ఆధునిక చిత్రకళలో ఒకే ఒక్కడు

25 Oct, 2020 09:55 IST|Sakshi

నేడు పికాసో పుట్టినరోజు

పుట్టినప్పుడు కదలకుండా ఉంటే, మృతశిశువు పుట్టాడనుకుని వదిలేసింది నర్సు. బతికే ఉన్నట్లు మేనమామ గుర్తించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. బాల్యంలో అతణ్ణి చూసిన వారెవరూ ఊహించని విధంగా తొంభై ఏళ్లకు పైబడిన నిండు జీవితం గడిపాడు. ఆధునిక చిత్రకళా చరిత్రనే మలుపు తిప్పాడు. అతడే పికాసో! ఆధునిక చిత్రకళలో ఒకే ఒక్కడు. పికాసో ప్రస్థానంలో కొన్ని సంగతులు మీ కోసం...

మాటలు నేర్చుకునే వయసులో పిల్లలెవరైనా ‘అమ్మా’ అనో, ‘నాన్న’ అనో పలకడానికి ప్రయత్నిస్తారు. పికాసో అందరిలాంటి వాడు కాదు. అతడి నోటి నుంచి వెలువడిన తొలి పదం ‘లాపిస్‌’. స్పానిష్‌ భాషలో ‘లాపిస్‌’ అంటే ‘పెన్సిల్‌’ అని అర్థం. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు, నోట మాట పుట్టగానే పరిమళించిన చిత్రకారుడు పికాసో. స్పెయిన్‌లోని మలగా పట్టణంలో 1881 అక్టోబర్‌ 25న పుట్టాడు పికాసో. అందరికీ అతని పేరు పాబ్లో పికాసో అనే తెలుసు. నిజానికి అతని పూర్తి పేరు చాలా పొడవాటిది. ఇరవైమూడు పదాలతో కూడిన అతడి పేరులో సుప్రసిద్ధ మతపెద్దలు, బంధువుల పేర్లన్నీ ఉన్నాయి.

పికాసో తండ్రి డాన్‌ జోస్‌ రూయిజ్‌ బ్లాస్కో కూడా చిత్రకారుడే. ఏడేళ్ల వయసులోనే కొడుకుకు కుంచెప్రాశన చేశాడు. ఇక అప్పటి నుంచి జీవితాంతం రంగులను, కుంచెలను వదల్లేదు పికాసో. తొమ్మిదేళ్ల పసితనంలోనే తొలి కళాఖండం ‘లె పికాడర్‌’ను చిత్రించాడు. పికాసోకు పదమూడేళ్లు రాగానే అతడి తండ్రి కుంచె విరమణ చేసేశాడు. తనకంటే తన కొడుకే బాగా బొమ్మలు గీస్తున్నాడనే నమ్మకం కలగడమే అందుకు కారణం. అదే వయసులో పికాసో ‘స్కూల్‌ ఆఫ్‌ ఫైనార్ట్స్‌’ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌లో వారం రోజుల్లోనే ఉత్తీర్ణత సాధించాడు. ఆ పరీక్షలో నెగ్గాలంటే అప్పట్లో చాలామంది విద్యార్థులకు నెల్లాళ్లకు పైనే పట్టేది. అప్పట్లో అదొక రికార్డు.

పికాసో గీసిన తొలి రూపచిత్రం ‘ఫస్ట్‌ కమ్యూనియన్‌’. దీనిని అతడు తన పదిహేనేళ్ల వయసులో చిత్రించాడు. పికాసో గీసిన వాటిలో ‘గయెర్నికా’ ప్రపంచవ్యాప్తంగాపేరుపొందింది. స్పానిష్‌ సివిల్‌ వార్‌ సమయంలో గయెర్నికా పట్టణంపై నాజీ సేనలు బాంబు దాడి జరిపినప్పుడు, ఆ దాడిలో జరిగిన విధ్వంసానికి చలించిపోయి చిత్రించిన భారీ చిత్రం అది.. పికాసో చిత్రకారుడు, శిల్పిగానే ప్రసిద్ధి పొందినా, అతడు బహుముఖ ప్రజ్ఞశాలి. పికాసో మంచి కవి, రంగస్థల అలంకరణ నిపుణుడు, నాటక రచయిత, సైద్ధాంతికంగా సామ్యవాది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు హిట్లర్‌ నేతృత్వంలోని నాజీ సర్కారు తన చిత్రాలపై నిషేధం విధించినా, ఏమాత్రం తొణకని ధీశాలి. నిండు జీవితం గడిపిన పికాసో, 1973 ఏప్రిల్‌ 8న ఫ్రాన్స్‌లోని మోగిన్స్‌ పట్టణంలో తన తొంభై ఒకటో ఏట కన్నుమూశాడు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు