వరల్డ్‌ ఫస్ట్‌..రేసింగ్‌ కార్‌ కన్నా వేగంగా పని..

15 Feb, 2022 03:35 IST|Sakshi
మరియన్‌ అల్‌–బజ్‌

కార్ల రేస్‌లకు సంబంధించిన పోటీలను టీవీలో చూస్తున్నప్పుడు కొన్ని అత్యంత వేగంగా పల్టీలు కొడుతుండటం చూస్తుంటాం. ప్రమాదానికి గురైన కార్లను రేస్‌కు అడ్డు రాకుండా అంతే వేగంగా తొలగించే కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. ఇప్పటివరకు ఈ పనిని పురుషులే చేసేవారు. కానీ, ఈ ప్రపంచంలోకీ ఓ మహిళ అడుగుపెట్టి, తన సత్తా చాటుతోంది.

దీంతో వరల్ట్‌ ఫస్ట్‌ ఫిమేల్‌ క్రేన్‌ డ్రైవర్‌గా 30 ఏళ్ల మరియన్‌ అల్‌–బజ్‌ గుర్తింపు పొందింది. రేస్‌ పోటీల్లో క్రేన్‌ డ్రైవర్‌గా ఓ మహిళ నియమితురాలవడం ప్రపంచమంతా గుర్తించదగిన విషయంగా అరబ్‌ ట్రిబ్యూన్‌ ప్రకటించింది. ‘మోటార్‌ ఇంజిన్ల పట్ల ఆమెకున్న మక్కువే ఈ ఏడాది దిరియా ఇ–ప్రిక్స్‌ 2022లో పాల్గొనేలా చేసింద’ని స్పష్టం చేసింది.

    పురుషాధిపత్య రంగంలో ఆల్‌–బజ్‌ చూపిన సాహసం ఎంతోమంది మహిళల్లో స్థైర్యాన్ని నింపుతోంది. అల్‌–బజ్‌ 13 ఏట నుండి వాహనాలను నడపడంలో ఆసక్తి చూపింది.  ఈ విషయాల గురించి ఆమె ఇలా ప్రస్తావిస్తుంది.

ఆసక్తి నేర్పిన పాఠం
    ‘ఒక మహిళ ఈ రంగంలోకి ప్రవేశించగలదని ఎవరూ ఎప్పుడూ అనుకొని ఉండరు. మెకానికల్‌ ప్రపంచమంటేనే పురుషుల ఆధిపత్య వృత్తి. మా నాన్నకు మెకానిక్‌ పని అంటే చాలా ఇష్టం. ఆయన వద్ద చాలా పాత కార్లు ఉన్నాయి. వాటిని రిపేర్‌ చేసి, మళ్లీ మార్కెట్లోకి తీసుకువస్తాడు. నా చిన్నప్పటి నుంచి నాన్న చేసే పనిని ఆసక్తిగా చూస్తుండేదాన్ని. మెల్ల మెల్లగా నైపుణ్యాలను తెలుసుకుంటూ, పెంచుకుంటూ వచ్చాను. ఎప్పుడైనా, దేనిలోనైనా ప్రతిభ చూపాలనుకుంటే మా పేరెంట్స్‌ నాకు పూర్తి మద్దతు ఇస్తారు. అలా చదువుతోపాటు మెకానిక్‌ పరిజ్ఞానం కూడా అబ్బింది.

సాధనతోనే చేరువైన కల
ప్రతి కార్‌తోనూ ఎగ్జిబిషన్స్‌ లేదా రేసుల్లో పాల్గొనేదాన్ని. దీంతో నా కలను మరింత ముందుకు తీసుకెళ్లగలిగాను. నా ఇన్నేళ్ల జీవితంలో కార్లనే అపరిమితంగా ఇష్టపడ్డాను. రేసింగ్, డ్రిఫ్టింగ్‌లో తగినంత అనుభవం ఉంది. జూన్, 2018లో అరబ్‌ కంట్రీలో మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేయడంతో రేస్, డ్రైవర్, మెకానిక్‌ ల వంటి పాత్రలు మహిళలకు అవకాశాలు దక్కేలా చేశాయి. మెకానిక్‌ను కావాలనే నా లక్ష్య సాధనకు ఇది కూడా ఉపయోగపడింది. ఇప్పుడు వీధిలోంచి వెళ్తే చాలు... చుట్టూ ఉన్నవారు నా గురించి తెలుసుకోవడం, గుర్తుపట్టి పలకరించడం, ప్రోత్సహించడం, నా నుంచి నేర్చుకోవాలని ఆసక్తి చూపుతుండటం నాకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

కష్టమైన ఛాలెంజ్‌
ఈ ఏడాది జరిగిన ఇ–ప్రిక్స్‌లో ఫైర్, రికవరీ, ఫాగ్, ట్రాక్‌సైడ్‌ వంటి నాలుగు రకాల మార్షల్స్‌ ఉన్నాయి. వీటిలో నా సామర్థ్యాలను చూసి అధికారులు రికవరీ మార్షల్‌ బృందానికి రిఫర్‌ చేశారు. రేసు జరిగేటప్పుడు ట్రాక్‌పై ప్రమాదం జరిగితే వెనువెంటనే వారు తగిన చర్యలు తీసుకుంటారు. ఇన్నాళ్లూ రికవరీ మార్షల్‌గా ఉండటం మహిళలకు కష్టమైన పనిగా పరిగణించ బడింది. సర్క్యూట్‌లో ప్రమాదం జరిగినప్పుడు వీలైనంత త్వరగా కార్లను తీయడానికి క్రేన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. నా పని ఎంత వేగంగా చేయాలంటే రేసు ప్రవాహానికి అడ్డుపడనంత స్పీడ్‌గా ఉండాలి. ఏదైనా కారు రోడ్‌ బ్లాక్‌కు కారణమయితే, ఇతర రేసర్లకు అడ్డు అవుతుంది. అందుకే, ఈ వృత్తిలో ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ప్రతి క్షణం అలర్ట్‌గా ఉండాలి’ అని తన పని గురించి వివరిస్తుంది అల్‌–బజ్‌.

ఈ యువ డ్రైవర్‌ నేర్చుకున్నది మెకానిక్‌ పని. చదువు మాత్రం పూర్తి భిన్నమైది. లెబనాన్‌లో సైకాలజీ అండ్‌ మీడియాకు సంబంధించిన కోర్సులు పూర్తి చేసింది. కానీ, మోటార్‌ కార్ల ప్రపంచంలో తనని తాను నిరూపించుకోవడానికి ముందుంటుంది. తన మెకానిక్‌ నైపుణ్యాలతో ఇతరులకు శిక్షణ కూడా ఇస్తోంది. సొంతంగా ఆటోమొబైల్‌ రిపేర్‌ షాప్‌ను నిర్వహించాలనుకుంటున్న అల్‌–బజ్‌ డేరింగ్‌ డ్రైవర్‌గా మన్ననలు అందుకుంటోంది.

మరిన్ని వార్తలు