Prachi Dhabal Deb: ఆ కేకుల కోసం క్యూ కడతారు

4 May, 2023 00:11 IST|Sakshi
కేక్‌ ఆర్టిస్ట్‌ ప్రాచీ ధబల్‌

కేక్‌ ఆర్టిస్ట్‌ ప్రాచీ ధబల్‌

బొమ్మలేసే ఆర్టిస్టు గురించి విన్నాం. కేక్‌ ఆర్టిస్ట్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రాచీ ధబల్‌ను మన దేశంలో బేకింగ్‌ క్వీన్‌గా, గొప్ప కేక్‌ ఆర్టిస్ట్‌గా పిలుస్తారు. కేక్‌లను కళాత్మకంగా సౌందర్యాత్మకంగా చేసి తినడానికే కాదు చూడటానికి కూడా రుచికరంగా తయారు చేసి అంతర్జాతీయ అవార్డులు పొందుతోందామె. ఈ ఫొటోలు చూడండి. అన్నీ తినే కేకులే. ‘మీరూ ఇలా కొత్తగా ట్రై చేసి సక్సెస్‌ సాధించండి’ అంటోంది ప్రాచీ.

ప్రపంచ ప్రఖ్యాత కేక్‌ ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా? యూకేకు చెందిన ఎడ్డీ స్పెన్స్‌. కళాత్మకమైన కేకుల తయారీలో ఆయన ప్రతిభకు అక్కడి ప్రభుత్వం ‘సర్‌’ బిరుదుతో గౌరవించింది. ‘నేను లండన్‌ వెళ్లి ఆయన దగ్గర పని నేర్చుకున్నాను. నాకు కేక్‌ ఆర్ట్‌ అంటే అంత పిచ్చి’ అంటుంది ప్రాచీ ధబల్‌.

36 ఏళ్ల ప్రాచీ గత సంవత్సరం 100 కిలోల కేక్‌ను తయారు చేసింది. ఇది ఇటలీలో ప్రసిద్ధమైన మిలాన్‌ కేథడ్రల్‌ (చర్చ్‌)కు రెప్లికా. ఆరున్నర అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ చర్చ్‌ ఆకారపు కేక్‌లో దాదాపు 1500 సున్నితమైన భాగాలు ఉన్నాయి. వాటన్నింటినీ రాయల్‌ ఐసింగ్‌ (తెల్ల సొన, చక్కెర పొడుల మిశ్రమం)తో తయారు చేసి ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ 2022’లో ఎక్కింది ప్రాచీ. అందుకే ఆమెను ‘బేకింగ్‌ క్వీన్‌ ఆఫ్‌ ఇండియా’ అంటుంటారు.

చిన్నప్పటి నుంచి
ప్రాచీ ధబల్‌ సొంత ఊరు డెహరాడూన్‌. అక్కడే పుట్టి పెరిగింది. ‘నాకు పదేళ్లున్నప్పుడు వేసవి సెలవుల్లో కేకుల తయారీని మా అమ్మ నాకు కాలక్షేపంగా నేర్పింది. నేను కప్‌కేక్‌లు తయారు చేసేదాన్ని. రోజులు పెరిగే కొద్దీ ఆ ఆసక్తి కూడా పెరిగింది. నాకు బొమ్మలు వేయడం కూడా వచ్చు. కథల పుస్తకాలు బాగా చదివేదాన్ని. నా పుట్టిన రోజున బయట కేక్‌ ఆర్డర్‌ ఇస్తున్నప్పుడు నేను చదివిన కథల్లోని కోటల్లాంటి, రాకుమార్తెల్లాంటి, ఉద్యానవనాల్లాంటి కేక్‌లు తెప్పించమని మా అమ్మను పోరేదాన్ని. కాని అలాంటి కేకులు ఎవరూ తయారు చేయరు. మార్కెట్‌లో మామూలు కేకులు ఉండేవి. నాకు అలాంటివి ఎందుకు తయారు చేయకూడదు అనిపించేది’ అంది ప్రాచీ ధబల్‌.

ఉద్యోగం నచ్చలేదు
ప్రాచీ కోల్‌కతాలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది. ఆ తర్వాత ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌గా పూణెలో ఉద్యోగానికి వచ్చి స్థిరపడింది. కాని ఆమెకు ఆ ఉద్యోగం నచ్చలేదు. ‘2012 నాటికి నాకు ఉద్యోగం బోర్‌ కొట్టింది. అందులో నాకు ఇష్టమైనదేదో లేదు. నాకు కేక్‌ ఆర్టిస్ట్‌గా మారాలనిపించింది. కాని ఆ రోజుల్లో ఆ కళకు పెద్దగా గిరాకీ లేదు. ఎవరికీ అలాంటిది ఒకటి ఉంటుందని తెలియదు. కళాత్మక కేకులు తయారు చేయాలంటే కావలసిన మెటీరియల్‌ మన దేశంలో దొరికేది కాదు. అయినా సరే తెగించి విదేశాల నుంచి కావలసిన సామాగ్రి తెప్పించుకుంటూ రంగంలో దిగాను. నేను తయారు చేసేది షాపులో అమ్మే కేకులు కాదు. కస్టమైజ్డ్‌ కేకులు. అందువల్ల వీటి ఖరీదు కూడా ఎక్కువ. అలాంటి కస్టమర్లు పెరిగే వరకూ నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. కాని నా ప్రత్యేకమైన కేకులు నలుగురి దృష్టిలో పడ్డాక ఇప్పుడు ఊపిరి సలపడానికి కూడా టైమ్‌ లేదు’ అని నవ్వుతుంది ప్రాచీ.

దేశీయత
ప్రాచీ తయారు చేసే కేకులు దేశీయతతో నిండి ఉంటాయి. చీరల మీద డిజైన్లు, ఆర్కిటెక్చర్, సంప్రదాయ చిహ్నాలు అన్నీ ఆమె కేకుల్లో కనిపిస్తాయి. ఇటీవల ఆమె బెనారస్‌ చీరను, ఆభరణాలను పోలిన కేక్‌ను తయారు చేసింది. ‘కుంకుమ భరిణె’ లా కనిపిస్తున్న ఆ కేక్‌ ఎన్నో ప్రశంసలు పొందింది. ఆమె తయారు చేసిన నెమలి కేక్‌లో పైకి ఆభరణాలుగా కనిపించేవి కూడా తినదగ్గ మెటీరియల్‌తో తయారు చేసినవే. అయితే  ఈ కళను ప్రాచీ తన దగ్గరే దాచుకోవడం లేదు. యువ బేకర్‌లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసి నేర్పుతోంది. ‘అమ్మాయిలు ముందు తమకు ఇష్టమైన రంగంలో కనీస డిగ్రీ సంపాదించాలి. ఆ తర్వాత ఆ ఇష్టం కోసం కష్టపడాలి. తప్పకుండా విజయం లభిస్తుంది. కష్టపడకుండా ఏదీ రాదు’ అంటుంది ప్రాచీ.
పాత దారిలో కొత్తగా నడవడమే విజయం అని ప్రాచీ విజయం తెలుపుతోంది.

మరిన్ని వార్తలు