లైఫ్‌ గార్డ్స్‌..: ఫియర్‌లెస్‌ ఫైవ్‌...

12 Apr, 2022 00:06 IST|Sakshi
గోవా తీరంలో విధి నిర్వహణలో...

అందరికీ ‘బేవాచ్‌’ టి.వి. సిరీస్‌ తెలుసు. కాలిఫోర్నియా బీచ్‌లలో ప్రమాదంలో పడే పర్యాటకులను కాపాడే లైఫ్‌గార్డ్స్‌ కథలు అవి. మన దగ్గర కూడా తీర ప్రాంతాల్లో లైఫ్‌గార్డ్స్‌ ఉన్నారు. కాని వారంతా మగవారు. మొదటిసారి గోవాలో ఐదుగురు మహిళా లైఫ్‌గార్డ్స్‌ చార్జ్‌ తీసుకున్నారు. టెన్‌ టు ఫైవ్‌ ఉద్యోగాలు బోర్‌ అని పర్యాటకులను కాపాడటంలో మజా ఉంటుందని వారు అంటారు. తీరంలో చిరుతల్లా తిరుగుతూ నీళ్లల్లో చేపల్లా దుమికే వీరిని చూసి తీరాలు చప్పట్లు కొడుతున్నాయి. కొత్త రక్షకులు వచ్చారన్న ధైర్యంతో కెరటాలతో ఆటలాడుతున్నాయి.

ఎగిసిపడే కెరటాలతో ఆకర్షించడం సముద్రం వంతు. కొత్త ప్రాంతానికి వచ్చామన్న ఉత్సాహంతో ఉరికురికి దూకడం పర్యాటకుల వంతు. సముద్రం మనకు ముద్దొచ్చినా సముద్రానికి మనం ముద్దొచ్చినా మనకే ప్రమాదం. పైకి కనిపించే కెరటాలు వేరు. లోపల లాగే కరెంట్స్‌ వేరు. నీళ్లు కప్పిన నేల కింద గుంతలు ఉండొచ్చు. లోతులు ఉండొచ్చు. ఊహించని ప్రమాదం జరిగి మునిగిపోతుంటే కాపాడేదెవరు?

ఇదిగో ఈ లైఫ్‌గార్డ్సే
సముద్రానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించేవారి వార్తలు మన తీర ప్రాంతాల నుంచి కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే కేవలం పర్యాటకమే ఆధారంగా ఉండే గోవా వంటి చోట అలాంటి వార్తలు తరచూ వస్తే పర్యాటక రంగమే కుంటు పడుతుంది. జనం భయపడి రారు. అందుకే తీరం వెంట లైఫ్‌గార్డ్స్‌ ఏర్పాటు చేసింది గోవా టూరిజం శాఖ ‘దృష్టి మెరైన్‌’ అనే విభాగం ద్వారా. ఈ విభాగం మెరికల్లాంటి ఈతగాళ్లను ఉద్యోగంలో తీసుకుని తీరం వెంట వారిని గస్తీ తిప్పుతూ ఉంటుంది. అయితే ఇదే విభాగం గత కొన్నాళ్లు స్త్రీలను ఈ రంగంలో ప్రోత్సహించేందుకు ప్రకటనలు ఇస్తోంది. మగవారు పాల్గొనే ఈ రిస్కీ జాబ్‌లో స్త్రీలు ఇన్నాళ్లకు ముందుకు వచ్చారు. వారిలో ఐదుగురితో ‘మహిళా లైఫ్‌గార్డ్స్‌’ దళం ఏర్పాటయ్యింది. ఇంతకూ వారెవరు?

సాహసమే జీవితం
ఈ ఐదు మందిలో శ్రియ కరేకర్‌ చిన్నది. వయసు 21. ‘నాకు ఆరేళ్లు ఉన్నప్పుడు సముద్రంలో ఆటలాడుతూ మునిగిపోబోయాను. దెబ్బకు భయపడి మా అమ్మ నన్ను ఈతలో పడేసింది. చిన్న వయసులోనే బాగా నేర్చుకున్నాను. మా అన్న పర్యాటకులను కాపాడే లైఫ్‌గార్డ్‌గా మారాక నాకూ ఈ రంగంలోకి రావాలనిపించింది. దానికి కారణం వాడిలా నాకూ జెట్‌ స్కీ(వాటర్‌ బైక్‌) నడపాలని ఉండటమే. ఇన్నాళ్లకు నా కల నెర వేరింది’ అంటుంది శ్రియ. ఇంతకు ముందు ఆమె ఫ్యాషన్‌ డిజైనర్‌గా పని చేసేది. అలాగే స్విమ్మింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా. ఇప్పుడు ఆమెకు నిజమైన సంతోషం ఇస్తున్నది ఈ లైఫ్‌గార్డ్‌ పనే.

