Asha Suman: ఆత్మవిశ్వాసమే అసలైన గురుదక్షిణ

14 Oct, 2023 00:36 IST|Sakshi

ఆత్మరక్షణ

రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో దివ్యాంగురాలైన ఒక స్టూడెంట్‌ అత్యాచారానికి గురైన సంఘటన ఆశా సుమన్‌ను షాక్‌కు గురి చేసింది. స్కూలు, కాలేజిల్లో చదివే అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పాలని ఆ సమయంలో సంకల్పించుకుంది ఆశ. దివ్యాంగులు, సాధారణ యువతులు 30 వేల మందికి పైగా ఆత్మరక్షణ విద్యలు నేర్పించిన ఉపాధ్యాయురాలు ఆశా సుమన్‌ గురించి...

తొమ్మిది సంవత్సరాల క్రితం రాజస్థాన్‌ అల్వార్‌ జిల్లాలోని ఖార్కర గ్రామంలో... ఆరోజు స్కూల్‌కు వెళ్లింది ఆశా సుమన్‌. బడిలో మగపిల్లలు తప్ప ఆడపిల్లలు ఎవరూ కనిపించలేదు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఈ లోపే ఎవరో ఊళ్లో జరిగిన దుర్ఘటన గురించి చెప్పారు. దివ్యాంగురాలైన ఒక అమ్మాయి సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ సంఘటనతో గ్రామం ఉలిక్కిపడింది.

విషయం తెలిసిన ఆశ హుటాహుటిన బాధితురాలి ఇంటికి వెళ్లింది. ఆ సంఘటనకు సంబంధించిన విషయాలు చెవిన పడుతున్నప్పుడు ఆమె మనసు దుఃఖసముద్రం అయింది.
ఈ సంఘటన ప్రభావంతో కొద్దిమంది తల్లిదండ్రులు అమ్మాయిలను స్కూల్‌కు పంపడం మాన్పించారు. నిజానికి ఆ ప్రాంతంలో ఆడపిల్లల చదువుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. ఇచ్చే వాళ్లు కూడా తమ ఇంటి ఆడపిల్లలను బడికి పంపడానికి భయపడుతున్నారు.

స్కూల్‌కు వెళ్లినా, స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చినా ఆ పాశవిక సంఘటన, తల్లిదండ్రులపై దాని ప్రభావం పడి ఆడపిల్లలు స్కూల్‌కు దూరం కావడం... ఇవి పదేపదే గుర్తుకు వచ్చి ఆశను విపరీతంగా బాధపెట్టాయి.

‘ఆ అమ్మాయికి తనను తాను రక్షించుకోవడం తెలిస్తే ఇలా జరిగేది కాదేమో. ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్య నేర్పాలి’ అనుకుంది. మొదటి అడుగుగా... పిల్లల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడింది. పిల్లలను తిరిగి స్కూల్‌కు పంపించడానికి వారు మొదట్లో ససేమిరా అన్నారు. చదువు అనేది ఎంత అవసరమో వివరించి, అమ్మాయిలు తమను తాము కాపాడుకునే ఆత్మరక్షణ విద్యల గురించి చెప్పి వారిలో మార్పు తీసుకువచ్చింది.

కొన్ని రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి అమ్మాయిలను తన స్కూటర్‌పై స్కూల్‌కు తీసుకువచ్చేది. రెండు నెలల తరువాత పరిస్థితి మామూలుగా మారింది. స్కూల్‌లోని అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించడంతో పాటు గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ గురించి చెప్పేది. ఆశ గురించి విన్న చుట్టుపక్కల ఊళ్లలోని స్కూల్, కాలేజీ వాళ్లు ‘మా స్టూడెంట్స్‌కు కూడా నేర్పించండి’ అంటూ ఆహ్వానిం చారు. కాదనకుండా వారి ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో స్కూళ్లు, కాలేజీలలో ఎంతోమంది అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించింది.

వైకల్యం ఉన్న బాలికలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పే విధానం వేరుగా ఉంటుంది, వారు సులభంగా అర్థం చేసుకునేలా, అర్థం చేసుకున్నది ఆచరణలో చేసేలా రోజువారి సంఘటనలను ఉదాహరిస్తూ, డమ్మీని ఉపయోగిస్తూ నేర్పిస్తుంటుంది. దృష్టిలోపం ఉన్న మౌనిక అనే స్టూడెంట్‌ ఆశ టీచర్‌ దగ్గర సెల్ఫ్‌–డిఫెన్స్‌ టెక్నిక్స్‌ నేర్చుకుంది.

‘నేను బయటికి ఎక్కడికి వెళ్లినా తోడుగా అన్నయ్య వచ్చేవాడు. అన్నయ్య లేకుంటే బయటకు వెళ్లడానికి సాహసించేదాన్ని కాదు. అయితే ఇప్పుడు నా గురించే నేనే కాదు, తల్లిదండ్రులు కూడా భయపడడం లేదు. ఎవరైనా నాకు చెడు చేయడానికి ముందుకు వస్తే నిమిషాల్లో మట్టి కరిపించగలననే నమ్మకం వచ్చింది’ అంటుంది మౌనిక.

స్టూడెంట్స్‌లోనే కాదు వారి తల్లిదండ్రులలోనూ ఇప్పుడు ఎంతో ధైర్యం వచ్చింది. ‘చాలామందిలాగే నేను కూడా మా అమ్మాయిని స్కూల్‌కు పంపడానికి భయపడ్డాను. ఇప్పుడు అలాంటి భయాలేవీ లేవు. స్కూల్‌ అయిపోగానే  అమ్మాయిల కోసం ఆశా టీచర్‌ నిర్వహిస్తున్న సెల్ఫ్‌–డిఫెన్స్‌ క్లాసులను దగ్గర నుంచి చూశాను. అమ్మాయిల్లో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది. ప్రతి స్కూల్లో ఆశలాంటి టీచర్‌ ఒకరు ఉండాలి’ అంటున్నాడు ఆ ఊరికి చెందిన జస్వంత్‌.

అమ్మాయిలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఆశ టీచర్‌ చేస్తున్న కృషికి ఎన్నో పురస్కారాలు లభించాయి. ఆత్మరక్షణ విద్యల వల్ల అమ్మాయిల్లో కనిపించే ఆత్మవిశ్వాసమే తనకు అసలు సిసలు గురుదక్షిణ అంటుంది ఆశా సుమన్‌.

మరిన్ని వార్తలు