34 లక్షల ఎకరాలపై పేదలకు హక్కులు

18 Nov, 2023 03:53 IST|Sakshi

నా ఎస్సీ.. నా ఎస్టీ.. నా బీసీ.. నా మైనార్టీ పదాలకు అర్థం చెబుతూ..

చరిత్రను తిరగరాస్తూ సామాజిక భూ హక్కులు..

నూజివీడు బహిరంగ సభలో సీఎం జగన్‌

దశాబ్దాల అనుభవదారులను చట్టబద్ధంగా హక్కుదారులను చేశాం

ఇది చరిత్రలో గొప్పగా నిలిచిపోయే రోజు..

42,307 మందికి కొత్తగా 46,463.82 ఎకరాల డీకేటీ పట్టాల పంపిణీ

1,563 గ్రామాల్లో దళితుల శ్మశాన వాటికలకు 951 ఎకరాలు

2.6 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు

వందేళ్ల తరువాత మన ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వే

ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు వేల గ్రామాల్లో 42.60 లక్షల ఎకరాల సర్వే పూర్తి

సాక్షి ప్రతినిధి, ఏలూరు: దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై పేదలకు సర్వ హక్కులు కల్పింస్తోంది మీ బిడ్డ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పేదలు, రైతుల గుండె చప్పుడు విన్నది కాబట్టే మనందరి ప్రభుత్వం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వారికి భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ మనస్ఫూర్తిగా మంచి చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,44,866 ఎకరాలకు సంబంధించి 20,24,709 మంది పేదలకు హక్కులు కల్పించి ఆ భూములను మీ బిడ్డ ప్రభుత్వం వారి చేతుల్లో పెడుతోందన్నారు. 

మనందరి ప్రభుత్వంలో సామాజిక న్యాయమన్నది ఒక నినాదంగా కాకుండా ఒక విధానంగా అమలు చేస్తున్నామని చెప్పారు. పేద వర్గాలను అక్కున చేర్చుకుని సామాజిక, ఆర్థిక న్యాయం చేయగలిగామన్నారు. ప్రతి పేదవాడు కాలర్‌ ఎగరవేసి అదిగో మా అన్న ప్రభుత్వం.. మా ప్రభుత్వం.. మా కోసం ఆలోచన చేసేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పుకునే విధంగా పాలన సాగిందని చెప్పేందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాల భూమిని 42,307 మందికి కొత్తగా డీకేటీ పట్టాలు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 

దశాబ్దాలుగా అనుభవదారులుగా ఉన్న పేద రైతులకు అసైన్డ్‌ భూములపై హక్కులు కల్పించడంతోపాటు చుక్కల భూముల సమస్యకు సైతం పరిష్కారాన్ని చూపామన్నారు. దళితుల శ్మశాన వాటికల కోసం 1,563 గ్రామాల్లో 951 ఎకరాలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2003 నాటి అసైన్డ్‌ భూములపై హక్కులు, కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తూ పేదలకు వెన్నుదన్నుగా నిలుస్తుంటే పెత్తందారులకు నచ్చడం లేదని మండిపడ్డారు. పేద వర్గాల పట్ల బాధ్యతగా, చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే ప్రతిపక్షం కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. 

రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ, అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు, లంక భూములకు పట్టాలు, చుక్కల భూములు, షరతు గల పట్టా భూములు, సర్వీస్‌ ఈనాం భూములు 22 (ఏ) నుంచి తొలగింపు, భూమి కొనుగోలు పథకం ద్వారా అందించిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. భూములకు సంబంధించి కేవలం 53 నెలల వ్యవధిలో తీసుకున్న తొమ్మిది రకాల విప్లవాత్మక నిర్ణయాలతో పేదలు, రైతన్నలకు చేకూర్చిన మేలును వివరిస్తూ ఆయా అంశాలను సీఎం జగన్‌ ప్రస్తావించారు. 

నిర్ణయం1
దేశంలో వందేళ్ల తరువాత మన ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రెండు దశల్లో నాలుగు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే విజయవంతంగా పూర్తి చేశాం. మొత్తంగా 42.60 లక్షల ఎకరాల్లో రీసర్వే పూర్తై యజమానులకు భూ హక్కు పత్రాలను కూడా అందజేశాం. దాదాపు 45 వేల సరిహద్దు వివాదాలను పరిష్కరించి రికార్డులను అప్‌డేట్‌ చేశాం. 15 వేల మంది సర్వేయర్లు రైతులకు మంచి చేసే విషయంలో నిమగ్నమయ్యారు. రీసర్వే పూర్తి  అయిన చోటగ్రామ సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్లు జరుగుతున్నది మీ బిడ్డ ప్రభుత్వ హయాంలోనే. మూడో విడత కూడా మొదలు పెడుతున్నాం.  

