మంచి మాట: అన్వేషణ ఏమిటి? ఎందుకు?

8 Aug, 2022 00:13 IST|Sakshi

అన్వేషణ ఓ సాహసకృత్యం, ప్రయాణం, వేట, డేగ కన్ను, లోచూపు. ఒక కొత్తపుంత, అద్భుత సృజన, చింతన, సత్యశోధన,  నిత్యసాధన, తపన. జ్ఞాన సముపార్జన. అన్వేషణ ఒక జీవిత పోరాటం. అన్వేషణ జీవితంలో అతి ముఖ్యమైన అంతర్భాగం. ప్రతి ప్రాణికి తప్పనిది, తప్పించుకో లేనిది. అయితే దీనిలో స్థాయీభేదముంటుంది. దీన్నే దృష్టి అంటాం. ఇది ఎవరి కెలా ఉంటుందనేది వారి వారి జీవిత నేపథ్యం, భౌగోళిక, సామాజికాంశాలతో పాటు చదువుల సారం మీద కూడ ఆధారపడుతుంది.  హృదయ సంస్కారం కూడ ఈ అన్వేషణలో చేర్చతగ్గ ముఖ్యాంశమే.

మన ఉనికికి భౌతికరూపమైన ఈ శరీరాన్ని పోషించుకునేందుకు అవసరమైన ఆహారాన్ని సంపాదించుకునే యత్నంతో అన్వేషణ ప్రారంభమవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి అత్యంతావశ్యకమైనది. పక్షులు సైతం తమ పిల్లలకోసం ఆహారాన్ని సంపాదించి నోటిలో పెట్టటం సాధారణ దృశ్యం.

ఆదిమానవుడు ప్రకృతి, సూర్యోదయ, చంద్రోదయాలను, మెరుపులను ఉరుముల శబ్దాన్ని రుతు మార్పులను చూసి, జంతువులను చూసి ఎంతగానో భయపడ్డాడు. క్రమేణా భయాన్ని వీడుతూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఈ  మార్పులు సహజమన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. జీవితం నేర్పిన ఈ జ్ఞానం అతడికి ఆలోచనా శక్తినిచ్చింది. ఇదీ ఒక అన్వేషణే. ఎంతో గొప్పదైనది.

మానవ సమూహాల సంఖ్య పెరిగిన కొద్దీ అహారవసరాలు పెరిగాయి. నివాసాల అవసరాలు వచ్చాయి. ఇది వ్యవసాయానికి, ఇళ్ల నిర్మాణానికి దారి తీసాయి. మనిషి భయం, అవసరం అతడిని కొత్త మార్గాలను, పద్ధతులను కనిపెట్టేటట్టు చేసింది. చేస్తూనే ఉంటుంది. ఇది మనిషికి  ఉన్న ఆలోచనా శక్తి వల్ల వచ్చింది. మనిషికున్న ఈ అన్వేషణా మేధ ఎప్పటికప్పుడు నూతన ఒరవళ్ళకు శ్రీకారం చుడుతూనే ఉంటుంది.

 ‘అవసరం’ అన్వేషణను ప్రేరేపించే అంశాలలో మొట్టమొదటిది. రెండవది ‘ఆసక్తి లేదా ‘జిజ్ఞాస.’ మనిషికి ఉత్సకత ఉండాలి. ఇది ప్రశ్నించేటట్టు చేస్తుంది. ప్రతిదాన్ని నిశితంగా, లోతుగా చూసే చూపునిస్తుంది. అది ప్రకృతి పరమైనది కావచ్చు. లేదా ఆత్మానుగతమైనదీ కావచ్చు. ఒక శాస్త్రవేత్త, ఒక సిద్ధార్థుడు దీనికి మనకు గొప్ప నిదర్శనంగా నిలుస్తారు.

ఈ సృష్టి ఎలా ఏర్పడింది.. జీవపరిణామం ఏమిటన్నది ఒకరి ఆలోచన అయితే, మరొకరిది ఈ సృష్టిలో మనిషి ఆస్తిత్వమేమిటి, చావు పుట్టుకల చట్రం నుండి బయటపడేదెలా అన్న ఆలోచనమరొకరిది. మార్గాలేవేరు అంతే. ఇద్దరూ మేధోమధనం చేసేవారే. ఇరువురూ జ్ఞానసాధకులే, సత్యశోధకులే. సామాన్యులకు అర్థం కాని, తట్టని జీవిత రహస్యాలను విడమరచి చెప్పే మాన్యులే.

ఈ అన్వేషణ శక్తి సహజాతం కానప్పుడు అలవరచుకోవటం కష్టం. ఎవరైతే ఆ శక్తి లేదనుకుంటారో వారు ప్రయత్నం చెయ్యాలి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలనగా చూడాలి. మనుషుల ప్రవర్తనను గమనిస్తూ విశ్లేషణ చేసుకోవాలి. ఈ అన్వేషణ అనే లోతైన సముద్రంలో తార్కికత, గొప్ప అవగాహనా శక్తి, కఠోర శ్రమలతోపాటు గొప్ప జిజ్ఞాస తోడు చేసుకుని ఈదగలిగితే రత్నాలు.. మణులు, మాణిక్యాలు దొరుకుతాయి. అయితే, ఇంతటి సాధన.. శోధన కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి వారికే జగతి జేజేలు పలుకుతుంది.

