ఓ చెంచాడు అయినా లేకపోతే...

3 Apr, 2023 00:23 IST|Sakshi
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

గురువాణి

కష్టం వచ్చినప్పుడు భగవంతుడు మన పక్షాన లేడు.. అనుకుంటాం. దేముడు చల్లగా చూసాడు–అని సుఖం కలిగినప్పుడు అనుకుంటుంటాం. కానీ భగవంతుడికి ఏ పక్షపాతమూ లేదు, ఆయన ఎవరిపక్షాన ఉండడు.

‘‘దృషద్విచిత్రతల్పయో ర్భుజంగమౌక్తికస్రజో/
ర్గరిష్ఠరత్న లోష్టయోః సహృద్విపక్ష పక్షయో:/
తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః /
సమప్రవత్తికః కదా సదాశివం భజామ్యహమ్‌.’’

కటిక నేలనుంచీ, హంసతూలికా తల్పం వరకూ, మహారాజు నుండి సామాన్యుడి వరకు, మిత్రపక్షం అనీ, శత్రుపక్షం అనీ తేడా లేకుండా అన్నిటినీ సమాన దృష్టితో చూసే ఆ సదాశివుడికి నమస్కారం.. అంటాం.

వివేకానందుడు చెప్పినట్టు – ఈ ప్రపంచమంతా నీ పూజా మందిరంగా చూసే శక్తి రావాలి. భగవంతుడిని ఏమార్చి ఆయనను మన పక్షానికి తీసుకురావడం ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. ఆయన ప్రీతి పొందేది మన నడవడికనుబట్టే. మన నడవడి ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి. మనం సముద్రమంత ప్రయత్నం చేయవచ్చుగాక, కానీ ఓ చెంచాడంత భగవదనుగ్రహం ఉండకపోతే కార్యాలు సఫలీకృతం కావు.

‘ఆచార్య ప్రభవో ధర్మః. ధర్మం అనేది కేవలం పుస్తకాలలో చదువుకుంటేనో, అన్నీ నాకు తెలుసనుకుంటేనో అన్వయం కాదు. నీవు ఎంత అనుష్ఠించావో అదే ధర్మం. ధర్మాత్ముడు.. అనిపించుకోవాలంటే నీ నడవడిక మొత్తం ధర్మబద్ధంగా ఉండాలి. ఆచరించినది ధర్మం. ఆచరించనిది ఎప్పటికీ ధర్మం కాదు. అమెరికాకు అధ్యక్షులుగా చేసినవారిలో చిరస్మరణీయుడైన అబ్రహాం లింకన్‌ ఒక మాటన్నారు...‘‘దేముడు నీ పక్షాన ఉన్నాడా అని ఆలోచించడం కాదు, దేముడి మార్గంలో నీవు ఉన్నావా !’’ అని చూసుకొమ్మన్నారు.

ఆయన బాల్యంనుంచీ అలానే బతికారు. నిరుపేద. చిన్నతనంలో ఒక దుకాణంలో పనిచేస్తుండేవాడు.. ఒక వినియోగదారుడి దగ్గర తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ సొమ్ము తీసుకున్నారు. ఆ తరువాత లెక్కలు చూసుకుంటుంటే తెలిసింది. దుకాణం మూసేసి అర్థరాత్రి వినియోగదారుడి ఇల్లు వెతుక్కుంటూ పోయి తాను ఎక్కువగా తీసుకొన్న మొత్తాన్ని ఇచ్చేసి మరీ వచ్చాడు. అదీ అనుష్ఠానం లో ధర్మం అంటే... ఈ పరిణతి ఆయన ఎంతసేపు పూజ చేసాడు, ఎంత సేపు ప్రార్థన చేసాడు.. అన్న దానినిబట్టి రాలేదు... చిన్నతనం నుంచి అదే నిబద్ధతతో బతకబట్టి వచ్చింది.

మీకు ధర్మంపట్ల అనురక్తి ఉండి ఆచరించినదేదో అదే ధర్మం. అదే సదాచారం. ధర్మంపట్ల అనురక్తి లేకుండా స్వప్రయోజనం చూసుకుంటే అది దురాచారం. ఎక్కడ సదాచారం ఉన్నదో అక్కడ భగవదనుగ్రహం ఉండి తీరుతుంది. ఎక్కడ సదాచారం లేదో అక్కడ దేముని కృప ఎలా సాధ్యం! నీకు ఆకలేస్తే నువ్వే తినాలి. నీకు నిద్రవస్తే నీవే నిద్రపోవాలి. అలాగే నీ నడవడికలో దోషాలను నీవే దిద్దుకోవాలి. సదాచారం పెరుగుతూ ఉండాలి, దురాచారం తగ్గుతూ పోవాలి. ధర్మం చెప్పేది కూడా... నీవు నన్ను కాపాడు.. నేను నీ పక్షాన ఉండి నిన్ను కాపాడతా...అనే.

మరిన్ని వార్తలు