నిర్ణయం2
15.41 లక్షల మంది పేద రైతులకు మంచి అసైన్‌మెంట్‌ చేసి 20 ఏళ్లు గడిచిన భూములపై లబ్ధిదారులకు సర్వహక్కులు కలి్పంచే కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వ హయాంలోనే జరుగుతోంది. దీనివల్ల 27.42 లక్షల ఎకరాలపై సంపూర్ణ హక్కులను కల్పించగా 15.41 లక్షల మంది పేద రైతులకు మంచి జరుగుతోంది. పేద సామాజిక వర్గాలకు మంచి జరిగే గొప్ప కార్యక్రమం ఇది. 

పెత్తందారీ పోకడలపై పేదల ప్రభుత్వం, మీ బిడ్డ సాధించిన గొప్ప విజయంగా ఇది చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది. భూములను గుంజుకునే పరిస్థితుల నుంచి అసైన్డ్‌ భూములపై పూర్తి హక్కులను ఆ పేదవాడికి కలి్పంచే గొప్ప మార్పులకు ముందడుగు పడింది. చంద్రబాబు హయాంలో అసైన్డ్‌ భూములను తన అత్తగారి సొత్తు అన్నట్లుగా ఆక్రమించుకున్నారు.  

నిర్ణయం3
అప్పుడెప్పుడో బ్రిటిష్‌ పాలనలో రీసర్వే అండ్‌ సెటిల్‌మెంట్‌ రిజిస్ట్రార్‌ నమోదు చేసే సమయంలో వివరాలు అందుబాటులో లేని భూములను చుక్కల భూములుగా చూపించారని చంద్రబాబు ప్రభుత్వం 2016లో వీటిని నిషేధిత జాబితాలో 22 (ఏ)లో చేర్చడంతో రైతన్నలు అల్లాడిపోయారు. రైతులు, భూములున్నాయి కానీ హక్కు పత్రాలు మాత్రం లేవు. దీనికి కారణం చంద్రబాబు ఆ భూములను నిషేధిత భూముల్లో చేర్చడమే. దీన్ని సరిదిద్దుతూ 2.6 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి 1.2 లక్షల మంది రైతులకు మంచి చేశాం. ఇది కూడా మీ బిడ్డ పాలనలోనే జరిగింది.  

నిర్ణయం4 
పేదవాడికి భూ హక్కులు కల్పించేందుకు మీ బిడ్డ ప్రభుత్వం ఎంత గొప్పగా అడుగులు వేసిందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. షరతులు గల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. 1934లో రీసర్వే రిజిస్టర్‌ రిమార్క్స్‌ కాలంలో షరతులు గల పట్టాగా నమోదు చేయడంతో ఆ భూమిపై రైతులకు హక్కులు లేని పరిస్థితి నెలకొనగా ఇప్పుడు ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాం. 33,394 ఎకరాలు సాగు చేసుకుంటున్న 22,045 మంది రైతులకు మంచి చేస్తూ సర్వహక్కులు పేదవాడి చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమేనని చెప్పేందుకు గర్వపడుతున్నా.  

నిర్ణయం5 
ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు చేసిన భూములు రుణంలో ఉండటంతో హక్కులు కోల్పోయిన ఎస్సీ రైతుల రుణాలను మాఫీ చేస్తూ వారికి సర్వహక్కులు కలి్పంచింది కూ­డా మన అందరి ప్రభుత్వమే. రాష్ట్ర వ్యాప్తం­గా నిరుపేదలైన 22,346 మంది దళితులకు పంపిణీ చేసిన 22,387 ఎకరాలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా తాకట్టు పెట్టిన ఆ భూములన్నింటినీ 21( ఏ) జాబితా నుంచి తొలగించి రుణాలు మాఫీ చేసి రైతులకు పూర్తి హక్కులు కలి్పంచాం.  

