Heena Yogesh Bheda: ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది

14 Jul, 2021 13:31 IST|Sakshi

కరోనా కాలాన్ని కాటేసింది. లాక్‌డౌన్‌ జీవితాల మెడ మీద కత్తి పెట్టింది. ఉద్యోగాలు సంక్షోభంలో పడ్డాయి. ఉపాధి మార్గాలన్నీ తలకిందులయ్యాయి. అలాంటి సమయంలో తనకంటూ సొంతంగా ఒక ఉపాధిని కల్పించుకుంది చెన్నై మహిళ హీనా యోగేశ్‌ భేదా. 

అలవాటే... ఆరోగ్యంగా!
రోజూ ఠంచన్‌గా సూర్యోదయం అవుతుంది. నిద్రలేచి దైనందిన కార్యక్రమాలు మొదలు పెట్టి తీరాల్సిందే. బద్దకం వదిలి పనిలో పడాలంటే కడుపులో ఏదో ఒకటి పడాలి. ఆ పడేది నూటికి తొంబై ఇళ్లలో కాఫీ లేదా టీ అయి ఉంటుంది. వార్తాపత్రికల నుంచి ప్రసారమాధ్యమాలన్నీ కాఫీ, టీ వలన కలిగే హాని గురించే మాట్లాడుతుంటాయి. ‘రేపటి నుంచి మానేద్దాం’ అనుకుంటూనే రోజూ చాయ్‌ కప్పు అందుకునే వాళ్ల నాడి పట్టుకుంది హీనా. ఉదయాన్నే వేడి వేడి టీ తాగవచ్చు, ఆ టీతోనే ఆరోగ్యాన్ని పొందవచ్చు. దేహంలో ఉత్సాహంతోపాటు వ్యాధినిరోధక శక్తిని పెంచే టీల రకాలను తయారు చేసింది.

అసలే కరోనా సమయం. వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక, వైరస్‌ బారి నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళన పడుతున్న వాళ్లందరికీ హీనా పరిచయం చేసిన హాని లేని టీలు, ఆరోగ్యాన్ని పెంచే టీలు ఓ మంచి ఆలంబనగా మారాయి. అంతే గత ఏడాది ఆగస్టులో రెండు లక్షల పెట్టుబడితో మొదలైన ఆమె యువ సోల్‌ స్టార్టప్‌ ఇప్పుడు నెలకు రెండు లక్షలకు పైగా అమ్మకాలు సాగిస్తోంది. కేవలం నలుగురు మహిళలు మాత్రమే ఆమె ఉద్యోగులు. మార్కెటింగ్‌ వ్యవహారాలన్నీ హీనా స్వయంగా చూసుకుంటుంది. ఇప్పుడామె ఉత్పత్తులకు మూడు వేల ఐదు వందల మంది రెగ్యులర్‌ కొనుగోలుదారులున్నారు. వాళ్ల నెలవారీ సరుకుల జాబితాలో హీనా టీ ఉంటోంది.

అది ఏమి ‘టీ’!
ఒత్తిడితో కూడిన జీవనశైలిలో నిద్రలేమి, ఆకలి లేకపోవడం, ఆకలి ఉన్నా తినాలనిపించకపోవడం, ఎప్పుడూ నీరసం, త్వరగా అలసి పోవడం మామూలైపోయాయి. నూటికి తొంబై మంది వీటిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వాస్తవాన్ని గమనించారామె. వీటన్నింటికీ ప్రకృతిలోనే సమాధానాలున్నాయి. వాటిని మందుల రూపంలో ఇస్తోంది సంప్రదాయ ఆయుర్వేద వైద్యం. అదే ఔషధాలను హీనా మార్నింగ్‌ టీ రూపంలో పరిచయం చేసింది. ఒక ఆలోచన జీవితాలను మార్చేసింది. వేలాదిమందిని ఆరోగ్యవంతులను చేస్తోంది. 
 

మరిన్ని వార్తలు