ఇదే టీమ్‌లో ఉన్న 26 ఏళ్ల అనన్య బాత్‌ ఇలాంటి ఉద్యోగం ఉందని తెలిసి హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి వచ్చింది. ‘అక్కడ నేను రెస్టరెంట్‌ మేనేజర్‌గా పని చేసేదాన్ని. బోర్‌ కొట్టింది’ అంటుందామె. లైఫ్‌గార్డ్‌ కావాలంటే కఠినమైన శిక్షణ ఉంటుంది. మునిగిపోతున్నవారిని రక్షించడమే కాదు, బీచ్‌లో జనాన్ని అదుపు చేయడం కూడా వీరి పనే. ఇక ఈ ఐదుగురి టీమ్‌లో అందరికంటే ఎక్కువ వయసు ఉన్న మహిళ చార్మిన్‌ డిసూజా. ఆమె వయసు 45. ‘నేను పుట్టిన ఆరునెలలకే కాళ్లు సరిగా ఎదగలేదని మా తల్లిదండ్రులు నీటితొట్టెలో ఈత మొదలు పెట్టించారు.

ఈత మంచినీళ్ల ప్రాయం నాకు. బేవాచ్‌ చూస్తూ పెరిగినదాన్ని. కాలిఫోర్నియా వెళ్లి అక్కడి బీచ్‌లలో పని చేయాలని కూడా అనుకున్నాను. కుదర్లేదు’ అంటుంది చార్మిన్‌. గోవా లైఫ్‌గార్డ్స్‌గా పని చేసేవారి వయసు స్త్రీలైనా పురుషులైనా 30. కాని చార్మిన్‌ ఈత లాఘవం చూసి ఈ నియమంలో వెసులుబాటు ఇచ్చారు. 27 ఏళ్ల హర్హా నాయక్‌ కూడా జీవితంలో ఏదైనా థ్రిల్‌ ఉండాలని ఈ ఉద్యోగాన్ని ఎంచుకుంది. 24 ఏళ్ల పూజా బుడే మహారాష్ట్ర నుంచి వచ్చి ఈ ఉద్యోగంలో చేరింది. ఇలా భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ఐదుగురు ఇప్పుడు ఒక టీమ్‌గా గోవా బీచ్‌లలో గస్తీ తిరుగుతున్నారు.

పెళ్లి కాదని... వద్దన్నారు
అయితే వీరు ఈ పని ఎంచుకోవడంలో వ్యతిరేకత లేదని కాదు. బంధువులు అభ్యంతరం చెప్పారు. ‘ఈ ఉద్యోగంలో సముద్రం దగ్గర ఎండలో తిరగాలి. చర్మం నల్లబడుతుంది. ఎవరు చేసుకుంటారు పెళ్లి’ అని ఈ వీరిలోని ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకు బంధువులు హితవు చెప్పారు. ఒక కుటుంబంలో అన్న ఈ పని వద్దంటే మరో కుటుంబంలో తండ్రి వద్దన్నాడు. అయినా వీరు ‘మా ఇష్టం. మాకు ఈ పనే ఇష్టం’ అని లైఫ్‌గార్డ్స్‌గా మారారు.

పిక్‌నిక్‌లకు వెళ్లినప్పుడు మగవాళ్ల బట్టలు, చెప్పులు కాపలా కాస్తూ ఒడ్డున కూచునే గృహిణులనే చూసిన ఈ సమాజం ధైర్యంగా సముద్రం మీదకు లంఘించే ఈ అపర జలవనితలను చూసి సంతోషించక తప్పదు. శహబాష్‌ అనకా తప్పదు.

మరిన్ని వార్తలు