అన్వేషణకు మార్గమే కాదు లక్ష్యం కూడ సరైనదిగా ఉండాలి. వక్రమార్గంలో స్వార్థపూరితంగా చేసే అన్వేషణ ప్రపంచానికి ఏ ప్రయోజనాన్నీ ఇవ్వకపోగా చేటు చేస్తుంది.
వ్యక్తికైనా, సమాజానికైనా, దేశానికైనా, పరశువేది, అమృతం గురించి అన్వేషించిన వాళ్ళ జీవితాలు ఎలా వృథా అయ్యాయో చరిత్ర చెప్పనే చెప్పింది. కొన్నిదేశాలు చేసే ప్రయోగాలు, శాస్త్రపరిశోధనలు మానవాళికెంత హాని కలిగించాయో మనకు తెలుసు. అందుకనే అన్వేషణకు ఉత్తమ లక్ష్యం ఉండాలి. అప్పుడే ఉత్తమ సాధనాపథం అమరుతుంది.

ఉత్తమ సాహిత్యం చదువుతున్నప్పుడు ఈ అన్వేషణ అనే వివేచనా నయనం అవసరం. అప్పుడే ఆ కవి లేదా రచయిత సృజనలోని విశిష్టతను పసిగట్టగలం. ఆ కావ్యంలోని భాషా సొబగులను.. కవి భావనా పటిమను, కవి చూసిన సాహితీ లోతులను.. ఆ కావ్యప్రయోజనాన్ని అర్థం చేసుకోగలం. లోపాలను చూడగలిగే విమర్శనాశక్తికి ఈ అన్వేషణ గొప్ప సాధనమవుతుంది.
అన్వేషణంటే కొందరి భావన కొత్త ప్రదేశాలను సందర్శించటం, కొత్త వ్యక్తులను కలవటం. వారి సంస్కృతిని దాని గొప్పదనాన్ని చూడగలగటం. అనుసరణ యోగ్యమైతే స్వీకరించటం.

రక్త సంబంధీకులు, స్నేహితులు, హితులు, శ్రేయోభిలాషులు, ఇరుగుపొరుగు,  ముఖ పరిచయం కలవారు... ఇలా అనేకమంది తో సాగేదే మన ఈ జీవితనౌక. దీనిలో మనతో, మన భావాలతో, మన ధోరణితో ఒదిగి మనతో ఎక్కువకాలం పయనించ గలిగే వారి కోసం మనం అన్వేషించాలి. మనకు కష్టం కలిగినవేళ నేనున్నాననే వారి చేతి స్పర్శ, బాధపడే సమయాన మనకొరకు చెమ్మగిల గల నయనం, మనం తలను వాల్చేటందుకు ఒక భుజం, మనం తలవాల్చ గల ఎద మనకు కావాలి. ఒక సహచర్యం ప్రతి ఒక్కరికీ అవసరం. అందుకోసం ప్రతి ఒక్కరూ వెతకాలి.

ఆస్తికులకి అన్వేషణ అంటే ఆత్మ శోధన. ఆత్మతత్వమేమిటో తెలుసుకోవాలనే తపన. జీవాత్మ, పరమాత్మల సంబంధం, సంలీనం కోసం ఆరాటం. నాస్తికులకు, మానవతా వాదులకు మాధవ సేవ కన్నా మానవ సేవ ముఖ్యం. అన్నార్తుల, బాధార్తుల, అనాథలను ఆదుకోవాలనే తపన వీరిది. ఇది కూడా ఒక విధమైన అన్వేషణే. ఇది కూడా అలవర చుకోవలసిన అన్వేషణమే.

 విద్యను గరిపే గురువులకు అన్వేషణాశక్తి ఎంత అవసరమో దానిని నేర్చుకునే విద్యార్థులకు అది అంతే ఆవశ్యకం. గురువు తన జ్ఞానాన్ని నిత్యవసంతం చేసుకోవాలి. క్లిష్టమైన అంశాలను శిష్యులకు బోధించే సులభమైన పద్ధతులను వెతకాలి. శిష్యులు కూడ గురువు అందిస్తున్న జ్ఞానాన్ని తరచి చూసే అలవాటు చేసుకోవాలి. ఈ రకమైన అన్వేషణ వల్ల తాను పొందే జ్ఞాన సత్యాసత్యాలు తెలుస్తాయి. పరిశోధకులకు ఈ అన్వేషణ చాలా అవసరం.

అంతవరకూ ప్రపంచం విశ్వసిస్తున్న ఒక నిజాన్ని, ఒక సిద్ధాంతాన్ని త్రోసిరాజని నిరూపణ చేసే శక్తి అన్వేషణ మనిషికిస్తుంది. అసలు నిజమేమిటో ప్రపంచానికి చాటాలంటే మనకెంతో స్థైర్యం ఉండాలి. చరిత్రను పరిశీలిస్తే ఎంతోమంది వేదాంతులు, తత్త్వవేత్తలు, సిద్ధాంతకర్తలు, శాస్త్రవేత్తలు తాము శోధించి తెలుసుకున్న సత్యాన్ని తమ ప్రాణాలను సైతం లెక్కచేయక జగతికి ప్రకటించి జగత్విఖ్యాతులై ప్రాతః స్మరణీయులయ్యారో తెలుస్తుంది.
 
– బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు

మరిన్ని వార్తలు