ఫ్యాషన్‌ డిజైనర్‌ మనాలి జగ్తాప్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ సర్వైవర్

15 Feb, 2021 00:40 IST|Sakshi
క్యాన్సర్‌ బారిన పడక ముందు మనాలి

ఫ్యాషన్‌ డిజైనర్‌ మనాలి జగ్తాప్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ సర్వైవర్‌. ముంబైలో క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటూ కూడా డ్రెస్‌ డిజైనర్‌గా కొనసాగింది. ఫ్యాషన్‌ డిజైనర్‌గా రాణిస్తూ, అవార్డులూ పొందుతోంది. ‘సంతోషంగా ఉండటం వల్లే వ్యాధిని ఓడించగలుగుతున్నాను’ అంటోంది మనాలి.

ముంబయికి చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ మనాలి కిందటి సంవత్సరం క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా 12 కెమోథెరపీలు చేయించుకున్నది. ఇప్పుడు ఆమె మరోసారి తన డిజైనింగ్‌ నైపుణ్యంతో ప్రజలను ప్రభావితం చేస్తోంది. క్యాన్సర్‌ రోగులందరికీ జీవితాన్ని వదులుకోకుండా ముందుకు సాగాలని మనాలి తన జీవితం ద్వారా నిరూపిస్తోంది. 2018 ఏప్రిల్‌లో తన గర్భాశయంలో ఏదో తేడా ఉందని మనాలికి  అర్ధమైంది. ఈ కారణంగానే ప్రతి నెలా భారీగా రక్తస్రావం జరిగేది. ఆపరేషన్‌ చేసి, తన గర్భాశయాన్ని తొలగించాలని ఆమె డాక్టర్‌ని కోరింది. దీంట్లో భాగంగా బయాప్సీ టెస్ట్‌ చేయడంతో ఆమెకు క్యాన్సర్‌ ఉందని తేలింది. క్లినికల్‌ భాషలో, దీనిని ఎండోమెట్రియల్‌ స్ట్రోమల్‌ సార్కోమా అంటారు.

ప్రతిరోజూ సంతోషంగా..
మనాలికి క్యాన్సర్‌ ఉందని కుటుంబంలో అందరూ భయపడ్డారు. అదే సమయంలో, ఆమె ఫ్యాషన్‌ షో కోసం దుబాయ్‌ వెళ్లాల్సి ఉంది. ఆమె తల్లిదండ్రులు మనాలికి క్యాన్సర్‌ అనే విషయం ఆమెకు చెప్పకుండా దాచారు. కాని, వారి విచారకరమైన ముఖాలను చూడటంతో ఆమెకు తన స్థితిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. గతంలో మనాలి కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్‌ లేదు. అందుకే, అది క్యాన్సర్‌కు దారి తీస్తుందని వారూ గుర్తించలేదు. తన చావో బతుకో ఏదైనా జరగవచ్చని మనాలికి తెలుసు. దీంతో బతికి ఉన్నన్నాళ్లూ తన కుటుంబంతో సంతోషంగా ఉంటూ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంది. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా, ప్రతిరోజూ సంతోషంగా గడపాలని కోరుకుంది. ఈ అనారోగ్యం సమయంలో కూడా మనాలి తన ఆలోచనను సానుకూలంగా మార్చుకుంది.

ముంబయ్‌లోని సహారా స్టార్‌ హోటల్‌లో ఇటీవల జరిగిన లోక్‌మత్‌ లైఫ్‌స్టైల్‌ ఐకాన్‌ 2020 అవార్డు వేడుకలో ఫ్యాషన్‌ డిజైనర్‌ ఐకాన్‌ 2020 అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మనాలి..‘కుటుంబం, స్నేహితులే నా బలం. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా క్యాన్సర్‌ నెమ్మదిగా చంపేస్తుంది. జుట్టు పోతుంది, అందం తగ్గుతుంది. అన్నీ తెలుసు. కానీ, మన కల మనల్ని బతికించాలి. లక్ష్యం వైపుగా ప్రయత్నించాలి అనుకున్నాను. అప్పుడే నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. విగ్గు పెట్టుకుంటాను, డిజైనర్‌ డ్రెస్సులు ధరిస్తాను. అలాగే సంతోషంగా నా జీవితాన్ని తిరిగి మొదలుపెట్టాను. ఇప్పుడు సమస్య లేదని అనను. కానీ, డిజైనర్‌గా నా పనిని నేను కొనసాగిస్తూనే ఉంటాను. ఫ్యాషన్‌ షోలలో పాల్గొంటాను. కెరియర్‌లో ఎదుగుతాను. మూడేళ్లుగా నా పనుల్లో ఎక్కడా అంతరాయం రాకుండా చూసుకున్నాను. క్యాన్సర్‌ పేషంట్స్‌కు రోగం పట్ల అవగాహన కల్గిస్తూ మరింత సంతృప్తిగా జీవిస్తాను’ అని తెలిపారు మనాలి.
    
క్యాన్సర్‌ అనగానే బతుకు భయంతో కుంగిపాటుకు లోనయ్యేవారికి మనాలి చెప్పే మాటలు ఉత్తేజాన్ని నింపుతాయి. ఆమె జీవితం ఒక ప్రేరణగా నిలుస్తుంది.

క్యాన్సర్‌ చికిత్స సమయంలో..; ఫ్యాషన్‌ డిజైనర్‌గా అవార్డు అందుకుంటూ..

మరిన్ని వార్తలు