నాలుగైదేళ్లలో జన్యుసవరణ జొన్నలు, రాగులు!

1 Dec, 2023 11:36 IST|Sakshi
ఐసిఏఆర్‌ డెప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (క్రాప్‌ సైన్స్‌) డాక్టర్‌ టి. ఆర్‌. శర్మ

సాక్షి సాగుబడి’తో ఐసిఏఆర్‌ డీడీజీ డా. టి.ఆర్‌.శర్మ

సాక్షి సాగుబడి, హైదరాబాద్‌: చిరుధాన్య వంగడాల అభివృద్ధికి జన్యు సవరణ (జీనోమ్‌ ఎడిటింగ్‌) సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్‌) డెప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (క్రాప్‌ సైన్స్‌) డాక్టర్‌ టి. ఆర్‌. శర్మ వెల్లడించారు. అంతర్జాతీయ చిరుధాన్య సమ్మేళనం 5.0 ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్‌ వచ్చిన శర్మ ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. పోషకాల నాణ్యతను పెంపొందించడానికి, ‘యాంటీ న్యూట్రియంట్ల’ను పరిహరించడానికి జొన్న, రాగి విత్తనాలకు జన్యు సవరణ ప్రక్రియ చేపట్టినట్లు డా. శర్మ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

చిరుధాన్యాలపై గతంలో పెద్దగా పరిశోధనలు జరగనందున జన్యుసవరణ కష్టతరంగా మారిందన్నారు. అందువల్ల జన్యు సవరణకు ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందన్నారు. ఈ పరిశోధనలు శైశవ దశలో ఉన్నాయని, ఈ వంగడాలు అందుబాటులోకి రావటానికి 4–5 ఏళ్ల సమయం పడుతుందన్నారు. మెరుగైన చిరుధాన్యాల వంగడాల అభివృద్ధి దిశగా ఇప్పటికే గణనీయమైన అభివృద్ధి సాధించామని, ఈ కృషిలో భాగంగానే జన్యు సవరణ(జీనోమ్‌ ఎడిటింగ్‌) సాంకేతికతను కూడా చేపట్టామన్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో రానున్న కాలంలోనూ చిరుధాన్యాల ప్రోత్సాహానికి సంబంధిత వర్గాలందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ సమ్మేళనంలో వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి, రానున్న పదేళ్లలో చిరుధాన్యాల అభివృద్ధికి చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆహార, పౌష్టికాహార భద్రత కోసం పర్యావరణ అనుకూల సుస్థిర వ్యవసాయ పద్ధతులను ఐసిఏఆర్‌ ప్రోత్సహిస్తోందన్నారు. ఆహార వ్యవస్థలో సంబంధితులందరూ పరస్పరం సహకరించుకుంటూ చిరుధాన్యాలను ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావాలని డా. శర్మ సూచించారు.

(చదవండి: చిరుధాన్యాలు నిరుపేదలకూ అందాలి!)

మరిన్ని వార్తలు