నువ్వంటే ప్రాణం ప్రియాంక.. లెటర్‌ రాసి భర్త బలవన్మరణం

5 Sep, 2023 13:35 IST|Sakshi

ఏలూరు: భార్యాభర్తల మధ్య వివాదాలు ఒక మనిషి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భార్య తరఫు బంధువులు, పోలీసుల వేధింపులు భరించలేక మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి, బంధువులు ఆరోపించారు. దెందులూరు గ్రామానికి చెందిన చెక్క రామ్‌ప్రసాద్‌ కుమారుడు చెక్క తేజ మూర్తి (26) సోమవారం తెల్లవారుజామున దెందులూరులో రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.

అతని వద్ద సూసైడ్‌ నోట్‌ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తేజమూర్తి తల్లి ధర్మ రత్నమాల, పెదనాన్నలు మానేపల్లి ఉదయ్‌భాస్కర్‌, మానేపల్లి మురళీ, బావమరిది చలంచెర్ల సత్యకిషోర్‌ సోమవారం మధ్యాహ్నం దెందులూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు ఆరోపణలు చేశారు.

మూడు నెలల క్రితం ఏలూరుకు చెందిన ప్రియాంకతో తేజమూర్తికి వివాహం జరిగిందని, వారిద్దరూ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత నెల 26న ప్రియాంక ఏలూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో భర్త తేజమూర్తిపై ఫిర్యాదు చేసింది. పెద్దలు మాట్లాడినా, నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ప్రియాంక అంగీకరించలేదని తెలిపారు. విచారణ పేరుతో సీఐ రాజశేఖర్‌ వేధించారని ఆరోపించారు.

కేసు పరిష్కారానికి నెల గడువు ఇవ్వమని అడిగినా తమ మాట వినలేదని వాపోయారు. ఈ మానసిక ఒత్తిడితోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తేజ తల్లి, బంధువులు ఆరోపించారు. సూసైడ్‌ నోట్‌లో నిన్ను ప్రేమించానని.. జరగనిది జరిగినటు్‌ల్‌ నిందలు వేయడాన్ని తట్టుకోలేకపోతున్నానని భార్యనుద్దేశించి తేజమూర్తి పేర్కొన్నాడు. తన మృతికి ప్రియాంక తండ్రి తవ్వ సత్యనారాయణ, అక్క సౌజన్య, మావయ్య సురేష్‌ కారణమని రాశాడు. తనకు తగిన న్యాయం చేసే వరకు పోరాడాలని బంధువులను కోరాడు. తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు.

ఈ సంఘటనలో తేజ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. తేజమూర్తి మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి పంపించారు. కేసును రైల్వే ఎస్సై డీ.నర్సింహరావు దర్యాప్తు చేస్తున్నారు.

దర్యాప్తు చేస్తున్నాం
ఏలూరు టౌన్‌:
తేజ మూర్తి ఆత్మహత్య ఘటనలో వన్‌టౌన్‌ సీఐపై ఆరోపణలు వచ్చాయని.. వాస్తవాలపై శాఖాపరమైన విచారణ చేస్తున్నామని, అసత్య ప్రచారాలు చేయవద్దని ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాసులు తెలిపారు. తేజమూర్తి భార్య ఫిర్యాదు మేరకు సీఐ ఇరు పక్షాల కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారని తెలిపారు. సూసైడ్‌ నోట్‌లో మృతుడు సీఐ తనను వేధించినట్లు చెప్పలేదన్నారు. చట్టం మేరకే సీఐ విచారణ చేశారని, బాధితులకు న్యాయం చేస్తామన్నారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు