అధ్వానంగా విద్యా వ్యవస్థ

5 Sep, 2021 01:38 IST|Sakshi

ఆర్థికాభివృద్ధిలో ముందంజ.. చదువులో అట్టడుగున 

రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో పాఠశాల విద్య  

సత్వరమే ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలి 

సోషల్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం కన్వీనర్‌ ఆకునూరి మురళి డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అత్యంత అధ్వాన్నంగా తయారైందని సోషల్‌ డెమొక్రటిక్‌ ఫోరం కన్వీనర్, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్య తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఫోరం ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.

నీతి ఆయోగ్‌ 2020–21 నివేదిక ప్రకారం, ఆర్థికాభివృద్ధిలో తొలి 5 స్థానాల్లో ఉన్న తెలంగాణ.. నాణ్యమైన విద్యలో 10 స్థానం, ఆరోగ్య సూచికల్లో 18వ స్థానం, మహిళా సాధికారతలో 23వ స్థానం, పేదరిక నిర్మూలనలో 15వ స్థానం, ఆకలి నిర్మూలన, ఆహార భద్రత, పోషకాహారం లభ్యతలో 17వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికేడాది రాష్ట్ర ఆర్థిక వనరులు పెరుగుతుండగా, విద్యకు బడ్జెట్‌లో కేటాయింపులు గణనీయంగా తగ్గిస్తున్నారన్నారు.

2014–15లో రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 10.89 శాతం నిధులు కేటాయించగా, 2021–22 నాటికి 5.89 శాతానికి తగ్గించారని తప్పుబట్టారు. ఇప్పటికైనా సమీక్ష జరిపి పరిస్థితులను సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాసమస్యలపై గతంలో మేధావులు మాట్లాడేవారని, ప్రస్తుతం రాష్ట్రంలో మాట్లాడేవారు కరువయ్యారనే డెవలప్‌మెంట్‌ ఫోరం పురుడు పోసుకుందని మురళి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఫోరం కో–కన్వీనర్లు వెంకట్‌రెడ్డి, డాక్టర్‌ రమ, ఎంఎఫ్‌ గోపీనాథ్, ఝాన్సీ గడ్డం, ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ, సూరెపల్లి సుజాత, దస్రం నాయక్, సభ్యులు శంకర్, వీరస్వామి తదితరులు మాట్లాడారు.

సర్కారుకు ఫోరం సూచనలు... 
ఉపాధ్యాయులు, ఎంఈఓ పోస్టుల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి 
పాఠశాలల్లో టాయిలెట్లు, స్వచ్ఛమైన తాగునీరు, ఫ్యాన్, ట్యూబ్‌లైట్, గ్రీన్‌ బోర్డుతో సహా చదువుకునే వాతావరణం ఉన్న తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి 
రూ.2వేల కోట్ల గ్రాంట్‌ను స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలకు తక్షణమే విడుదల చేయాలి 
పాఠశాలలను పునః ప్రారంభిస్తున్నందున డ్రాప్‌ అవుట్స్‌ లేకుండా దృష్టి పెట్టాలి.  
బడ్జెట్‌లో 20 శాతం నిధులను విద్యకు కేటాయించాలి.

మరిన్ని వార్తలు