చెక్‌ చేస్తున్నారా? ‘నాకేంటి ఉక్కులా ఉంటే’.. కనీసం ఏడాదికోసారైనా!

27 Dec, 2021 11:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్యాన్ని చెక్‌ చేస్తున్నారా? అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్‌కు వెళ్లడం కాదు. అనారోగ్యం బారిన పడకుండా ఉండడానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా? ఇంట్లో అరవై దాటిన పెద్దవాళ్లుంటే మాత్రం ఆరోగ్య పరీక్షలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. అరవై ఏళ్లు నిండినప్పటి నుంచి ఆరోగ్యం గురించిన జాగ్రత్తలు తీసుకోవడమే ప్రధానమైన పని అవుతుంది.

ఎక్కువమంది ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిపోయి ఉంటారు. సొంత వృత్తివ్యాపారాల్లో ఉన్న వాళ్లు అరవై దాటినప్పటికీ చలాకీగా పని చేసుకుంటూ ఉంటారు కూడా. ‘వయసు ఒక అంకె మాత్రమే, ఉత్సాహాన్ని నియంత్రించే శక్తి కాదు’ అని చెప్పుకోవడం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమే. కానీ ఈ వయసులో ఆరోగ్య ప్రస్తావన కూడా అంతే అవసరం.

‘నాకేంటి ఉక్కులా ఉంటే’ అని హాస్పిటల్‌కు వెళ్లడానికి మొరాయించే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంట్లో వాళ్లు ఒక నియమం పెట్టుకుని మరీ మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌లు చేయించాలి. హైబీపీ, డయాబెటిస్, గుండె సమస్యల వంటివి ఏవీ లేకుండా హాయిగా జీవిస్తున్న వాళ్లకైతే ఏడాదికోసారి మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ చేయిస్తే సరిపోతుంది.

ఆ హెల్త్‌ చెకప్‌లో ఈ కిందివన్నీ ఉంటాయి.
హీమోగ్రామ్‌ పరీక్ష: ఇందులో హిమోగ్లోబిన్, ప్యాక్‌డ్‌ సెల్‌ వాల్యూమ్, ఆర్‌బీసీ కౌంట్, టోటల్‌ వైట్‌ బ్లడ్‌ సెల్స్‌ కౌంట్, డిఫరెన్షియల్‌ కౌంట్, ప్లేట్‌లెట్‌ కౌంట్, ఎంవీసీ, ఎమ్‌సీహెచ్, ఎమ్‌సీహెచ్‌సీ, ఈఎస్‌ఆర్, పెరిఫెరల్‌ స్మియర్‌ పరీక్షలు ఉంటాయి.

బ్లడ్‌ షుగర్‌: ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌

రీనల్‌ ఫ్రొఫైల్‌ : ఇందులో యూరియా, క్రియాటినైన్, యూరిక్‌ యాసిడ్‌ పరీక్షలు చేస్తారు.

లిపిడ్‌ ప్రొఫైల్‌: టోటల్‌ కొలెస్ట్రాల్, హెడీఎల్‌ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డీఎల్‌ రేషియో పరీక్షలుంటాయి.

జనరల్‌ టెస్ట్స్‌: యూరిన్‌ రొటీన్‌ ఎనాలసిస్, సీరమ్‌ క్రియాటినైన్, ఈసీజీ (విశ్రాంతి దశలో), ఎక్స్‌ –రే (పీఏ వ్యూ) పరీక్షలు చేస్తారు.

మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌కు వెళ్లే ముందు రోజు రాత్రి కడుపు ఖాళీగా ఉంటే మంచిది. అలా ఉండలేని వాళ్లు త్వరగా భోజనం ముగించడం మధ్యేమార్గం. కొంతమందికి వారి జీవనశైలి, దేహతత్వం, కుటుంబ ఆరోగ్య చరిత్రను అనుసరించి మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ల మధ్య నిడివి తగ్గించవలసింది గా డాక్టర్లు సూచిస్తారు. అలాంటి వారు డాక్టర్‌ సూచనను పాటించి తీరాలి.                                              ∙  

హెల్త్‌ క్యాలెండర్‌ 
మాస్టర్‌ చెకప్‌ల కోసం ఇంట్లో ఒక క్యాలెండర్‌ తయారు చేసుకోవడం సులువైన మార్గం. పుట్టిన రోజు నెలలో సదరు వ్యక్తి హెల్త్‌ చెకప్‌ కూడా పూర్తి చేసుకోవాలి. ఇంట్లో అరవై దాటిన ఇద్దరి పుట్టిన రోజులు వరుస నెలల్లో ఉన్నప్పుడు ఏదో ఒక నెలను ఖాయం చేసుకుంటే సౌకర్యంగా ఉంటుంది.

చదవండి: Health Tips: షుగర్‌, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే...

మరిన్ని వార్తలు