దీవినే నిర్మించకున్న జంట! ఏకంగా రూ. 16 కోట్లు..!

1 Oct, 2023 12:13 IST|Sakshi

ఖాళీగా ఉన్న దీవుల్లో ఎవరైనా ఇళ్లు నిర్మించుకుంటారు. అదంత విశేషం కాదు. కెనడాకు చెందిన ఒక జంట తమ కోసం ఏకంగా దీవినే నిర్మించుకున్నారు. వాంకోవర్‌ పడమటి తీరంలో ఈ దీవిని నిర్మించుకోవడానికి వాళ్లు ఇరవై ఏడేళ్లు అహరహం శ్రమించారు. వేన్‌ ఆడమ్స్, కేథరీన్‌ కింగ్‌ అనే దంపతులు అన్నీ వదిలిపెట్టి 1992లో వాంకోవర్‌కు చేరువలోని జనసంచారం లేని తీరప్రాంతానికి వలస వచ్చేశారు. రెక్కల కష్టంతోనే అక్కడ ఇల్లు కట్టుకున్నారు.

ఇంటి పరిసరాల్లో పంటలు పండించుకోవడం, చేపల వేటతోనే స్వయంసమృద్ధి సాధించుకున్నారు. క్రమంగా మరికొన్ని కట్టడాలను నిర్మించుకుని, తమ పరిధిని విస్తరించుకున్నారు. తోటలను ఏర్పాటు చేసుకున్నారు. వినోదం కోసం ఆరుబయట నృత్యవేదికను కూడా నిర్మించుకున్నారు. సొంతంగా ఒక దీవిని నిర్మించుకుంటే బాగుంటుందనే ఆలోచనతో, ఇరవై ఏడేళ్ల కిందట ఆ దిశగా పనులు ప్రారంభించారు.

తుఫానుల్లో కొట్టుకొచ్చిన కలప దుంగలు, చేపల వేట కోసం ఉపయోగించే వలలు, తాళ్లు మాత్రమే ఉపయోగించి, నీటిపై తేలియాడే చక్కని ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కృత్రిమ దీవిలో నివాసమే కాకుండా, ఇందులోనే తమకు కావలసిన పంటలు పండించుకోవడానికి కూడా పూర్తి వసతులను ఏర్పాటు చేసుకున్నారు. తమదైన దీవిని తయారు చేసుకోవడానికి వారు దాదాపు ఒక మిలియన్‌ పౌండ్లు (రూ.10.32 కోట్లు) ఖర్చు చేశారు. ఈ దీవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి..ఏకంగా రూ. 914 కోట్లు!ముఖేశ్‌అంబానీ కూతురు మాత్రం కాదు!)

మరిన్ని వార్తలు