికి మంచి మిత్రుడిగా మెలిగారు. చైనాతో మనకు సమస్యలు వచ్చినప్పుడు గట్టిగా సమర్థించారు. బహుశా కరోనా విరుచుకుపడకపోతే ఆయన ఆర్థిక విధానాలు మరింత మెరుగైన ఫలితాలు తీసుకొచ్చేవేమో! కానీ కరోనా సమయంలో కఠినమైన లాక్‌డౌన్‌లు అమలు చేయడం వల్ల చాలామంది ఉపాధి కోల్పో యారు. ప్రకటించిన ఉద్దీపన పథకాలు ప్రజలకు పెద్దగా తోడ్పడలేదు. దాంతో ఆయనపట్ల వ్యతి రేకత మొదలైంది. ఒకపక్క అనారోగ్యం, మరోపక్క ఆర్థిక వ్యవస్థలో ఒడుదొడుకులు ఆయన్ను కుంగదీసి చివరకు పదవినుంచి వైదొలగారు.

జపాన్‌లో హింసాత్మక ఉదంతాలు లేనేలేవని చెప్పలేం. కానీ ఒక రాజకీయ నాయకుడిపై దాడి జరగడం చాలా అరుదు. 1960లో సోషలిస్టు నాయకుడు ఇనెజిరో అసానుమోపై ఒక దుండగుడు కత్తితో దాడి చేశాడు. 2007లో నాగసాకి నగర మేయర్‌ను కాల్చిచంపారు. ఆ తర్వాత ఈ స్థాయి ఘటన జరగడం ఇదే ప్రథమం. ఆ దేశంలో సాయుధ బృందాల ఉనికి లేకపోలేదు. అయితే కరుడు గట్టిన యకుజా ముఠా సైతం తుపాకుల వినియోగం విషయంలో జంకుతుంది. తుపాకుల అమ్మ కంపై కఠిన ఆంక్షలు, వాటిని వినియోగించేవారికి కఠిన శిక్షల అమలు ఇందుకు కారణం. హింసా త్మక ఘటనలు అరుదు గనుక నేతలు భద్రత గురించి పెద్దగా పట్టించుకోరు. ఎన్నికల ప్రచార మంతా వీధి సభల ద్వారానే సాగుతుంది.

నిజానికి దాడి జరిగే సమయానికి అలాంటి చిన్న సభ లోనే అబే మాట్లాడుతున్నారు. 1986లో అప్పటి స్వీడన్‌ ప్రధాని ఓలోఫ్‌ పామే నడుచుకుంటూ వెళ్తుండగా దుండగుడు ఆయన్ను నడి బజారులో కాల్చిచంపాడు. ఆ తర్వాత ప్రపంచాన్ని తీవ్రంగా దిగ్భ్రాంతిపరిచిన ఘటన అబే హత్యోదంతమే. సంక్షోభాలకు ఏ దేశమూ అతీతం కాని వర్తమాన పరిస్థితుల్లో హింసకు ఏ ప్రాంతమూ మినహాయింపు కాదు. పైగా సంఘటిత నేర బృందాలకు బదులు ఎవరితోనూ సంబంధాలు లేనట్టు కనబడే వ్యక్తులే హింసకు దిగుతున్న ఉదంతాలు అమె రికా వంటిచోట్ల ఎక్కువయ్యాయి. కనుక నిరంతర అప్రమత్తత, నేతలకు తగిన భద్రత కల్పించడం తప్పనిసరి. వర్తమాన ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన నేతల్లో ఒకరిగా, భారత్‌కు చిరకాల మిత్రునిగా ఉన్న అబే ఒక దుండగుడి కాల్పుల్లో కనుమరుగు కావడం అత్యంత విచారకరం. 

మరిన్ని వార్తలు