నిర్ణయం6 
ప్రతి పేదవాడికి సాధికారత కలి్పస్తూ చెయ్యి పట్టుకుని తోడుగా నిలిచి నా గిరిజన రైతులకు మంచి జరగాలని అడుగులు వేశాం. ఈ దిశగా పట్టాల పంపిణీ మరో ప్రధానమైన నిర్ణయం. తరతరాలుగా కొండల్లో, అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మన గిరిజన సోదరులకు, గిరిజన అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని తపిస్తూ సాగు హక్కులు కలి్పంచాం. 1,56,655 గిరిజన కుటుంబాలకు మంచి చేస్తూ 3,26,982 ఎకరాలను పంపిణీ చేసింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే.  

నిర్ణయం7
తరతరాలుగా లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు లేకపోవడం వల్ల లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. వారంతా ఏ సహాయం అందని దుస్థితిలో ఉన్నారు. లంక భూములు సాగు చేసుకుంటున్న అలాంటి రైతన్నలను గుర్తించి వారికి డీకేటీ పట్టాలు, లీజు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. లంక  భూముల్లో సాగు చేసుకుంటున్న వారిని ఎంజాయిమెంట్‌ సర్వే ద్వారా నిర్ధారించి ఏ, బీ కేటగిరీలకు డీకేటీ పట్టాలు, సీ కేటగిరికి చెందిన వాటికి లీజు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. 17,768 మంది పేద రైతులకు మంచి జరిగేలా అడుగులు ముందుకు వేసే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టాం.  

నిర్ణయం8 
గతంలో అన్ని గ్రామాల్లో సర్వీస్‌ ఈనాం భూములను నిషేధిత జాబితా కింద  22 (ఏ) కింద చేర్చారు. ఒక్క దేవాలయాలు, ఇతర సంస్థలకు సంబంధించిన ఈనాం భూములు మినహా మిగిలిన అన్ని సరీ్వస్‌ ఈనామ్‌ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశాం. ఆ భూములకు సంబంధించి 1,61,584 మంది రైతులకు మరీ ముఖ్యంగా కుమ్మరి, కమ్మరి, రజకులు, నాయీ బ్రాహ్మణులు తదితర వృత్తుల వారికి మంచి జరిగేలా, వారి సమస్య పరిష్కారమయ్యేలా నిషేధిత జాబితా నుంచి తొలగించి పూర్తి హక్కులు కలి్పస్తున్నాం.  

నిర్ణయం9 
రాష్ట్రవ్యాప్తంగా మరో 42,307 మంది నిరుపేదలకు 46,463 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమానికి ఇక్కడే శ్రీకారం చుడుతున్నాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలకు మంచి జరిగేలా అడుగులు ఇక్కడ నుంచి పడుతున్నాయి. ఇవన్నీ కేవలం 53 నెలల్లోనే భూములకు సంబంధించి చేసిన మంచి పనులు. ప్రతి పేదవాడిని చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం ఎలా చేశామో చెప్పడానికే ఈ తొమ్మిది అంశాలను ప్రస్తావించా.

 

అంతిమ సంస్కారాల్లోనూ అంటరానితనమా?

ప్రతి పేదవాడి గురించి ఆలోచన చేస్తూ ఇవాళ ఇంకో గొప్ప అడుగు పడింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా రాష్ట్రంలో ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో ఎస్సీ వర్గాల వారి అంతిమ సంస్కారాల కోసం అనువైన భూమి లేని పరిస్థితి. తరతరాలుగా అవమానాలు ఎదుర్కొన్న వీరికి చివరికి అంతిమ సంస్కారాల విషయంలోనూ అంటరానితనం పాటించే దుస్థితి ఉంటే మనుషులుగా మనం ఏం ఎదిగినట్లు? అనే ఆలోచన ప్రతి ఒక్కరి మదిలోనూ రావాలి. రాష్ట్రవ్యాప్తంగా 1,854 గ్రామ సచివాలయాల పరిధిలో శ్మశాన వాటికల కోసం 1,250 ఎకరాలు అవసరమని నివేదికలిచ్చారు. వీటిలో 1,563 సచివాలయాల పరిధిలో ఇప్పటికే 951 ఎకరాలను సేకరించి గ్రామ పంచాయతీలకు అప్పగించాం. ఇంత చిన్న విషయాన్ని కూడా నేను పరిశీలించి పర్యవేక్షిస్తున్నా.

మరిన్ని వార్తలు