టైం మెచ్చిన ధృవ్‌తార! ‘నెక్స్ట్‌ జెనరేషన్‌ లీడర్స్‌లో స్థానం...

13 Oct, 2023 07:24 IST|Sakshi

యూట్యూబ్‌ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు... ధృవ్‌ రాఠీ. ఈ హరియాణా కుర్రాడు యూట్యూబర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. గాలివాటంగా విజయం సాధించలేదు. తనదైన సక్సెస్‌ ఫార్ములాను రూపొందించుకున్నాడు. ఆడియో స్పేస్‌లోకి అడుగు పెట్టి పాడ్‌కాస్టర్‌గా కూడా సత్తా చాటాడు. ‘డబ్బు కోసం కాదు ప్యాషన్‌తో పనిలోకి దిగండి. సామాజిక బాధ్యతను మరవకండి’ అంటున్న ధృవ్‌ రాఠీ తాజాగా టైమ్‌ మ్యాగజైన్‌ ‘నెక్స్ట్‌ జెనరేషన్‌ లీడర్స్‌ 2023’ జాబితాలో చోటు సంపాదించాడు...

ధృవ్‌ రాఠీ సొంత రాష్ట్రం హరియాణా. జర్మనీలోని కాజ్రువ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో మెకానికల్‌ ఇంజనీరింగ్, అదే ఇన్‌స్టిట్యూట్‌లో రెన్యూవబుల్‌ ఎనర్జీలో మాస్టర్స్‌ డిగ్రీ చేశాడు. ట్రావెల్‌ వీడియోలతో ప్రయాణం ప్రారంభించిన ధృవ్‌ ఆ తరువాత రాజకీయా, సామాజిక అంశాలపై దృష్టి సారించాడు. ‘ఇన్‌సైడ్‌ ది వరల్డ్స్‌ స్మాలెస్ట్‌ కంట్రీ’ ‘గ్రౌండ్‌ రియాలిటీ ఆఫ్‌ దిల్లీ స్కూల్స్‌’ ‘క్లీనింగ్‌ నైన్‌ మిలియన్‌ కేజీ వర్త్‌ ఆఫ్‌ ట్రాష్‌’.... మొదలైన వీడియోలు బాగా పాపులర్‌ అయ్యాయి. ఏదో ఒక వీడియో చేయాలి, వదలాలి అని తొందర పడకుండా ఆచితూచి ఆలోచించి వీడియోలు చేసేవాడు ధృవ్‌.

‘చేయకపోయిన ఫరవాలేదు. చేసింది మాత్రం బాగుండాలి’ అని గట్టిగా నమ్ముతాడు. ఒక అంశంపై వీడియో చేయాలనుకున్నప్పుడు ‘కెమెరా ఉంది కదా. ఇది చాలు’ అనుకోకుండా ఆ అంశంపై లోతుగా రిసెర్చ్‌ చేస్తాడు. జర్నల్స్, రిపోర్ట్స్‌ చదవడంతో పాటు ఎంతోమంది నిపుణులతో మాట్లాడతాడు. ఆ తరువాతే పనిలోకి దిగుతాడు. ‘డబ్బులు బాగా గడించాలనే లక్ష్యంతో యూట్యూబర్‌గా మారవద్దు. యూట్యూబ్‌ అనేది జస్ట్‌ ఫర్‌ మనీ అనే భావనను మనసులో నుంచి తీసివేయాలి. ప్యాషన్‌ ఉన్నప్పుడే క్రియేటర్‌ కావాలి. ఒక క్రియేటర్‌ సక్సెస్‌ కావడానికి ఓపిక అనేది అతి ముఖ్యం. ఇక నేను తెలుసుకునేది ఏమీ లేదు అనుకోకుండా అనుభవాలు, పరిస్థితుల నుంచి ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకోవాలి.

నేను నేర్చుకున్నది ఏమిటో నా గత వీడియోలు, ఇప్పటి వీడియోలకు మధ్య ఉన్న తేడాను గమనిస్తే తెలుస్తుంది. ఖరీదైన టెక్నికల్‌ టూల్స్‌ వాడినంత మాత్రాన పేరు రాదు అనేది గ్రహిం చాలి. వృథాగా డబ్బులు ఖర్చు చేయవద్దు. సింపుల్‌  కెమెరా ఫోన్, ఫ్రీ వీడియో ఎడిటర్‌తో మన ప్రయాణం మొదలు పెట్టవచ్చు. సామాజిక బాధ్యతను ఎప్పుడూ మరవద్దు’ అంటాడు ధృవ్‌. ‘పాపులర్‌ యూట్యూబర్‌’గా పేరు వచ్చినప్పటికీ అక్కడే ఆగిపోకుండా ఆడియో స్పేస్‌లోకి అడుగు పెట్టాడు ధృవ్‌ రాఠీ. పాలిటిక్స్, ఎంటర్‌టైన్‌మెంట్, సోషల్, ఎకనామిక్స్‌ టాపిక్‌లను కవర్‌ చేస్తూ పాడ్‌కాస్టర్‌గా కూడా తానేమిటో నిరూపించుకున్నాడు.

‘పాడ్‌కాస్ట్‌లో అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. విజువల్‌గా ఆట్టుకునే అవకాశం లేదు. యానిమేషన్‌కు వీలులేదు. కేవలం మాట మాత్రమే ముఖ్యం అవుతుంది. శ్రోతలు తమ పనులు చేసుకుంటూ కూడా మన మాటలు ఆసక్తిగా వినేలా చేయాలి. పాడ్‌కాస్టింగ్‌లో నేను వీడియోలో ఎలా కనిపించాలి? అనేదాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆకట్టుకునేలా ఎలా మాట్లాడాలి? అనేదానిపైనే దృష్టి ఉంటుంది.

నా ముఖాన్ని మాత్రమే కాదు గొంతు కూడా చాలామంది గుర్తుపట్టడం అనేది పాడ్‌కాస్టింగ్‌లో నాకు ప్లస్‌పాయింట్‌ అయింది. పాడ్‌కాస్టర్‌గా నాకు మంచి మార్కులు వేస్తూ శ్రోతలు నుంచి మెయిల్స్, మెసేజ్‌లు వస్తుంటాయి’ అంటున్న ధృవ్‌ అభిరుచుల విషయానికి వస్తే...ప్రయాణాలు, ఫొటోగ్రఫీ, స్కూబా–డైవింగ్, పుస్తక పఠనం అంటే ఇష్టం. ‘తక్కువలో ఎక్కువ’ అనేది నమ్మే సూత్రం. 

(చదవండి: సాధారణ ఉద్యోగిగా అడుగుపెట్టి..నేడు సంపన్న మహిళగా..!)

మరిన్ని వార్తలు