చింతలపూడి ఎత్తిపోతలకు మంచి రోజులు

28 Mar, 2023 00:38 IST|Sakshi

ఈ పథకానికి బడ్జెల్లో రూ.279 కోట్లు కేటాయింపు

వేగవంతమవనున్న కాలువ తవ్వకం

కరోనాతో మూడేళ్లుగా మందగించిన పనులు

4.80 లక్షల ఎకరాలకు సాగునీరు

చింతలపూడి : చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో రూ.279 కోట్లు కేటాయించింది. దీంతో కాలువ తవ్వకం పనులు వేగం పుంజుకోనున్నాయి. 2020 ఫిబ్రవరి నెలలో నాబార్డు నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.1,931 కోట్ల రుణం మంజూరయింది. రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేయాలని భావించిన ప్రభుత్వానికి కరోనా వైరస్‌ వల్ల గత రెండు, మూడేళ్లుగా పనులు ముందుకు సాగలేదు. పథకం ప్రాథమిక అంచనా రూ.1,701 కోట్లు కాగా, సవరించిన అంచనాల ప్రకారం రూ.4,909.80 కోట్లకు పెరిగింది.

వైఎస్‌ కలల ప్రాజెక్ట్‌

చింతలపూడి ఎత్తిపోతల పథకం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు. 2003లో పాదయాత్ర సమయంలో జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు సాగు నీటికోసం పడే ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. అధికారంలోకి వస్తే మెట్టకు గోదావరి జలాలను మళ్లించి సాగునీరు అందిస్తానని రైతులకు వైఎస్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 2008 అక్టోబరు 30వ తేదీన కామవరపుకోటలో వైఎస్‌ స్వయంగా శంకుస్థాపన చేశారు. ఉరుకులు, పరుగులు పెట్టిన ఈ పథకం పనులకు వైఎస్‌ అకాల మరణంతో గ్రహణం పట్టింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల రైతులకు సాగునీరు, ప్రజలకు తాగు నీరు అందించేందుకు పట్టుదలతో ఉన్నారు. ఏలూరు పార్లమెంట్‌ సభ్యులు కోటగిరి శ్రీధర్‌బాబు, చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ప్రాజెక్టు పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఇటీవల అసెంబ్లీలోనూ ఎమ్మెల్యే ఎలీజా ప్రాజెక్టు పరిస్థితిని వివరించారు.

4.80 లక్షల ఎకరాలకు సాగు నీరు

కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 మెట్ట ప్రాంత మండలాల్లో 2.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం గుడ్డిగూడెం ఎత్తిపోతల పథకాన్ని విస్తరించి చింతలపూడి పథకానికి అనుసందానం చేశారు. తద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా మరో రూ.3,200 కోట్లు కేటాయించారు. 53.50 టీఎంసీల గోదావరి నీటిని వాడుకునేలా కాలువల సామర్థ్యాన్ని పెంచనున్నారు. గోదావరి నీటిని ప్రధాన కాలువ నుంచి కృష్ణా జిల్లా వేంపాడు కాలువకు గోదావరి నీటిని మళ్లిస్తారు. ఇందుకోసం రెండు జిల్లాల సరిహద్దులో చీపిరిగూడెం వద్ద తమ్మిలేరు కాలువపై చేపట్టిన అక్విడెక్ట్‌ నిర్మాణం పూర్తి కావచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా యర్రగుంటపల్లి వద్ద నుంచి కృష్ణా జిల్లా చాట్రాయి మండలం వేంపాడు కాలువ పొడవు 14 కిలోమీటర్లు. ఇప్పటి వరకు 2.5 కిలో మీటర్ల తవ్వకం పనులు పూర్తి చేశారు. రైతుల నష్ట పరిహారంలో తలెత్తిన వివాదంతో రైతులు కాలువ తవ్వకం పనులను అడ్డుకున్నారు. నష్టపరిహారం సమస్య పరిష్కరించి కాలువ తవ్వుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మెట్ట ప్రాంతంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ తవ్వకం పనులు

చీపిరిగూడెం సమీపంలో తమ్మిలేరుపై పూర్తికావచ్చిన భారీ అక్విడెక్ట్‌ నిర్మాణం

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

ప్రాజెక్టు పనులకు బడ్జెట్‌లో రూ.279 కోట్లు మంజూరు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. కరోనా కారణంగా పనులు నిలిపి వేయడం వల్ల ఆలశ్యమైంది.థీ పథకాన్ని పూర్తి చేసి సాగునీరు, తాగునీరు అందించేందుకు కట్టుబడి ఉన్నాం.

– ఉన్నమట్ల ఎలీజా, ఎమ్మెల్యే, చింతలపూడి

మరిన్ని వార్తలు