ఆయిల్‌పామ్‌లో అంతర పంటగా మినుము | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌లో అంతర పంటగా మినుము

Published Sun, Nov 12 2023 1:52 AM

మెట్ట ఉప్పరగూడెంలో ఆయిల్‌ పామ్‌లో అంతర పంటగా వేసిన మినుము  - Sakshi

తాడేపల్లిగూడెం రూరల్‌ : అంతర పంటల సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. దీర్ఘకాలిక పంటల్లో స్వల్ప కాలిక రకాలైన మినుము, పుచ్చ, కూరగాయలు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం సైతం ప్రోత్సాహం ఇవ్వడంతో రైతులు మరింతగా ముందుకొస్తున్నారు. దీనిలో భాగంగా మండలంలోని మెట్ట ఉప్పరగూడెం, కృష్ణాపురం, కడియద్ద గ్రామాల్లో ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటగా మినుము, పుచ్చ సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వీరంపాలెం, పట్టెంపాలెం, కొమ్ముగూడెం, నీలాద్రిపురం, కృష్ణాపురం, పుల్లాయగూడెం, ఎల్‌.అగ్రహారం, అప్పారావుపేట, మాధవరం, వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట, కడియద్ద తదితర గ్రామాల్లో ఆరుతడి పంటగా మినుము సాగు చేస్తున్నారు. ఈ రెండు విధానాల ద్వారా ఆయిల్‌ పామ్‌ పంటతో పాటు అదనంగా మినుము, పుచ్చ వంటి పంటల ద్వారా అదనపు ఆదాయం లభిస్తోంది. ప్రధానంగా ఈ మండలంలో బోర్లపై సాగు అధికం కావడంతో ఖరీఫ్‌ సీజన్‌ పూర్తి కాగానే మినుము పంటను చేపట్టారు. ఇప్పటికే నెల రోజుల సమయం కావడంతో పంట ఏపుగా ఎదిగింది. నవంబరు నెలాఖరు నాటికి పంట చేతికి వస్తుంది.

ముందస్తు సాగుతో అదనపు ఆదాయం

వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు ముందస్తు సాగు చేపట్టడంలో ఏడాదికి మూడు పంటలు పండించే అవకాశం కలుగుతోంది. ప్రధానంగా కౌలు రైతులకు మూడో పంట కొంత ఆదాయాన్ని అందిస్తోంది. ప్రస్తుతం మూడో పంటగా మినుము సాగు చేయడంలో ఈ పంట సొమ్ములు రైతుకు మిగిలే అవకాశం ఉంది. మినుము విత్తనం, ఎరువులు, పురుగుమందులకు ఎకరానికి దాదాపు రూ.10 వేలు అవుతుంది. ఎకరానికి ఏడు నుంచి తొమ్మిది బస్తాల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో వాతావరణం అనుకూలించడంతో పంట కూడా బాగుండడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని రైతులు భావిస్తున్నారు.

క్వింటాలుకు రూ.7,100 మద్దతు ధర

రాష్ట్ర ప్రభుత్వం మినుముకు క్వింటాలుకు రూ.7,100 మద్దతు ధర ప్రకటించింది. గత ఏడాది రూ.6,400 ధర పలికింది. గత ఏడాదితో పోల్చుకుంటే మరో రూ.700 అదనంగా మద్దతు ధర లభిస్తోంది. పెట్టుబడి ఖర్చులు, ఇతరత్ర ఖర్చులు రూ.20 వేలు పోను ఎకరానికి దాదాపు రూ.40 వేల వరకు ఆదాయం రావచ్చు.

మూడో పంట లాభదాయకం

రైతులు ముందుస్తు సాగు చేపట్టడం ద్వారా మూడో పంటకు అనుకూలంగా ఉంటుంది. ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వరి ధాన్యం విక్రయించగా వచ్చిన సొమ్ములతో పంట పెట్టుబడి, అప్పులు తీరగా, మూడో పంట ఆదాయం కౌలు రైతులకు మేలు చేస్తుంది. ఇది ముందస్తు సాగు ద్వారానే సాధ్యం. ప్రతి రైతు ఖరీఫ్‌ సీజన్‌ను ముందుగా ప్రారంభించడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల నుంచి గట్టెక్కడంతో పాటు మూడో పంటకు అనువుగా ఉంటుంది.

– ఆర్‌ఎస్‌.ప్రసాద్‌, ఏఓ, తాడేపల్లిగూడెం

ఎకరానికి తొమ్మిది బస్తాల వరకూ దిగుబడి

అంతర పంటల సాగుపై రైతుల్లో ఆసక్తి

1/2

2/2

Advertisement
Advertisement