నేడు విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ | Sakshi
Sakshi News home page

నేడు విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ

Published Sat, Oct 14 2023 12:38 AM

ఏర్పాట్లను పరిశీలిస్తున్న జేసీ మయూర్‌ అశోక్‌ - Sakshi

● హాజరు కానున్న కేంద్రమంత్రి ● పూర్తయిన ఏర్పాట్లు

విజయనగరం అర్బన్‌: జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన ఉపకరణాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ అలీమ్‌ కో సహాయంతో పెద్ద ఎత్తున పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు నగరంలోని రాజీవ్‌ స్టేడియంలో శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో జిల్లాలోని 434 మంది విభిన్న ప్రతిభా వంతులకు వివిధ ఉపకరణాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో రూ.42 వేల విలువైన బ్యాటరీతో నడిచే మోటరైజ్డ్‌ మూడు చక్రాల సైకిళ్లను కేంద్ర సామాజిక సాధికారిత సమాయ మంత్రి ఎ.నారాయణస్వామి శనివారం జరిగే కార్యక్రమంలో అందజేయనున్నారు. దీంతోపాటు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గుర్తించిన 310 మందికి ఉపకరణాలు అందజేచేసేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో నియోజకవర్గాల వారీగా నిర్వహించిన గుర్తింపు శిబిరాల ద్వారా ఎంపికై న వారందరికీ ఆయా నియోజకవర్గాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో రాజీవ్‌ స్టేడియంలో ఉపకరణాల పంపిణీ ఏర్పాట్లపై జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ శుక్రవారం స్టేడియాన్ని సందర్శించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విభిన్న ప్రతిభావంతులకు కూర్చునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వచ్చిన లబ్ధిదారులు, వారి సహాయకులకు భోజన వసతి సమకూర్చాలని ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతులకు బ్యాటరీతో కూడిన ట్రైసైకిళ్లను ఎలా వినియోగించాలో అవగాహన కల్పించాలని చెప్పారు. వాటిని ఆయా మండలాలకు పంపించేందుకు రవాణా ఏర్పాట్లు చేయాలని రవాణాశాఖ అధికారులను జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ గౌరీశంకర్‌, డీఎస్‌ఓ మధుసూదనరావు, సెట్విజ్‌ సీఈఓ రాంగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

పంపిణీకి సిద్దంగా ఉన్న బాటరీ ట్రైసైకిళ్లు
1/1

పంపిణీకి సిద్దంగా ఉన్న బాటరీ ట్రైసైకిళ్లు

Advertisement
Advertisement