ఆయన ప్రణాళిక అమోఘం

4 Jul, 2022 09:10 IST|Sakshi

సువార్త 

దేవుని సహవాసంలో ఉచితంగా లభ్యమయ్యే బలాన్ని పొందుకోవడమే మనకు అసలైన ఆశీర్వాదం!  

బలము తెచ్చుకొని వెళ్ళుము... నిన్ను పంపిన వాడను నేనే (న్యాయా 6:14). కష్టించి పనిచేసిన తరువాత చేతికొచ్చిన ప్రతిఫలం కళ్ళముందే ఎవరైనా తన్నుకుపోతే ఎంత బాధ ఉంటుందో కదా? చెమటోడ్చి సంపాదించిన వాటిని శత్రువులొచ్చి తీసుకుపోతే ఎంతటి వేదన గుండెలోతుల్లో ఉంటుందో కదా? చాలా సంవత్సరాల క్రితం గిద్యోను కాలంలో కూడా ఇశ్రాయేలీయులు అలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు. ఆ విపత్కర సమయంలో దేవుడు గిద్యోనుతో పలికిన మాటలు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చూడగలం. తన ప్రజలను రక్షించడానికి గిద్యోను మీద ఉంచబడిన బాధ్యత చాలా గొప్పది. అనాది నుండి దేవుడు తన ప్రజలను కొన్ని ప్రత్యేక ఉద్దేశ్యాల కోసం పిలుస్తూనే ఉన్నాడు. మహాశ్చర్య కార్యములను నెరవేర్చుటకు తన వారిని వినియోగించుకొంటూనే ఉన్నాడు. దేవుని పిలుపు వెనుక అద్భుతమైన పరమార్థం దాగి ఉంటుంది. కాలయాపన కోసమో, అనవసరంగానో దేవుడు ఎవ్వరిని పిలువలేదు... పిలువడు కూడా.

ఆ కాలంలో మిద్యానీయుల భయంతో ఇశ్రాయేలీయులంతా కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకొరకు సిద్ధపరచుకొని వాటిలో నివసించేవారు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పంటను దోచుకొనేవారు. కష్టార్జితం ఇల్లు చేరేది కాదు. చాలాకాలం కష్టించి, శ్రమించి పండించిన పంట చేతికొచ్చే వేళ మిద్యానీయులు వచ్చి సమస్తాన్ని కొల్లగొట్టేవారు. కొన్ని కొన్నిసార్లు విత్తనములు విత్తిన తరువాత మిడతల దండంత విస్తారంగా వారిమీదకు వచ్చి పంటను పాడుచేసి గొర్రెలను, యెడ్లను, గాడిదలను, జీవనసాధనమైన వాటిని దొంగిలించి వారిని బహుగా బాధించేవారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు చేరుకున్న తరుణంలో దేవుడు గిద్యోను ద్వారా వారిని రక్షించడానికి సంకల్పించాడు. అవును! ఆయన దివ్యమైన ప్రణాళికలు ఎప్పుడూ అమోఘమైనవే. భయకంపిత వాతావరణంలో బతుకుతున్న గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మిద్యానీయులకు భయపడి గానుగ చాటున ఉండి కొద్దిపాటి గోధుమలను దుళ్ళగొట్టి పొట్టను పోషించుకోవాలని ఆశిస్తున్న వ్యక్తిని దేవుడు ప్రజలందరికి దీవెనకరంగా మార్చాడు. దేవుని ఉన్నతమైన పిలుపునకు తమను తాము సమర్పించుకున్న ప్రతి ఒక్కరూ దేవుని నామమును అత్యధికంగా మహిమపరిచారు. దేవుని కార్యముల కోసం పిలువబడడం, నియమించబడడం ఎంత ఆశీర్వాదమో కదా. దేవుని సహవాసంలో ఉచితంగా లభ్యమయ్యే బలాన్ని పొందుకోవడమే మనకు అసలైన ఆశీర్వాదం!   – డా. జాన్‌ వెస్లీ, క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు